Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆల్‌రౌండర్లతో జట్టు సమతూకం
- పాండ్య, విజయ్, జడేజా, జాదవ్ మన గన్స్
నవతెలంగాణ క్రీడా విభాగం
భారత్ గెలిచిన రెండు ప్రపంచకప్‌ల్లోనూ ఆల్‌రౌండర్లే కీలక భూమిక వహించారు. చారిత్రక 1983 ప్రపంచకప్ జట్టులో ఎందరో ఆల్‌రౌండర్లు. కపిల్ దేవ్, మోహిందర్ అమర్నాథ్, రోజర్ బిన్నీ, మదన్‌లాల్‌లు బంతితో, బ్యాట్‌తో సత్తా చాటారు. 2011 ధోనీసేనకు ఈ స్థాయిలో ఆల్‌రౌండర్ల అండ లేదు. కానీ బహుముఖ ప్రజ్ఞాశీల యువరాజ్ సింగ్ ఆల్‌రౌండర్ పాత్రను పోషించాడు. యూసుఫ్ పఠాన్ ఒక్కడే సిసలైన ఆల్‌రౌండర్ అయినా, తనదైన ఆఫ్ స్పిన్‌తో యువీ 15 వికెట్లు సహా 362 పరుగులు చేశాడు. ప్రపంచకప్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. ' తుది జట్టు కూర్పును ఏ విధంగా ఉంచుకోవాలి, బ్యాట్స్‌మన్, బౌలర్లలలో ఎవరిని ఎంచుకోవాలనే విషయం ఆల్రౌండర్లను ఎంపిక చేసుకున్న తర్వాతే తేలుతుంది' అని మోహిందర్ అమరనాథ్ అన్నాడు. 1983 ప్రపంచకప్ సెమీస్, ఫైనల్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన మోహిందర్.. 2019లో కోహ్లిసేన విజయాన్ని ఆల్‌రౌండర్లే నిర్ణయిస్తారని అన్నాడు. వెస్టిండీస్ దిగ్గజం క్లైవ్ లాయిడ్ సహా ఎంతో మంది వెటరన్ క్రికెటర్లు 2019 ప్రపంచకప్‌లో ఆల్‌రౌండర్లు కీలక పాత్ర పోషిస్తారని, విజేతను నిర్ణయిస్తారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ప్రపంచ కప్ జట్టులో నలుగురు ఆల్‌రౌండర్లు ఉన్నారు. సీమ్ ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్య, విజరు శంకర్. స్పిన్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, కేదార్ జాదవ్.
తీరని దాహం : కపిల్ దేవ్ నిష్క్రమణ తర్వాత రెండు దశాబ్దాల అన్వేషణకు హార్దిక్ పాండ్య రూపంలో ఓ అయుధం లభించింది. నిఖార్సైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య 2016లో జట్టులోకి వచ్చిన తొలి రోజుల నుంచే కపిల్‌దేవ్ పోలీకలు మొదలయ్యాయి. బంతితో, బ్యాట్‌తో మ్యాచులు గెలిపించగలను అని నిరూపించుకున్న ఆల్‌రౌండర్ పాండ్య. 2016 టీ20 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌పై చివరి ఓవర్ ఆఖరి మూడు బంతుల్లో 2 పరుగులు కాపాడిన పాండ్య.. ఉద్విగ ఒక్క పరుగు విజయాన్ని అందించాడు. బ్యాట్స్‌మన్‌గా దిన దిన పురోగతి సాధిస్తున్న పాండ్య.. భయానక బ్యాట్స్‌మన్‌గా మారాడు. టెలివిజన్ షోలో అనుచిత వ్యాఖ్యలతో ఆస్ట్రేలియా టూర్‌కు దూరమైనా.. ఆ విరామం పాండ్యలో ఎంతో మార్పు తీసుకొచ్చింది. ఐపీఎల్12లో పాండ్య తీరని దాహంతో కనిపించాడు. 15 మ్యాచుల్లో 402 పరుగులు, 14 వికెట్లతో అదరగొట్టాడు. కోల్‌కతపై ఈడెన్ గార్డెన్స్‌లో నమోదు చేసిన విధ్వంసక ఇన్నింగ్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమ జాబితాలో ఒకటి. తొలిసారి ప్రపంచకప్‌లో ఆడనున్న హార్దిక్ పాండ్య తుది జట్టులో ఉండటంతో జట్టుకు విలువైన సమతూకం తీసుకొస్తాడు. బంతితో, బ్యాట్‌తో పాండ్య విన్యాసాలు భారత్‌ను ముందంజలో నిలుపగలవు.
నం.4! : పాండ్యపై నిషేధంతో జట్టులోకి వచ్చిన విజయ్ శంకర్ ఆకట్టుకునే ఇన్నింగ్స్‌లతో ప్రపంచకప్ జట్టులోకి వచ్చేశాడు. నాలుగో సీమర్ వనరు నుంచి నం.4 బ్యాట్స్‌మన్ స్థానానికి పోటీపడే స్థాయికి ఎదిగాడు. నిదహాస్ ట్రోఫీ ఫైనల్లో 19 బంతుల్లో 17 పరుగులతో అభిమానుల చేత చివాట్లు తిన్నప్పటికీ.. ఆస్ట్రేలియాపై ఆఖరి ఓవర్లో (నాగ్‌పూర్) 10 పరుగులు కాపాడి హీరో అయ్యాడు. సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నుంచి, విజయ్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గా ఎదుగుతున్నాడు. 9 వన్డేల అనుభవంతో ప్రపంచకప్ ఆడనున్న విజయ్ శంకర్ ఆల్‌రౌండర్‌గా రాణించాలని ఎదురుచూస్తున్నాడు.
సీనియర్ స్పిన్నర్ : 151 వన్డేల అనుభవం, 2013 చాంపియన్స్ ట్రోఫీలో వికెట్ల మోగించిన విజయదరహాసం రవీంద్ర జడేజా సొంతం. ఇంగ్లాండ్‌లోనే జరిగిన 2017 చాంపియన్స్ ట్రోఫీలో జడేజా వైఫల్యం సెలక్టర్లను మణికట్టు స్పిన్నర్ల వైపు మళ్లించింది. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న జడేజా.. పిచ్ టర్న్‌కు అనుకూలమైతే మాయ చేయగలడు. ప్రపంచకప్ లీగ్ దశ చివరి మ్యాచుల్లో జడేజా క్రీయాశీల పాత్ర పోషించే అవకాశం ఉంది.
యువీ లోటు భర్తీ? : 2019 యువరాజ్ సింగ్‌ను కేదార్ జాదవ్‌లో చూడాలనే అంచనాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. లోయర్ ఆర్డర్లో విలక్షణ షాట్లతో విరుచుకుపడే కేదార్ జాదవ్.. అర్ధం కాని స్పిన్‌తో ప్రత్యర్థిని ఉక్కిరి బిక్కిరి చేయగలడు. ఐపీఎల్లో గాయపడినా, ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్ సాధించాడు. భారీ ఛేదనల్లో జాదవ్ పాత్ర మరింత కీలకం. యువరాజ్ స్థానాన్ని భర్తీ చేయాలనే అంచనాలున్నా, కనీసం సురేశ్ రైనా పాత్ర పోషించటం ఖాయం.