Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచకప్‌లో భారత్ బోణీ
- దక్షిణాఫ్రికాపై తిరుగులేని విజయం
- చాహల్, బుమ్రా మెరుపులు
- రోహిత్ శర్మ అజేయ శతకం
ఆలస్యంగా ఆరంభమైనా, అదిరే విజయంతో మొదలైంది కోహ్లిసేన వరల్డ్‌కప్ వేట. బ్యాట్‌తో, బంతితో దక్షిణాఫ్రికాపై తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన టీమ్ ఇండియా 6 వికెట్ల తేడాతో అలవోక విజయం సాధించింది. వరుసగా మూడో ఓటమితో దక్షిణాఫ్రికా సెమీఫైనల్ అవకాశం సంక్షిష్టంగా మారింది.
పిచ్‌పై పేస్ లభించింది. బుమ్రా సద్వినియోగం చేసుకున్నాడు. సఫారీ టాప్ ఆర్డర్‌ను వేసేశాడు. బంతి మంచి టర్న్ తీసుకుంటోంది. చాహల్, కుల్దీప్ అవకాశం వదులుకోలేదు. దక్షిణాఫ్రికా మిడిల్ ఆర్డర్‌ను కకావికలం చేశారు. తోక కత్తిరించటంలో ఆలస్యమైనా.. దక్షిణాఫ్రికాను 227 పరుగులకే కుప్పకూల్చింది భారత్.
లక్ష్యం చిన్నదే. క్రీజులో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ. పరిస్థితులకు గౌరవం ఇచ్చిన భారత్ హడావిడిగా పరుగుల కోసం వెళ్లలేదు. బౌలర్లకు గౌరవం ఇచ్చిన బ్యాట్స్‌మెన్ అవకాశం దొరికినప్పుడే బౌండరీలు కొట్టారు. రోహిత్ అజేయ సెంచరీతో కదం తొక్కగా 47.3 ఓవర్లలోనే భారత్ విజయాన్ని అందుకుంది. 6 వికెట్ల ఏకపక్ష విజయంతో కోహ్లిసేన కప్పు వేట మొదలైంది.
సౌతాంప్టన్ (ఇంగ్లాండ్)
ప్రపంచకప్‌లో భారత్ ఘనమైన బోణీ సాధించింది. దక్షిణాఫ్రికాపై 6 వికెట్ల అలవోక విజయంతో వరల్డ్‌కప్ వేటను ఆరంభించింది. ఓపెనర్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (122 నాటౌట్, 144 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ శతకంతో చెలరేగాడు. కెఎల్ రాహుల్ (26), ఎం.ఎస్ ధోని (34)లతో కీలక భాగస్వామ్యాలు నిర్మించిన రోహిత్ శర్మ 228 పరుగుల లక్ష్యాన్ని మరో 15 బంతులు మిగిలి ఉండగానే ఛేదించాడు. శిఖర్ ధావన్ (8), విరాట్ కోహ్లి (18) నిరాశపరిచారు. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా సీమర్ జశ్‌ప్రీత్ బుమ్రా (2/35), స్పిన్నర్ యుజ్వెంద్ర చాహల్ (4/51) విజృంభణతో విలవిల్లాడింది. బుమ్రా, చాహల్ ధాటికి 89/5తో కష్టాల్లో పడిన దక్షిణాఫ్రికాను టెయిలెండర్లు ఆదుకున్నారు. డుప్లెసిస్ (38), మిల్లర్ (31), ఫెలుక్వయో (34), క్రిస్ మోరీస్ (42), కగిసో రబాడ (31) సఫారీకి గౌరవ ప్రద స్కోరు అందించారు. అజేయ సెంచరీ హీరో రోహిత్ శర్మ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.
