Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచకప్‌లో భారత్ తొలి పోరు
- దక్షిణాఫ్రికాతో కోహ్లిసేన ఢ నేడు
- వరుస ఓటములతో కుంగిన సఫారీ
- హాట్ ఫేవరెట్‌గా టీమ్ ఇండియా
2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ నుంచి పాఠాలు నేర్చుకున్నాం. ఎలా ఆడాలో మాకు తెలుసు. అంతిమంగా ఉత్తమ జట్టును విజయం వరిస్తుంది. మిడిల్ ఓవర్లలో వికెట్ల వేటకు మణికట్టు స్పిన్నర్లను తీసుకొచ్చాం. చాంపియన్స్ ట్రోఫీ కంటే బలమైనది భారత ప్రపంచకప్ జట్టు. ప్రపంచకప్ తొలి వారం ఫలితాలు చూస్తే, సమతూకంతో ఉన్న జట్లు పైచేయి సాధించాయి. ఒత్తిడిని జయించిన జట్టు విజయాన్ని సొంతం చేసుకుంది. మెరుగైన నిర్ణయాలు తీసుకునేందుకు మా అనుభవం ఉపయోగిస్తాం
- విరాట్ కోహ్లి, భారత కెప్టెన్
ప్రపంచ కప్ మొదలైంది. టోర్నీ తొలి ఆరు రోజుల్లో 9 జట్లు తొలి ఆట ఆడేశాయి. మరికొన్ని జట్లు రెండేసి మ్యాచుల్లో తలపడ్డాయి. కానీ టైటిల్ ఫేవరెట్, వరల్డ్ నం.2 భారత్ బరిలోకి దిగలేదు. వార్మప్ మ్యాచుల తర్వాత ప్రాక్టీస్ సెషన్లకు పరిమితమైన కోహ్లిసేన నేడు దక్షిణాఫ్రికాతో పోరుతో వరల్డ్‌కప్ వేట మొదలు పెట్టనున్నది.
నేడు సఫారీతో మ్యాచ్‌లో భారత్ ఫేవరెట్‌గా ఆడుతోంది. వరుసగా రెండు పరాజయాలు చవిచూసిన దక్షిణాఫ్రికా ఆత్మవిశ్వాసం కోల్పోయింది. అయితే దక్షిణాఫ్రికా దెబ్బతిన్న పులి. కోహ్లిసేన తన జాగ్రత్తలో ఉంటే మేలు.
నం.2 ర్యాంక్, టైటిల్ ఫేవరెట్ హౌదా, అన్ని విభాగాల్లో నాణ్యమైన ఆటగాళ్లు. ప్రపంచకప్‌లో భారత్ కాగితంపై గొప్పగా కనిపిస్తోంది. ప్రత్యర్థి, పరిస్థితులను బేరీజు వేసుకుని సరైన తుది జట్టు ఎంచుకోవటంలో కోహ్లి విచక్షణ చూపించాలి. భారత్, దక్షిణాఫ్రికా ప్రపంచకప్ పోరు నేడు.
సౌతాంప్టన్ (ఇంగ్లాండ్)
2019 ప్రపంచకప్ వేటకు కోహ్లిసేన సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో నేడు దక్షిణాఫ్రికాను ఎదుర్కొంటుంది. ఆతిథ్య ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ చేతిలో ఓడిన దక్షిణాఫ్రికా నేడు మూడో మ్యాచ్ ఆడుతుండగా.. టీమ్ ఇండియా ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్ ఆడుతుంది. గాయాలు భయపెట్టినా, ఫామ్ ఆందోళనకు గురి చేసినా.. ప్రపంచకప్‌కు సర్వం సిద్ధం చేసుకున్న భారత్ నేడు అన్ని అస్త్రాలు ప్రయోగించనుంది. వరుస ఓటములతో దక్షిణాఫ్రికా దెబ్బ తిన్న పులిలా గెలుపు ఆకలితో కనిపిస్తోంది. కానీ ఆత్మ విశ్వాసం లోపించిన సఫారీ జట్టు నేడు టైటిల్ ఫేవరెట్ భారత్‌కు పోటీనివ్వగలదా? పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తే జడేజా,కుల్దీప్.. సీమ్‌కు అనుకూలిస్తే బుమ్రా, షమి/భువి.. బ్యాటింగ్‌కు అనుకూలిస్తే కోహ్లి అండ్ కో మ్యాచ్‌ను లాగేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.
