Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రొమాలు నిక్కబొడుచుకునే ఉత్కంఠలో మ్యాచ్‌ను మనవైపునకు లాగేసే ఆటగాడు ఎవరు? ఇక గెలుపు అసాధ్యమనే దశ నుంచి అలవోకగా విజయాన్ని అందించగల వీరుడు ఎవరు? లీగ్ దశలో మిగతా 9 జట్లతో తలపడాల్సిన సుదీర్ఘ 2019 ప్రపంచకప్ వేటలో భారత్ అణాస్త్రాలు, గురి తప్పని షూటర్లు ఎవరో చూద్దాం!.
నవతెలంగాణ క్రీడా విభాగం
ప్రతి జట్టుకూ కొందరు ఆటగాళ్లు ఉంటారు. మ్యాచ్ పతాక సన్నివేశాలకు చేరుకున్నప్పుడు, కీలక పాత్ర పోషించేందుకు వాళ్లెప్పుడూ సదా సిద్ధంగా ఉంటారు. అత్యంత కఠిన సందర్బాల నుంచి బయట పడేయగలరని నాయకుడు ఎనలేని నమ్మకం వీరిపై ఉంచుతాడు. తిరుగులేని నైపుణ్యం, ఎదురులేని స్వభావం, విలువైన అనుభవం ఈ ఆటగాళ్ల సహజ లక్షణాలు. మ్యాచ్‌పై ఆశలు కోల్పోయిన తరుణంలో, వీరు మళ్లీ రేసులోకి తీసుకొస్తారు. అందుకే ఈ ఆటగాళ్ల సేవలు వెలకట్టలేనివి, నాయకుడికి ఇష్టమైన అస్త్రాలు. 2019 ప్రపంచకప్ వేటకు బయల్దేరిన టీమ్ ఇండియాకు ఈ కోణంలోని ఆటగాళ్లు ఎవరు? కఠిన పరిస్థితుల్లో గురి తప్పని ఆ షూటర్లు ఎవరో తెలుసుకుందాం..
విరాట్ కోహ్లి : ఛేదనలో మొనగాడు
ఆధునిక క్రికెట్ అత్యుత్తమ బ్యాట్స్‌మన్. భారీ లక్ష్యాలను ఛేదించినప్పుడు భారత్ విరాట్ కోహ్లి కంటే ఎక్కువగా ఎవరిపైనా ఆధారపడదు. క్రీజులో కోహ్లి ఉన్నంతవరకూ ఎంత పెద్ద లక్ష్యమైనా అసాధ్యం అనిపించదు. కండ్లుచెదిరే బ్యాటింగ్ స్కిల్స్, వేలెత్తి చూపలేని ఫిట్నెస్ స్థాయి, అన్నింటికి మించి ఆకాశమంత ఆత్మ విశ్వాసంతో మిడిల్ ఆర్డర్‌ను కోహ్లి బలోపేతం చేస్తున్నాడు. ఛేదనలో కోహ్లి జోరు అసమానం. చాలా మంది బ్యాట్స్‌మన్ ఛేదనలో ఒత్తిడికి గురవుతారు. ప్రత్యేకించి భారీ లక్ష్యాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే పొరపాట్లు చేస్తుంటారు. కానీ కోహ్లి విషయంలో వేరు. కొండంత ఒత్తిడిలో కోహ్లి కొరకరాని కొయ్యగా మారుతాడు. నరాలు తెగే ఉత్కంఠలో పరుగుల వరదతో నాట్యం చేస్తాడు. ఛేదనలో విరాట్ పరుగుల దాహం ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టేస్తుంది. ఇది ఎన్నో సార్లు నిరూపితమైంది. ఛేదనలో కోహ్లి గణాంకాలు సైతం అమోఘం. 133 మ్యాచుల్లో 68.21 సగటుతో 6617 పరుగులు చేశాడు. ఛేదనలో కోహ్లి 25 శతకాలు బాదితే, 21 సార్లు విజయం భారత్‌నే వరించింది.
