Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెస్టిండీస్‌పై ఆస్ట్రేలియాగెలుపు
- స్టార్క్‌కు ఐదు వికెట్లు
నైల్ దుర్భేద్యంగా 60 బంతుల్లోనే 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 92 పరుగులు చేయగా... స్టీవ్ స్మిత్ ఓ వైపు వికెట్లు పడుతున్నా క్రీజ్‌లో పాతుకుపోయి జట్టు భారీస్కోర్‌కు దోహదపడ్డాడు. ఆ తర్వాత స్టార్(5/46), కమ్మిన్స్(2/41) చెలరేగడంతో విండీస్‌పై .. పరుగుల తేడాతో ఆస్ట్రేలియా గెలిచింది.
నాటింగ్‌హామ్ : ప్రపంచకప్ టోర్నీలో భాగంగా ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు 15 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై గెలిచింది. తొలుత ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 288 పరుగులకే పరిమితమైంది. స్టీవ్ స్మిత్(73), నైల్(92) రాణించారు. ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లు చేజార్చుకొని 273 పరుగులు మాత్రమే చేయగల్గింది. దీంతో ఆస్ట్రేలియా వెస్టిండీస్‌పై 15 పరుగుల తేడాతో గెలిచి ప్రపంచకప్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకున్నట్లయ్యింది.
స్థానిక ట్రెంట్‌బ్రిడ్జ్ మైదానంలో గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన విండీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. తమ కెప్టెన్ నిర్ణయం సరైనదేనని చాటుతూ.. ఆరంభం నుంచి ఆ జట్టు బౌలర్లు చెలరేగిపోయారు. పదునైన విండీస్ బౌలింగ్‌ను ఎదుర్కోలేక ఆసీస్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. కెప్టెన్ ఫించ్(6)తో సహా వార్నర్(3), ఖవాజా(13), మ్యాక్స్‌వెల్(0), స్టొయినిస్(19)లు ఘోరంగా విఫలమవ్వడంతో ఆస్ట్రేలియా 79 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆసీస్ ఆటగాళ్లలో కౌల్టర్ నైల్(92; 60 బంతుల్లో 8ఫోర్లు, 4 సిక్సర్లు), స్టీవ్ స్మిత్(73; 103 బంతుల్లో 7ఫోర్లు), కేరీ(45) మినహా మిగతా బ్యాట్స్మన్లంతా పూర్తిగా విఫలమయ్యారు. ఆసీస్ ఫాస్ట్ బౌలర్ నాథన్ కౌల్టర్ నైల్ బ్యాటింగ్‌లో రెచ్చిపోవడంతో ఆస్ట్రేలియా గౌరవప్రదమైన స్కోర్‌ను నమోదు చేయగల్గింది. ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 288 పరుగులకు ఆలౌటైంది. విండీస్ బౌలర్లలో బ్రాత్వైట్కు మూడు, థామస్, కాట్రెల్, రసెల్‌లు తలో రెండు వికెట్లు దక్కించుకున్నారు. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్ జట్టు లెవీస్(1), గేల్(21) వికెట్లను త్వరగానే కోల్పోయింది. ఆ తర్వాత పూరన్(40), హోప్(68), కెప్టెన్ హోల్డర్(51) రాణించడంతో లక్ష్యాన్ని ఛేదించే దిశగా వెస్టిండీస్ జట్టు పయనించింది. 252 పరుగుల వద్ద 7వ వికెట్‌కు కోల్పోయిన విండీస్ జట్టు ఆ తర్వాత వరుసగా వికెట్లను చేజార్చుకొని చేతులారా ఓటమిని కొనితెచ్చుకుంది. చివరి 3 ఓవర్లలో 34 పరుగులు చేయాల్సి దశలో 19 పరుగులు మాత్రమే చేయగల్గింది. కెప్టెన్ హోల్డర్ 8వ వికెట్‌గా ఔటైన అనంతరం విండీస్ గెలుపుపై ఆశలను వదులుకుంది. స్టార్క్‌కు ఐదు, కమ్మిన్స్‌కు రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నైల్‌కు దక్కింది.
