Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజయంపై మోర్గాన్‌సేన గురి
- హ్యాట్రిక్‌పై మొర్తజా బృందం కన్ను
- మ. 3 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
కార్డిఫ్: 2019 ప్రపంచకప్ ఆరంభంలోనే రెండు అనూహ్య ఫలితాలు. టైటిల్ ఫేవరెట్‌పై పాకిస్థాన్.. బలమైన దక్షిణాఫ్రికాపై బంగ్లాదేశ్ విజయాలు. టాప్-4లో నిలిచే జట్లను అలవోకగా అంచనా వేయలేమని తేల్చిన ఫలితాలివి. ఆరంభ మ్యాచుల్లో విజయాలు సాధించి, రెండో మెట్టులో బోల్తా పడిన జట్లు నేడు ముఖాముఖికి సిద్ధమయ్యాయి. ఆతిథ్య ఇంగ్లాండ్‌తో బంగ్లాదేశ్ సమరానికి సై అనేసింది. గెలుపు బాటలోని వచ్చేయాలని ఇంగ్లాండ్ భావిస్తుంది. 2011, 2015 ప్రపంచకప్ గ్రూప్ దశలో ఇంగ్లాండ్‌పై విజయం సాధించిన బంగ్లాదేశ్ కార్డిఫ్‌లోనూ గెలిచి, హ్యాట్రిక్ కొట్టాలని ముచ్చటపడుతోంది. బంగ్లా బెబ్బులి హ్యాట్రిక్ కొడుతుందా? ఇంగ్లాండ్ ప్రతీకారం తీర్చుకుంటుందా? చూడాలి.
బలహీనతలపై దృష్టి : బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ స్పిన్ బాగా ఆడగలరు. మేఘావృత వాతావరణంలో సీమర్లకే ఎక్కువ అవకాశాలు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ స్పిన్ ఆల్‌రౌండర్ మోయిన్ అలీతోనే బరిలోకి దిగుతోంది. స్పిన్నర్ ఆదిల్ రషీద్ స్థానంలో సీమర్ ఫ్లంకెట్ తుది జట్టులోకి రానున్నాడు. ఎంత లక్ష్యానైన్నా ఛేదించగల విధ్వంసక బ్యాట్స్‌మెన్ ఇంగ్లాండ్‌లో ఉన్నా.. ఫీల్డింగ్ తప్పిదాలు ఫలితాల్ని శాసిస్తున్నాయి. పాక్‌తో మ్యాచ్‌లో హఫీజ్ క్యాచ్ నేలపాలు చేసిన రూట్.. భారీ మూల్యం చెల్లించాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ క్యాచింగ్‌పై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి. రెండు మ్యాచుల్లో ఓపెనర్లు శుభారంభం ఇవ్వలేదు. జానీ బెయిర్‌స్టో మెగా ఇన్నింగ్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. అతడు మెరిస్తే బంగ్లా బౌలర్లకు చుక్కలే!. ఇయాన్ మోర్గాన్, జో రూట్, జోశ్ బట్లర్, బెన్ స్టోక్స్ ఫామ్ కొనసాగిస్తే ఇంగ్లాండ్ విజయం సులువే. ఆల్‌రౌండర్ జొఫ్రా ఆర్చర్ తిరిగి ఫామ్ సాధించటంపై దృష్టి పెడుతున్నాడు.
హ్యాట్రిక్ ఉత్సాహం : పసికూన ట్యాగ్‌తోనే గత రెండు ప్రపంచకప్‌లలో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసిన బంగ్లాదేశ్.. ఇప్పుడు హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. 2015లో బంగ్లా చేతిలో ఓడిన ఇంగ్లాండ్ గ్రూప్ దశ నుంచే నిష్క్రమించింది. బంగ్లాదేశ్ జట్టు ఇప్పుడు ఆశాజనక ప్రదర్శన చేస్తోంది. ఒత్తిడిలో మ్యాచ్‌పై ఆశలు వదులుకునే అలవాటు ఇప్పుడు కనిపించటం లేదు. ముష్ఫీకర్ రహీమ్, షకిబ్ అల్ హసన్‌లతో పాటు సౌమ్య సర్కార్, మహ్మదుల్లా రాణిస్తే మరోసారి 300 ప్లస్ పరుగులు చేసే అవకాశం ఉంది. షబ్బీర్ రెహమాన్ తుది జట్టులో చోటు సాధించే వీలుంది. కెప్టెన్‌గా మొర్తజా పదికి పది మార్కులు గెల్చుకున్నా.. బౌలర్‌గా తేలిపోతున్నాడు. రెండు మ్యాచుల్లో తన పది ఓవర్ల కోటా పూర్తి చేయలేదు. ఇంగ్లాండ్‌పై మంచి రికార్డున్న మొర్తజా నేడు వికెట్ల వేటపై దృష్టి సారించనున్నాడు. ముస్తాఫిజుర్ రెహమాన్‌తో సైఫుద్దీన్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు.
పిచ్ రిపోర్టు : గత రెండు ప్రపంచకప్ మ్యాచుల్లో కార్డిఫ్ సీమర్లకు అనుకూలించింది. చిన్న బౌండరీల స్టేడియం కొన్నిసార్లు నెమ్మదిగానూ స్పందిస్తుంది. స్ట్రయిక్ బౌండరీలు మరీ చిన్నవి కావటం ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌కు మేలు చేస్తుంది. గతంలో ఆసీస్‌పై ఇంగ్లాండ్ భారీ స్కోరు ఛేదించింది. వర్షం ముప్పుతో రెండు రోజులుగా పిచ్‌పై కవర్లు ఉంచారు. పేసర్లకు ఇది మరింత ప్రయోజనం చేకూరుస్తుంది.
తుది జట్లు (అంచనా) :
ఇంగ్లాండ్ : జేసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, ఇయాన్ మోర్గాన్, బెన్ స్టోక్స్, జోశ్ బట్లర్, మోయిన్ అలీ, క్రిస్ వోక్స్, లియామ్ ఫ్లంకెట్, జొఫ్రా ఆర్చర్, మార్క్‌వుడ్.
బంగ్లాదేశ్ : తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్, షకిబ్ అల్ హసన్, ముష్ఫీకర్ రహీమ్, మహ్మదుల్లా, మహ్మద్ మిథున్, మొసద్దిక్ హుస్సేన్, మహ్మద్ సైఫుద్దీన్, మెహిది హసన్, మష్రఫె మొర్తజా, ముస్తాఫిజుర్ రెహమాన్.