రోహిత్ శర్మ : గేమ్ ఛేంజర్
కొన్ని సార్లు తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు, ఆ పిచ్‌పై ఎంత స్కోరు చేస్తే సురక్షితమనే విషయంపై స్పష్టత ఉండదు. ఎదురు దాడి చేయాలా? ఓపిగ్గా ఆడాలా? అనే విషయంలో బ్యాట్స్‌మన్ ఊగిసలాటలో ఉండటం.. అవసరమైన చోట వేగం పెంచకపోవటంతో జట్టు స్కోరు అంచనాలను చేరదు. రోహిత్ శర్మ బాదుడు మొదలెడితే.. ఈ సమస్యను తనదైన శైలిలో తీసిపారేస్తాడు. బాహుబలి శతకాలు సాధించటంలో సిద్ధహస్తుడైన రోహిత్ శర్మ.. భారీ స్కోర్లు అందించటంలో ప్రత్యేకత సాధించాడు. నెమ్మది నుంచి వేగం, వేగం నుంచి వాయు వేగానికి గేర్ మార్చటంలో రోహిత్ నిపుణుడు. దాడి ఎలా జరుగుతుందో ప్రత్యర్థులకు తెలుసుకునే లోపు పని పూర్తిచేయగలడు. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ. ఈ డబుల్ సెంచరీలు భారత్ తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు వచ్చినవే. అలాగని, రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ రికార్డు బాగాలేదని కాదు!. ఛేదనలోనూ రోహిత్ ధనాధన్ పవర్ చూపిస్తాడు. అయితే, తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు రోహిత్ శర్మ అత్యుత్తమ ఆట తీరు కనబరుస్తాడు. భారీ స్కోర్లు నమోదయ్యే ప్రపంచకప్‌లో బౌలర్లు కాపాడుకోగల లక్ష్యాలను నిర్దేశించేటప్పుడు.. రోహిత్ శర్మ బ్యాట్ అరిస్తే భారత్ గర్జించటం ఖాయం.
ఎం.ఎస్ ధోని : అపర చాణక్యుడు
వన్డే క్రికెట్ ఛేదనలో ఎల్లప్పుడూ ఎం.ఎస్ ధోని ముగింపు మొనగాడు. ఛేదనలో ధోని సమీకరణాలు, వ్యూహలు తర్కానికి అందవు. కాలంతో పాటు భారత క్రికెట్ దిగ్గజంగా ఎదిగాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో బిగ్ బ్రదర్ మాత్రమే కాదు, 2011లో సచిన్ ప్రేరణ ఇచ్చినట్టు.. 2019లో కోహ్లిసేన ప్రపంచకప్ వేటకు ధోని ప్రేరణగా నిలుస్తున్నాడు. చంద్రగుప్త మౌర్యకు చాణక్యుడు ఉపదేశం అందించినట్టు.. మైదానంలో కెప్టెన్ కోహ్లికి ఎం.ఎస్ ధోని వ్యూహ బ్యాంక్!. కోహ్లి పరిమిత ఓవర్ల ఫార్మాట్ కెప్టెన్సీ అందుకున్న నుంచీ.. ధోని నుంచి అపూర్వ మద్దతు లభించింది. ప్రపంచకప్ భిన్నంగా ఉండదు, మ్యాచ్‌లో క్లిష్ట పరిస్థితుల్లో ఏం చేయాలా? అని తోచినప్పు డల్లా కోహ్లి కండ్లూ ధోని వైపే వెళ్తాయి. క్రికెటింగ్ మేధావి, ముగింపులో మొనగాడుగా భారత శిబిరంలో ధోని అత్యంత కీలకం. ఒత్తిడిలో ప్రశాంతంగా కనిపించే ధోని ప్రపంచకప్‌లో మ్యాచులు ముగించాలని కోరుకోని వారెవరు?!.
జశ్‌ప్రీత్ బుమ్రా : యార్కర్ల హీరో
ప్రపంచ అత్యుత్తమ బౌలర్‌గా గుర్తింపు పొందిన జశ్‌ప్రీత్ బుమ్రా.. భారత క్రికెట్ కిరీటంలో పొదిగిన వెలకట్టలేని వజ్రం. ప్రపంచకప్‌లో కెప్టెన్ ఎప్పుడు పిలిచినా.. బాధ్యత నిర్వర్తించేందుకు తగిన సత్తా, విశ్వాసం బుమ్రా సొంతం. ప్రపంచకప్‌లో పిచ్‌లు ఫ్లాట్‌గా ఉండబోతున్నాయి. పరుగుల వరద పారనుంది. బౌలర్లకు తిప్పలు తప్పవు. ఈ అంచనాలు, సమీకరణాలకు అతీతుడు జశ్‌ప్రీత్ బుమ్రా. ప్రత్యర్థిని కట్టడి చేయటమే కాదు, అవసరమైన చోట వికెట్లు కూల్చి బ్రేక్ ఇవ్వగలడు. ఏ భాగస్వామైనా మ్యాచ్‌ను లాగేసుకుంటుందని అనిపిస్తే.. కెప్టెన్ కోహ్లి బంతి అందించేంది బుమ్రా చేతికే అని చెప్పనక్కర్లేదు. ప్రత్యేకించి డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయటంలో బుమ్రా మాస్టర్. స్లాగ్ ఓవర్లలో పవర్ హిట్టర్లు విరుచుకుపడితే.. కండ్లుచెదిరే యార్కర్లతో బోల్తా కొట్టించేందుకు బుమ్రా సర్వదా సిద్దంగా ఉంటాడు. కచ్చితమైన యార్కర్లు సంధించగల సామర్థ్యం బుమ్రాను వెలకట్టలేని సీమర్‌ను చేసింది.