కూల్‌గా ముగించారు : స్వల్ప ఛేదనలో భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఐసీసీ ఈవెంట్ల హీరో శిఖర్ ధావన్ (8) స్వల్ప స్కోరుకే వికెట్ కోల్పోయాడు. రోహిత్ శర్మతో కలిసి 41 పరుగులు జోడించిన కెప్టెన్ విరాట్ కోహ్లి (18, 34 బంతుల్లో 1 ఫోర్) సైతం వికెట్ల వెనకాల వికెట్ పారేసుకున్నాడు. పవర్‌ప్లేలో 34/1 మందకోడిగా మొదలైన ఇన్నింగ్స్.. కోహ్లి వికెట్‌తో 54/2తో చప్పగా సాగింది. నాలుగులో వచ్చిన కెఎల్ రాహుల్ (26, 42 బంతుల్లో 2 ఫోర్లు) కీలక భాగస్వామ్యంలో భాగమయ్యాడు. రోహిత్ శర్మతో కలిసి మూడో వికెట్‌కు 85 పరుగులు జోడించాడు. రోహిత్‌కు స్ట్రయిక్ ఇస్తూ సహకరించిన రాహుల్ 26 పరుగులు చేశాడు. రబాడకు అతడు వికెట్ కోల్పోవటంతో ఎం.ఎస్ ధోని (34, 46 బంతుల్లో 2 ఫోర్లు) జతకలిశాడు. ఈ జోడీకి సఫారీ ఫీల్డర్లు జీవనదానాలు అందిస్తూ వచ్చారు. ధోని వెనుదిరిగినా హార్దిక్ పాండ్య రోహిత్ లాంఛనాన్ని కూల్‌గా ముగించారు. హార్దిక్ పాండ్య (11 నాటౌట్, 6 బంతుల్లో 2 ఫోర్లు) బౌండరీతో విజయాన్ని అందించాడు.
ఆహా.. రోహిత్ : వార్మప్ మ్యాచుల్లో విఫలమైన రోహిత్ శర్మ దక్షిణాఫ్రికాపై ఫామ్‌లోకి వచ్చాడు. ఆరంభంలో ధావన్, కోహ్లి నిష్క్రమించగా ఆఖరు వరకూ క్రీజులో నిలిచి దగ్గరుండి గెలిపించాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్లో మొదలైన రోహిత్ జోరు ఎక్కడా ఆగలేదు. రబాడ వేసిన ఆ ఓవర్ ఆఖరి మూడు బంతులకు బౌండరీలు బాదాడు. లాంగ్ లెగ్‌లో భారీ సిక్సర్, థర్డ్ స్లిప్స్‌లో ఫోర్, పాయింట్లో పవర్ఫుల్ బౌండరీతో విరుచుకుపడ్డాడు. రాహుల్ జతగా పరుగుల బాధ్యత తీసుకున్న రోహిత్.. ఫెలుక్వయోను లక్ష్యంగా చేసుకుని రెండు బౌండరీలు సాధించాడు. షంష్సి వేసిన 23వ ఓవర్లో కౌ కార్నర్లో భారీ సిక్సర్ సంధించాడు. ప్రధాన స్పిన్నర్ తాహీర్నూ వదల్లేదు. నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 70 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన రోహిత్.. శతకానికి మరో 58 బంతులే తీసుకున్నాడు. పది ఫోర్లు, రెండు సిక్సర్లతో ప్రపంచకప్‌ను శతకంతో ఆరంభించాడు. దక్షిణాఫ్రికా రోహిత్‌కు కొన్ని జీవనదానాలు అందించినా.. అది ఆఖర్లోనే!. సహజంగా శతకం తర్వాత శివమెత్తే రోహిత్ ఈ మ్యాచ్‌లో భిన్నంగా ఆడాడు. 144 బంతుల్లో 122 పరుగులతో అజేయం నిలిచాడు. దక్షిణాఫ్రికా పేసర్లు రాణించిన చోట కెఎల్ రాహుల్‌తో 85, ఎం.ఎస్ ధోనితో 74 పరుగుల భాగస్వామ్యాలు మ్యాచ్‌ను భారత్ వశం చేశాయి.
బుమ్రా, చాహల్ మ్యాజిక్ : టాస్ నెగ్గిన దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది. పవర్ ప్లేలో సఫారీని స్టార్ సీమర్ బుమ్రా ఆడుకున్నాడు. పిచ్‌పై లభించిన పేస్‌ను వాడుకున్న బుమ్రా.. ఓపెనర్లు ఇద్దరినీ వెనక్కి పంపించాడు. హషీమ్ ఆమ్లా (6), క్వింటన్ డికాక్ (10) స్లిప్స్‌లో దొరికిపోయారు. కెప్టెన్ డుప్లెసిస్ (38, 54 బంతుల్లో 4 ఫోర్లు), వాన్‌డర్ డసెన్ (22, 37 బంతుల్లో 1 ఫోర్) ఇన్నింగ్స్ చక్కదిద్దే పని చేశారు. బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులేస్తుండగా ఎదురుదాడికి సాహాసించలేదు. డుప్లెసిస్ 4 ఫోర్లతో క్రీజులో నిలదొక్కుకున్నట్టే కనిపించాడు. ఈ జోడీ మూడో వికెట్ 50 ప్లస్ భాగస్వామ్యం నమోదు చేసి ప్రమాదకరంగా మారింది. స్పిన్నర్లను రంగంలోకి దించిన కోహ్లి దక్షిణాఫ్రికాను కోలుకోలేని దెబ్బకొట్టాడు. డసెన్, డుప్లెసిస్‌లను ఒకే ఓవర్లో క్లీన్ బౌల్డ్ చేసిన చాహల్ మిడిల్ ఆర్డర్ నడ్డి విరిచాడు. చైనామన్కు జెపీ డుమిని (3) వికెట్ల ముందు దొరికాడు. 89/5తో దక్షిణాఫ్రికా పీకల్లోతు కష్టాల్లో పడింది. టెయిలెండర్ ఫెలుక్వయో (34, 61 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) సహకారంతో డెవిడ్ మిల్లర్ (31, 40 బంతుల్లో 1 ఫోర్) వికెట్ల పతనాన్ని నిలువరించాడు. చాహల్ తర్వాతి స్పెల్‌లో రిటర్న్ క్యాచ్‌తో మిల్లర్‌ను సాగనంపాడు. అప్పటికి దక్షిణాఫ్రికా స్కోరు 135/6.