లోపం లేని భారత్! : పచ్చికపై వార్మప్‌లో ఓడినా.. భారత బ్యాటింగ్ లైనప్‌పై ఎటువంటి బెంగ అక్కర్లేదు. వన్డే క్రికెట్ అత్యుత్తమ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి, మూడు ద్వి శతకాల మొనగాడు రోహిత్ శర్మ మనవైపున్నారు. రోహిత్, కోహ్లిల సెంచరీలు 63 కాగా.. దక్షిణాఫ్రికా జట్టులోని బ్యాట్స్‌మెన్ మొత్తం శతకాలు 61 కావటం గమనార్హం. శిఖర్ ధావన్ ఐసీసీ టోర్నీల్లో 64.69 బ్యాటింగ్ సగటుతో ప్రపంచకప్ ఆడుతున్నాడు. ఫ్లాట్ పిచ్ ఎదురైతే టాప్-3 మ్యాచ్‌ను లాగేసుకోవటం ఖాయం. వార్మప్‌లో శతకం సాధించిన కెఎల్ రాహుల్ నేడు నం.4లో బరిలోకి దిగనున్నాడు. నెట్స్‌లో భారీ షాట్లు సాధన చేసిన మహేంద్రుడు ఐదో స్థానంలో ఆడనున్నాడు. గాయం నుంచి కోలుకున్న కేదార్ జాదవ్.. రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్య తోడుగా ఆల్‌రౌండ్ బాధ్యతలు పంచుకోనున్నాడు. పేస్ దళపతి బుమ్రాకు ఇది 50వ వన్డే. బుమ్రా అరంగ్రేటం తర్వాత డెత్ ఓవర్లలో అతడు కూల్చిన (44 వికెట్లు) వికెట్లు మరో బౌలర్ పడగొట్టలేదు. పరిస్థితులకు అనుగుణంగా అతడికి మహ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్‌లలో ఒకరు తోడు ఉంటారు. చైనామన్ కుల్దీప్ యాదవ్ తుది జట్టులో ఉండటం ఖాయం. యుజ్వెంద్ర చాహల్ తన స్థానాన్ని ఆల్‌రౌండర్ జడేజాకు త్యాగం చేయక తప్పదు.
దెబ్బతిన్న పులి : దక్షిణాఫ్రికా వరుస పరాజయాలతో మానసికంగా కుంగిపోయింది. ఇంగ్లాండ్, బంగ్లాదేశ్‌లపై ఛేదనలో చతికిల పడింది. వెటరన్ సీమర్ డెల్ స్టెయిన్ సేవలు కోల్పోవటం ఆ జట్టుకు మరో దెబ్బ. యువ సీమర్ లుంగి ఎంగిడి గాయానికి గురవటం మరింత కలవరానికి గురి చేస్తోంది. బ్యాటింగ్ లైనప్‌లో క్వింటన్ డికాక్, డుప్లెసిస్, వాన్‌డర్ డుసెన్‌లు మంచి ఫామ్‌లో ఉన్నారు. భారత్‌తో మ్యాచ్‌లో శుభారంభాల్ని భారీ స్కోర్లుగా మలిచేందుకు వీరు సిద్ధమవుతున్నారు. జెపీ డుమిని, డెవిడ్ మిల్లర్ ముగింపులో సత్తా చాటుకోవాల్సిన అవసరం ఆసన్నమైంది. ఆర్చర్ బౌన్సర్‌కు గాయపడిన హషీమ్ ఆమ్లాకు భారత్‌పై మంచి రికార్డుంది. మార్కరమ్ సైతం పరుగుల దాహంతో కనిపిస్తున్నాడు. సమష్టిగా మెరుస్తున్నా.. ఒకరు ఇన్నింగ్స్ కడ వరకూ నిలిస్తే దక్షిణాఫ్రికా విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఫ్లాట్ పిచ్‌పై స్పిన్నర్ తాహీర్ కీలకమవుతాడు. ఎంగిడి, స్టెయిన్ లేని వేళ రబాడతో కలిసి ఫెలుక్వయో పేస్ బాధ్యతలు తీసుకోనున్నాడు. సీనియర్ సీమర్ క్రిస్ మోరీస్ అనుభవం సఫారీకి ఏ మేరకు పని చేస్తుందో చూడాలి.
పిచ్ రిపోర్టు : సౌతాంప్టన్‌లో ఇదే తొలి ప్రపంచకప్ మ్యాచ్. మంగళవారం మధ్యాహ్నాం వరకూ పిచ్‌పై పచ్చిక కళకళ లాడింది. మ్యాచ్‌కు ముందు పిచ్‌పై పచ్చిక పూర్తిగా తొలగించారు. ఆరంభంలో సీమర్లకు, తర్వాత స్పిన్నర్లకు అనుకూలం. ఏజిస్ బౌల్ పరుగుల సాధనకు గొప్ప అవకాశం. ఫ్లాట్ పిచ్ ఆశిస్తోన్న కోహ్లిసేనకు ఇక్కడ పరుగుల పండుగే. టాస్ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకునేందుకు మొగ్గు చూపవచ్చు. ప్రపంచకప్ ఛేదనలో ఒత్తిడిని తొలగించేందుకు కెప్టెన్లు తొలుత బౌలింగ్ ఎంచుకునే వీలుంది.
తుది జట్లు (అంచనా) :
భారత్ : రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, కెఎల్ రాహుల్, ఎం.ఎస్ ధోని, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్/మహ్మద్ షమి, కుల్దీప్ యాదవ్, జశ్‌ప్రీత్ బుమ్రా.
దక్షిణాఫ్రికా : క్వింటన్ డికాక్, హాషీమ్ ఆమ్లా, ఎడైన్ మార్కరమ్, డుప్లెసిస్, వాన్‌డర్ డుసెన్, డెవిడ్ మిల్లర్, జెపీ డుమిని, ఫెలుక్వయో, క్రిస్ మోరీస్, కగిసో రబాడ, ఇమ్రాన్ తాహీర్.