అర్ధసెంచరీలతో మెరిసిన స్మిత్, నైల్
స్టీవ్ స్మిత్ ఓ వైపు వికెట్లు పడుతున్నా మరోవైపు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఆరో వికెట్‌కు అలెక్స్ క్యారీ(45)తో కలిసి 68 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. క్యారీ ఔటైన అనంతరం కౌల్టర్ నైల్ క్రీజులోకి రావడంతో మ్యాచ్ స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశమే హద్దుగా చెలరేగిన కౌల్టర్ నైల్.. విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 102 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన అనంతరం స్మిత్‌ను ఔట్ చేసి ఈ జోడిని థామస్ విడదీస్తాడు. ఇక సెంచరీ దిశగా సాగుతున్న కౌల్టర్ నైల్ 92 పరుగుల వద్దే ముగిసింది.
కాట్రెల్ సూపర్ క్యాచ్
వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ షెల్డన్ కాట్రెల్ కళ్లు చెదిరే రీతిలో క్యాచ్ అందుకొని ఔరా అనిపించాడు. కరేబియన్ బౌలర్ థామస్ వేసిన 45 ఓవర్ రెండో బంతిని స్టీవ్ స్మిత్ ఫైన్ లెగ్ వైపు భారీ షాట్ ఆడగా.. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న కాట్రెల్ సిక్సర్ వెళ్లే బంతిని గాల్లోకి ఎగిరి అందుకున్నాడు. అయితే బ్యాలెన్స్ కోల్పోయిన కాట్రెల్ బౌండరీ హద్దును తాకబోతున్నట్లు గమనించి బంతిని లోపలికి విసిరేశాడు. అనంతరం మళ్లీ లైన్ లోపలికి వచ్చి బంతిని అందుకొని ఆశ్చర్యపరిచాడు. కాట్రెల్ స్టన్నింగ్ క్యాచ్‌తో స్మిత్‌తో సహా ఆసీస్ ప్యాన్స్ షాక్‌కు గురయ్యారు.
స్కోర్‌బోర్డు...
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ : వార్నర్ (సి) హెట్మెయిర్ (బి) కాట్రెల్ 3, ఫించ్ (సి) హోప్ (బి) థామస్ 6, ఖవాజా (సి) హోప్ (బి) రసెల్ 13, స్మిత్ (సి) కాట్రెల్ (బి) థామస్ 73, మ్యాక్స్‌వెల్ (సి) హోప్ (బి) కాట్రెల్ 0, స్టోనిస్ (సి) పూరన్ (బి) హోల్డర్ 19, క్యారీ (సి) హోప్ (బి) రసెల్ 45, కర్టన్-నైల్ (సి) హోల్డర్ (బి) బ్రాత్‌వైట్ 92, కమ్మిన్స్ (సి) కాట్రెల్ (బి) బ్రాత్‌వైట్ 2, స్టార్క్ (సి) హోల్డర్ (బి) బ్రాత్‌వైట్ 8, జంపా (నాటౌట్) 0, అదనం 27 (49 ఓవర్లలో 288 పరుగులు)
వికెట్ల పతనం: 1/15, 2/26, 3/36, 4/38, 5/79, 6/147, 7/249, 8/269, 9/284, 10/288
బౌలింగ్: థామస్ 10-0-63-2, కాట్రెల్ 9-0-56-2, రసెల్ 8-0-41-2, బ్రాత్‌వైట్ 10-0-67-3, హోల్డర్ 7-2-28-1, నర్స్ 5-0-31-0.
వెస్టిండీస్ ఇన్నింగ్స్: గేల్ (ఎల్బి) స్టార్క్ 21, లెవీస్ (సి) స్మిత్ (బి) కమ్మిన్స్ 1, హోప్ (సి) ఖవాజా (బి) కమ్మిన్స్ 68, పూరన్ (సి) ఫించ్ (బి) జంపా 40, హెట్మెయిర్ (రనౌట్) కమ్మిన్స్/మ్యాక్స్‌వెల్ 21, హోల్డర్ (సి) జంపా (బి) స్టార్క్ 51, రసెల్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) స్టార్క్ 15, బ్రాత్‌వైట్ (సి) ఫించ్ (బి) స్టార్క్ 16, నర్స్ (నాటౌట్) , అదనం 18.
వికెట్ల పతనం: 1/7, 2/31, 3/99, 4/149, 5/190, 6/216, 7/252, 8/252, 9/256,
బౌలింగ్: స్టార్క్ 10-1-46-5, కమ్మిన్స్ 10-3-41-2, కర్టన్-నైల్ 10-0-70-0, మ్యాక్స్‌వెల్ 6-1-31-0, జంపా 10-0-58-1, స్టోనిస్ 4-0-18-0.