Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ క్రీడా విభాగం
1992 ప్రపంచకప్ విజేత, 2017 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ విజేత సహా పదునైన పేస్ విభాగం, మెరుగైన స్పిన్నర్లు, తిరుగులేని బ్యాటింగ్ లైనప్.. పాకిస్థాన్ గురించి చెప్పాలంటే ఇవన్నీ రావాలి. కానీ పాకిస్థాన్ పేరు వినగానే తొలుత వినిపించే పదం అనిశ్చితి. ఎన్ని గొప్ప విజయాలు సాధించినా, ఎంత నాణ్యమైన ఆటగాళ్లు జట్టులో నిలిచినా.. పాకిస్థాన్ అనిశ్చితికి దూరం కాలేదు. అద్భుత విజయాలు, అనిశ్చితితో నిరంతర ప్రయాణం సాగిస్తోంది. నిజానికి 1992 ప్రపంచకప్ మాదిరిగా, 2017 చాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్ నెగ్గుతుందని ఎవ్వరూ ఊహించలేదు. లీగ్ మ్యాచ్‌లో భారత్ చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్థాన్, టైటిల్ పోరులో అంతకుమించి విజయాన్ని కైవసం చేసుకున్నది. స్థిరమైన నాయకత్వానికి నిలకడైన విజయాలు తోడయ్యాయి అనుకుంటున్న దశలోనే ఆస్ట్రేలియా చేతిలో వైట్‌వాష్, ఇంగ్లాండ్ చేతిలో 0-4 సిరీస్ ఓటములు పాక్‌ను పలకరించాయి. ఫామ్‌తో సంబంధం లేని పాకిస్థాన్ ఏ మ్యాచ్‌లో ఎలా రాణిస్తుందో ఊహించటం కష్టం. ఇంగ్లాండ్‌లోనే జరిగిన చాంపియన్స్ ట్రోఫీని సాధించిన పాకిస్థాన్.. ఇప్పుడూ అదే స్ఫూర్తితో ప్రపంచకప్ పట్టేయాలని చూస్తోంది.
బలం : పాకిస్థాన్ ప్రధాన బలం యువ శక్తి. టాప్ ఆర్డర్లో ముగ్గురు కుర్రాళ్ల మ్యాజిక్‌పై పాక్ గంపెడాశలు పెట్టుకున్నది. ఇమామ్ ఉల్ హాక్, ఫకార్ జమాన్, బాబర్ ఆజామ్‌లు కెరీర్ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నారు. ఈ ముగ్గురు బ్యాట్స్‌మన్ వన్డే బ్యాటింగ్ సగటు 50 పైనే ఉంది. 2017 చాంపియన్స్ ట్రోఫీ నుంచి పాకిస్థాన్ విజయాల్లో వీరిదే సింహభాగం. ఫకర్ జమాన్ వేగవంతమైన ఆరంభాల్సి అందిస్తే, ఇమామ్ ఆఖరి ఓవర్ వరకూ క్రీజులో నిలిచే ప్రయత్నం చేశాడు. బాబర్ ఆజామ్ కండ్లుచెదిరే నిలకడ ఇన్నింగ్స్‌కు వెన్నెముక. నిలకడ విషయంలో ప్రపంచ మేటీ బ్యాట్స్‌మన్‌తో పోటీపడుతున్న ఆజామ్ పాకిస్థాన్‌కు అత్యంత కీలకం.
బలహీనత : ప్రపంచకప్ వేదిక ఇంగ్లాండ్ ఈ వేసవిలో ఫ్టాట్ పిచ్‌లను అందిస్తోంది. తొలిసారి ప్రపంచకప్ సగటు స్కోరు 350 వరకూ ఉండే అవకాశం కనిపిస్తోంది. భారీ స్కోర్ల మ్యాచుల్లో ఫలితాల్ని శాసించేది బిగ్ హిట్టర్లు. ప్రతి జట్టులోనూ 2-3 పించ్ హిట్లర్లకు కొదవ లేదు. కానీ ఈ విషయంలో పాకిస్థాన్ వెనుకంజలో ఉంది. స్కోరు వేగం అమాంతం పెంచగల హిట్టర్లు జట్టులో లేరు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ అసీఫ్ అలీ ఒక్కడే మెరుపు షాట్లు ఆడగలడు. పవర్ హిట్టింగ్ బలహీనత పాకిస్థాన్ అవకాశాలను శాసించే ప్రమాదం ఎక్కువ. క్యాచులు అందుకోవటంలో నిలకడగా విఫలమవుతోంది. ఇంగ్లాండ్‌తో తాజా సిరీస్‌లో 7 విలువైన క్యాచులు వదిలేసింది. మ్యాచ్‌కు సగటున 2 క్యాచులు నేలా పాలు చేసింది. చిన్న పొరపాటు, భారీ మూల్యానికి దారి తీయగల పరిస్థితుల్లో పాకిస్థాన్ ఫీల్డింగ్, క్యాచింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి.
అవకాశం ఎంత? : 2019 ప్రపంచకప్ సుదీర్ఘంగా సాగబోతున్నది. ప్రతి జట్టు మిగతా తొమ్మిది జట్లతో ఓసారి పోటీపడాలి. లీగ్ దశ చివరి వరకూ పాకిస్థాన్ సెమీస్ రేసులో నిలిస్తే.. ఆ జట్టును నిలువరించటం కష్టం. రెండు కొత్త బంతులతో రివర్స్ స్వింగ్ రాబట్టల సీమర్లు పాక్‌లో ఉన్నారు. నాణ్యమైన స్పిన్ సేవలు అందుబాటులో ఉన్నాయి. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఫకర్ జమాన్ బాదిన విధ్వంసక ఇన్నింగ్స్‌లను ఆడేందుకు జట్టులో ఎవరో ఒకరు సర్వదా సిద్ధంగా ఉంటారు. 9 మ్యాచుల లీగ్ దశ పాకిస్థాన్ సెమీఫైనల్స్ అవకాశాలను బలోపేతం చేస్తుంది.
గత ప్రదర్శన : 1992 ప్రపంచకప్ విజేత
ప్రపంచకప్ జట్టు : సర్ఫరాజ్ అహ్మద్ (కెప్టెన్), అసిస్ అలీ, బాబర్ ఆజామ్, హారీస్ సోహైల్, హసన్ అలీ, ఇమాద్ వసీం, ఇమామ్ ఉల్ హాక్, మహ్మద్ ఆమీర్, మహ్మద్ హఫీజ్, మహ్మద్ హస్నన్, షాదాబ్ ఖాన్, షాహీన్ అఫ్రీది, షోయబ్ మాలిక్, వహబ్ రియాజ్.