Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అఫ్గనిస్థాన్‌తో ఢ నేడు
- సా 6 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
టౌంటన్ : వరుసగా రెండు మ్యాచులు. ఓ జట్టుకు రెండు విజయాలు. మరో జట్టుకు రెండు ఓటములు. ఇదీ ప్రపంచకప్‌లో న్యూజిలాండ్, అఫ్గనిస్థాన్ ప్రయాణం. న్యూజిలాండ్ ముచ్చటగా మూడో విజయంపై కన్నేయగా.. అఫ్గనిస్థాన్ బోణీ కొట్టాలని చూస్తుంది. క్లాసికల్ బ్యాటింగ్‌తో విమర్శకుల మెప్పు పొందిన న్యూజిలాండ్ కెప్టెన్ కానె విలియమ్సన్ సైతం 2019లో స్పిన్ ఎదుర్కొవటంలో ఇబ్బంది పడ్డాడు. వరల్డ్ క్లాస్ స్పిన్నర్లతో కూడిన అఫ్గాన్ స్పిన్ ఆయుధంతో కివీస్‌ను ఇరుకున పడేయాలనే వ్యూహంతో కనిపిస్తోంది. కివీస్, అఫ్గాన్ పోరుకు టౌంటన్ వేదిక.
ఎదురుందా? : జాతీయ జట్టులోకి పునరాగమనం తర్వాత జేమ్స్ నీషమ్ గొప్పగా రాణిస్తున్నాడు. స్పిన్ అనుకూల టౌంటన్‌లో ఇశ్ సోధిని ఆడించాలని చూస్తున్న కివీస్‌కు ఓ బ్యాట్స్‌మన్ తక్కువ అవుతాడు. అప్పుడు జేమ్స్ నీషమ్ తన బాధ్యత నెరవేర్చాల్సి ఉంటుంది. రెండు మ్యాచుల్లో మెరిసిన నీషమ్ బంగ్లాదేశ్‌పై బ్యాట్‌తో పూర్తి స్థాయి పాత్ర పోషించాల్సి ఉంటుంది. సీనియర్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ వరల్డ్‌కప్‌లో వెయ్యి పరుగులకు మరో 93 పరుగుల దూరంలో ఉన్నాడు. గప్టిల్ మెరిస్తే అఫ్గాన్‌పైనే వెయ్యి మైలురాయి అందుకునే అవకాశం లేకపోలేదు. కెప్టెన్ కానె విలియమ్సన్ స్పిన్ పరీక్ష ఏ విధంగా ఎదుర్కొంటాడనేది ఆసక్తికరం. మున్ముందు బలమైన జట్లతో తలపడనున్న కివీస్‌కు ఈ మ్యాచ్‌లో విజయం కీలకం. రాస్ టేలర్, కొలిన్ మన్రో, టామ్ లాథమ్‌లు కీలకం.
తిప్పేస్తారా? : తొలి మ్యాచ్‌లో ఆసీస్‌పై మెరుగైన ప్రదర్శన చేసినా.. తర్వాతి మ్యాచ్‌లో అఫ్గాన్ తేలిపోయింది. నాణ్యమైన స్పిన్నర్ల అండ అఫ్గాన్‌ను ఇంకా ప్రమాదకర జట్టుగానే నిలుపుతోంది. స్పిన్ బలహీనత కలిగిన న్యూజిలాండ్‌పై రషీద్ ఖాన్, మహ్మద్ నబిలు రెచ్చిపోవాలని చూస్తున్నారు. ఓపెనర్ మహ్మద్ షెహజాద్ గాయంతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. రెహమత్ షా నుంచి జట్టు మేనేజ్మెంట్ బాధ్యతాయుత ప్రదర్శన ఆశిస్తోంది. జాద్రాన్, నజీబుల్లా, గులాబ్దిన్ అఫ్గాన్‌కు కీలకం.
పిచ్ రిపోర్టు : కివీస్, అఫ్గాన్ మ్యాచ్‌కు ఆహ్లాదకర వాతావరణం ఉండనుంది. చిన్న బౌండరీల స్టేడియం కావటంతో ఇక్కడ సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 299. సీమర్లకు అవకాశాలు ఎక్కువే, కానీ స్పిన్నర్లు వికెట్ల వేటలో ప్రభావం చూపగలరు.
తుది జట్లు (అంచనా) : న్యూజిలాండ్ : మార్టిన్ గప్టిల్, కొలిన్ మన్రో, కానె విలియమ్సన్, రాస్ టేలర్, టామ్ లాథమ్, జేమ్స్ నీషమ్, ఇశ్ సోధి, మిచెల్ శాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గుసన్, ట్రెంట్ బౌల్ట్.
అఫ్గనిస్థాన్ : హజ్రతుల్లా జాజారు, రెహమత్ షా, హస్మతుల్లా షాహిది, నజీబుల్లా జాద్రాన్, మహ్మద్ నబి, గులాబ్దిన్ నయిబ్, ఇక్రమ్ అలిఖిలి, రషీద్ ఖాన్, అఫ్తద్ ఆలమ్, హమిద్ హసన్, దావ్లాత్ జాద్రాన్.