Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెమీఫైనల్లో దిగ్గజాల ఢీ
- సెమీస్‌లో జొహన్న కొంటా
- ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
పారిస్ (ఫ్రాన్స్) : ఫ్రెంచ్ ఓపెన్‌లో అభిమానులకు పసందైన టెన్నిస్ విందు ఎదురుచూస్తుంది. టెన్నిస్ దిగ్గజాలు రోజర్ ఫెడరర్, రఫెల్ నడాల్ ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్లో ముఖాముఖికి రంగం సిద్ధమైంది. మంగళవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్స్‌లో విజయాలు సాధించిన ఫెడరర్, నడాల్ ఫైనల్లో చోటు కోసం చావోరేవో తేల్చుకోనున్నారు. ఆసియా సింహనాదం కిరు నిషికోరి (జపాన్)పై స్పెయిన్ బుల్ రఫెల్ నడాల్ 6-1, 6-1, 6-3తో అలవోక విజయం సాధించాడు. తొలి సెట్లో నడాల్ 3-0తో దూసుకెళ్లగా.. నిషికోరి 1-3తో ఖాతా తెరిచాడు. కానీ తర్వాత వరుసగా మూడు గేములు నెగ్గిన నడాల్ సెట్ సొంతం చేసుకున్నాడు. రెండో సెట్లో 1-1తో నిషికోరి ఆరంభంలోనే పోటీనిచ్చాడు. నడాల్ వరుసగా ఐదు గేములు గెలుపొంది నిషికోరి ఆశలు ఆవిరి చేశాడు. మూడో సెట్లో 1-1, 4-2, 5-3తో నడాల్ ముందంజ వేశాడు. 6-3తో మూడో సెట్, సెమీస్ బెర్త్ కైవసం చేసుకున్నాడు. మూడు ఏస్‌లు సంధించిన నడాల్, 29 విన్నర్లు సాధించాడు. 30 అనవసర తప్పిదాలు చేసిన నిషికోరి క్వార్టర్స్‌లో నడాల్ ముందు తేలిపోయాడు. ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్స్‌కు చేరటం నడాల్‌కు ఇది 12వ సారి. గతంలో సెమీస్‌కు చేరిన 11 సార్లు నడాల్ విజేతగా నిలిచాడు. మరో క్వార్టర్ఫైనల్లో స్విస్ సహచరుడు వావ్రింకాపై ఫెడరర్ పైచేయి సాధించాడు. 7-6(7-4), 4-6, 7-6(7-5), 6-4తో నాలుగు సెట్ల పోరులో గెలుపొందాడు. ఏడు డబుల్ ఫాల్ట్స్‌కు పాల్పడిన వావ్రింకా.. ఫెడరర్‌కు గట్టి పోటినిచ్చాడు. విజేత ఫెడరర్ 24 గేములు గెల్చుకోగా.. వావ్రింకా 22 గేమ్‌లతో దగ్గరగా వచ్చాడు. ఫెడరర్ 168 పాయింట్లు సాధించగా, వావ్రింకా 152తో సరిపెట్టుకున్నాడు. స్విస్ స్టార్ చేతిలో ఓడి, టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
మహిళల సింగిల్స్‌లో బ్రిటన్ భామ జొహన్న కొంట సంచలనం సృష్టించింది. ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. యు.ఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ స్లోనె స్టిఫెన్స్పై 6-1, 6-4తో వరుస సెట్లలో కొంటా విజయం సాధించింది. ఆరు ఏస్‌లతో మెరిసిన కొంటా.. 3 బ్రేక్ పాయింట్లు సాధించింది. పాయింట్ల పరంగా 61-41తో, గేమ్‌ల్లో 12-5తో స్టిఫెన్స్పై జొహన్న తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది. ఏకపక్ష విజయంతో సెమీఫైనల్స్ బెర్త్ సొంతం చేసుకుంది.