Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బంగ్లాదేశ్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
- రాణించిన జానీ బెయిర్‌స్టో
- మెరిసిన బెన్ స్టోక్స్, మార్క్‌వుడ్
ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ వరుసగా మూడో మ్యాచ్‌లో 300 ప్లస్ పరుగులు బాదేసింది. ఉత్కంఠ ఛేదనలో పాకిస్థాన్‌కు విజయాన్ని కోల్పోయిన ఇంగ్లాండ్.. బంగ్లాదేశ్‌పై బలంగా పుంజుకున్నది. ఓపెనర్లు శతక భాగస్వామ్యంతో కదం తొక్కగా.. బట్లర్ అండతో ఆఖరి పది ఓవర్లలో 100 ప్లస్ పరుగులు చేసింది. 386/6 పరుగులు చేసిన ఇంగ్లాండ్ ప్రపంచకప్‌లో రెండో విజయం నమోదు చేసింది. ఛేదనలో షకిబ్ అల్ హసన్ (121) బంగ్లాదేశ్‌ను పోటీలో నిలుపలేదు. 280 పరుగులకే కుప్పకూలగా, 106 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది.
కార్డిఫ్: ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ చేతిలో వరుస ఓటములకు ఆతిథ్య ఇంగ్లాండ్ తనదైన శైలిలో చెక్ పెట్టింది. 2011, 2015 ప్రపంచకప్‌లలో బంగ్లాదేశ్ చేతిలో ఓడిన ఇంగ్లాండ్.. సొంతగడ్డపై ప్రతీకారం తీర్చుకున్నది. జేసన్ రారు (153, 121 బంతుల్లో 14 ఫోర్లు, 5 సిక్స్‌లు), జోశ్ బట్లర్ (64, 44 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), జానీ బెయిర్‌స్టో (51, 50 బంతుల్లో 6 ఫోర్లు) ధనాధన్ ఇన్నింగ్స్‌లతో చెలరేగారు. రారు, బట్లర్ జోరుతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 386 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఛేదనలో షకిబ్ అల్ హసన్ (121) శతకబాదినా బంగ్లాదేశ్ 280 పరుగులకే కుప్పకూలింది. 106 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ గెలుపొందింది.
రాయ్, బట్లర్ జోరు : టాస్ నెగ్గిన బంగ్లాదేశ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. గత రెండు మ్యాచుల్లో నిరాశపరిచిన ఓపెనర్లు బంగ్లాపై విరుచుకుపడ్డారు. తొలి ఐదు ఓవర్లలో బంగ్లాదేశ్ బౌలర్లు దూకుడుగా బంతులేశారు. జేసన్ రారు ఎదురుదాడితో సీన్ మారిపోయింది. ఏడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 38 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించిన జేసన్ రారు బంగ్లా బౌలర్లపై ఆధిపత్యం సాధించాడు. జానీ బెయిర్‌స్టో సైతం అర డజను బౌండరీలతో కదం తొక్కాడు. ఓపెనర్ల మెరుపులతో తొలి వికెట్‌కు ఇంగ్లాండ్ 128 పరుగులు జోడించింది. బెయిర్‌స్టో నిష్క్రమించినా రారు జోరు తగ్గలేదు. రూట్ తోడుగా చెలరేగాడు. 92 బంతుల్లో శతకబాదిన రారు, 120 బంతుల్లో 150 మార్క్ చేరుకున్నాడు. జో రూట్ (21) విఫలమైనా.. ఆఖర్లో జోశ్ బట్లర్ (64) ధనాధన్‌తో దండెత్తాడు. నాలుగు సిక్సర్లు, రెండు ఫోర్లు బాదిన బట్లర్ ఇంగ్లాండ్‌ను 400 దిశగా తీసుకెళ్లాడు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (35) భారీ షాట్ల ఆడేందుకు ఇబ్బంది పడ్డాడు. మోర్గాన్, బట్లర్ ఆఖరి ఐదు ఓవర్లలో వెనుదిరిగినా... ఫ్లంకెట్ (27 నాటౌట్, 9 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), క్రిస్ వోక్స్ (18 నాటౌట్, 8 బంతుల్లో 2 సిక్స్‌లు) హీరోయిక్స్ ఇంగ్లాండ్‌కు 386 పరుగుల భారీ స్కోరు అందించింది.
షకిబ్ శతకం వృథా : రికార్డు ఛేదనలో బంగ్లాదేశ్ చేతులెత్తేసింది. ఆరంభంలోనే ఓపెనర్ సౌమ్య సర్కార్ (2) వికెట్ తీసిన జొఫ్రా ఆర్చర్..బంగ్లాను దెబ్బకొట్టాడు. షకిబ్ అల్ హసన్ (121, 119 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్) ఓ ఎండ్‌లో నిలిచినా ఫలితం లేకపోయింది. సాధించాల్సిన రన్‌రేట్ భారీగా ఉండగా.. బంగ్లా బ్యాట్స్‌మెన్ అంచనాలను అందుకోలేదు. తమీమ్ ఇక్బాల్ (19) నిరాశపరిచాడు. ముష్ఫీకర్ రహీమ్ (44), మహ్మదుల్లా (28), మొసద్దిక్ హుస్సేన్ (26) వేగంగా ఆడే ప్రయత్నం చేశారు. 12 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 121 పరుగులు చేసిన షకిబ్ బంగ్లా అవసరాలను తీర్చలేదు. జొఫ్రా ఆర్చర్ (3/30), బెన్ స్టోక్స్ (3/23) విజృంభించగా 48.5 ఓవర్లలో బంగ్లాదేశ్ 280 పరుగులకే కుప్పకూలింది.
సంక్షిప్త స్కోర్లు : ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ : 386/6 (జేసన్ రారు 153, జోశ్ బట్లర్ 64, జానీ బెయిర్‌స్టో 51, మెహది హసన్ 2/67)
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ : 280/10 ( షకిబ్ అల్ హసన్ 121, ముష్ఫీకర్ రహీమ్ 44, మహ్మదుల్లా 28, జొఫ్రా ఆర్చర్ 3/30, బెన్ స్టోక్స్ (3/23)