Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫేవరెట్‌పై ప్రపంచకప్ కెప్టెన్ల మాట
లండన్ (ఇంగ్లాండ్)
2019 ప్రపంచకప్‌లోకి అడుగు పెట్టాం. శుక్రవారం ప్రపంచకప్ వార్మప్ మ్యాచులు మొదలయ్యాయి. రేసుగుర్రాలను పరీక్షించుకునేందుకు అన్ని జట్లు కూర్పుపై ఎలా ఉండాలనే విషయంపై దృష్టి సారిస్తున్నాయి. ఎప్పట్లాగానే ఈ ప్రపంచకప్‌లో ఫేవరెట్ ఎవరు? అండర్ డాగ్ ట్యాగ్ ఎవరిది? సంచలన అవకాశం ఉన్నదెవరికి? అంటూ మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు, మీడియా సహా సామాన్య అభిమానులు చర్చల్లో మునిగిపోయారు. పది జట్లు, ఒక ట్రోఫీ.. గురి చూసి కొట్టేదెవరు? అని ఇంతవరకూ అందరూ మాట్లాడేశారు. కానీ వేటకు బయల్దేరిన పది జట్ల నాయకుల మనసులో ఫేవరెట్ వేటగాడు ఎవరో తెలుసా?
అరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా) : చాలా మంచి ప్రశ్న. కొన్ని సంవత్సారాలుగా భారత్‌తో పాటు ఇంగ్లాండ్ గొప్ప ఫామ్‌లో కొనసాగుతుంది. ఈ రెండు జట్లవే మెరుగైన ప్రదర్శనలు. సొంతగడ్డపై ఆడుతున్న ఇంగ్లాండ్ ఈ ప్రపంచకప్ హాట్ ఫేవరెట్ అని చెప్పవచ్చు.
ప్రపంచకప్ నెగ్గిన ఆటగాళ్లు జట్టులో ఉండటం సానుకూలాంశం. ఆరుగురు వరల్డ్‌కప్ విజేతల అనుభవం మాకు ఉపయోగపడుతుంది. ఇదెంతో భిన్నమైన టోర్నీ. ఒక్కసారి మైదానంలోకి అడుగుపెట్టి ఆట మొదలెడితే, ఒత్తిడి పక్కకెళ్తుంది! ప్రపంచకప్ గొప్పగా సాగుతుందని భావిస్తున్నాను.
ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లాండ్): నాకు ఎటువంటి ఐడియా లేదు. ప్రపంచకప్‌ను ఎవరైనా నెగ్గవచ్చు, అందరికీ అవకాశం ఉంది. పది జట్లు పోటీపడుతున్న ప్రపంచకప్‌లో అత్యంత కఠినమైన పోటీ ఉంటుంది. ఈ క్రమంలో నాణ్యమైన క్రికెట్‌కు అవకాశం ఉంది. మేం దానిపై దృష్టి పెడుతున్నాం.
సొంతగడ్డపై ఆడటంపై సైతం ఎక్స్ ఫ్యాక్టర్. అందుకే సొంతగడ్డ అనుకూలత పరిగణనలోకి వస్తుంది. జట్టుగా ఎంతో మమేకమయ్యాం. ఏండ్లుగా సన్నద్ధమయ్యాం. క్రికెట్ ఆడేందుకు ఇంగ్లాండ్ గొప్ప వేదిక. ఇక్కడికొచ్చిన ఏ జట్టు, ఏ ఆటగాడిని అడిగినా అదే సమాధానం వస్తుంది.
విరాట్ కోహ్లి (భారత్) : వార్మప్ మ్యాచులు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. భారత్ ఎక్కడ ఆడినా అధిక ఒత్తిడి నెలకొంటుంది. ప్రపంచంలో ఎక్కడ ఆడినా భారత్‌కు విపరీతమైన అభిమాన గణం అండ ఉంటుంది. కానీ నేను అరోన్ ఫించ్‌తో అంగీకరిస్తున్నాను. ప్రపంచకప్ ఫేవరెట్ ఆతిథ్య ఇంగ్లాండ్. ఇదే సమయంలో మోర్గాన్తోనూ ఏకీభవిస్తున్నాను. పది జట్ల పోటీలో అందరికీ అవకాశం ఉంది. పది జట్లు సమతూకంతో, బలంగా కనిపిస్తున్నాయి. ప్రతి జట్టు మిగతా జట్లతో తప్పనిసరిగా ఆడాలి, ఇది మరింత సవాల్ విసురుతోంది. ఈ ప్రపంచకప్ అత్యుత్తమ లక్షణం సైతం ఇదే.
సర్ఫరాజ్ అహ్మద్ (పాకిస్థాన్) : మోర్గాన్, విరాట్ చెప్పినట్టు అన్ని జట్లు సమతూకంతో ఉన్నాయి. ప్రతి జట్టుకు అవకాశం ఉంది, అందరికీ నా అభినందనలు. ఇంగ్లాండ్ గడ్డపై పాకిస్థాన్ గతంలో ఏం సాధించిందో మీరు చూశారు. 1992 టెస్టు సిరీస్, 1999 ప్రపంచకప్, 2017 చాంపియన్స్ ట్రోఫీ.. ఇలా ఇక్కడ పాకిస్థాన్ మెరుగైన క్రికెట్ ఆడింది. అదే ప్రదర్శన పునరావృతం చేస్తామనే నమ్మకంతో ఉన్నాం. అల్లా దయతో మెరుగైన ప్రదర్శన చేస్తాం.
డుప్లెసిస్ (దక్షిణాఫ్రికా) : ప్రపంచ క్రికెట్ సర్క్యూట్‌ను ఓ సారి పరిశీలిస్తే ఓ విషయం అవగతం అవుతుంది. ఇంటా, బయటా వ్యత్యాసం లేకుండా అన్ని సిరీస్‌లు పోటాపోటీగా సాగుతున్నాయి. సొంతగడ్డపై ఆడుతున్నప్పుడు ఆతిథ్య జట్టు ఆధిపత్యం తగ్గిపోతుంది. మిగతా కెప్టెన్లు చెప్పినట్టుగా.. కొత్త ఫార్మాట్లో జరుగుతున్న ప్రపంచకప్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ప్రతి జట్టు మిగతా జట్లతో ఆడటం ప్రపంచకప్‌ను గొప్పగా నిలుపుతుంది.
కానె విలియమ్సన్ (న్యూజిలాండ్) : అందరూ ప్రపంచకప్ ఫేవరెట్, ర్యాంకింగ్స్, అండర్డాగ్స్ అంటూ అంచనాలు వేస్తున్నారు. కానీ సమతూకంతో కూడిన జట్లు తలపడినప్పుడు ఆ రోజు ఏదైనా జరిగేందుకు అవకాశం ఉంది. అందుకే ఈ ప్రపంచకప్‌పై ఆసక్తి ఎక్కువవుతోంది. గత ప్రపంచకప్‌లో ఆడిన కొందరు ఆటగాళ్లు ప్రస్తుత జట్టులో ఉండటం సానుకూలం. ఆ అనుభవం ఉపయోగపడుతుంది. ప్రపంచకప్‌కు నాలుగేండ్ల విరామం ఉన్నందున, ఈ సమయంలో ఎంతో మంది కొత్త ఆటగాళ్లు వస్తారు. న్యూజిలాండ్ అవకాశాలను అందుకుంటుందని చెప్పగలను.