విసిగించిన తోక : టాప్ ఆర్డర్‌ను అలవోకగా అవుట్ చేసిన భారత్, మరోసారి టెయిలెండర్లను బోల్తా కొట్టించటంలో విఫలమైంది. 150 లోపే కుప్పకూలేలా కనిపించిన దక్షిణాఫ్రికా 227 పరుగులు చేసిందంటే టెయిలెండర్ల పుణ్యమే. ఫెలుక్వయో (34), క్రిస్ మోరీస్ (42, 34 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు), కగిసో రబాడ (31 నాటౌట్, 35 బంతుల్లో 2 ఫోర్లు) విలువైన పరుగులు చేశారు. టెయిలెండర్లు కలిసి 107 పరుగులు నమోదు చేశారు. భువనేశ్వర్ కుమార్ ఆఖర్లో క్రిస్ మోరీస్, తాహీర్లను అవుట్ చేసి వికెట్ల ఖాతా తెరిచాడు.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ : హషీమ్ ఆమ్లా (సి) రోహిత్ (బి) బుమ్రా 6, క్వింటన్ డికాక్ (సి) కోహ్లి (బి) బుమ్రా 10, డుప్లెసిస్ (బి) చాహల్ 38, వాన్‌డర్ డసెన్ (బి) చాహల్ 22, డెవిడ్ మిల్లర్ (సి,బి) చాహల్ 31, జెపీ డుమిని (ఎల్బీ) కుల్దీప్ యాదవ్ 3, ఫెలుక్వయో (స్టంప్డ్) ధోని (బి) చాహల్ 34, క్రిస్ మోరీస్ (సి) కోహ్లి (బి) భువనేశ్వర్ 42, కిగిసో రబాడ నాటౌట్ 31, ఇమ్రాన్ తాహీర్ (సి) కేదార్ జాదవ్ (బి) భువనేశ్వర్ 0, ఎక్స్‌ట్రాలు : 10, మొత్తం : (50 ఓవర్లలో 9 వికెట్లకు) 227.
వికెట్ల పతనం : 1-11, 2-24, 3-78, 4-80, 5-89, 6-136, 7-158, 8-224, 9-227.
బౌలింగ్ : భువనేశ్వర్ కుమార్ 10-0-44-2, జశ్‌ప్రీత్ బుమ్రా 10-1-35-2, హార్దిక్ పాండ్య 6-0-31-0, కుల్దీప్ యాదవ్ 10-0-46-1, యుజ్వెంద్ర చాహల్ 10-0-51-4, కేదార్ జాదవ్ 4-0-16-0.
భారత్ ఇన్నింగ్స్ : శిఖర్ ధావన్ (సి) డికాక్ (బి) రబాడ 8, రోహిత్ శర్మ నాటౌట్ 122, విరాట్ కోహ్లి (సి) డికాక్ (బి) ఫెలుక్వయో 18, కెఎల్ రాహుల్ (సి) డుప్లెసిస్ (బి) రబాడ 26, ఎం.ఎస్ ధోని (సి,బి) మోరీస్ 34, హార్దిక్ పాండ్య నాటౌట్ 11, ఎక్స్‌ట్రాలు : 07, మొత్తం : ( 47.3 ఓవర్లలో 4 వికెట్లకు) 230.
వికెట్ల పతనం : 1-13, 2-54, 3-139, 4-213.
బౌలింగ్ : ఇమ్రాన్ తాహీర్ 10-0-58-0, కగిసో రబాడ 10-1-39-2, క్రిస్ మోరీస్ 10-3-36-1, ఫెలుక్వయో 8.3-0-40-1, షంష్సి 9-0-54-0.