Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్ట్రేలియాతో కీలక పోరు నేడు
- జోరు మీదున్న కోహ్లిసేన
- ఇరు జట్లకూ ఇది కీలక సమరం
ఆస్ట్రేలియాతో మ్యాచ్ అనగానే ఏమైతుందో? అనే ఆందోళన. అది ప్రపంచకప్ మ్యాచైతే కంగారూ జట్టు ఎంతో కలవర పెట్టేది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆస్ట్రేలియా ఎప్పట్లాగే బలంగానే కనిపిస్తున్నా.. టీమ్ ఇండియా శత్రు దుర్బేద్యంగా తయారైంది. ఇటీవల ఆసీస్‌పై విజయాన్ని ఓ అలవాటుగా చేసుకుంది!
గత రెండు ప్రపంచకప్‌లో ఈ జట్ల ముఖాముఖిలో ఎవరు పైచేయి సాధిస్తే వరల్డ్‌కప్ వారి సొంతమైంది. 2011లో ఆసీస్‌పై నెగ్గిన భారత్ చాంపియన్‌గా నిలువగా.. 2015లో భారత్‌ను సెమీస్‌లో ఓడించిన కంగారూ విజేతగా నిలిచింది. 2003లోనూ భారత్‌పై విజయంతో ఆస్ట్రేలియా విజయదరహాసం చేసింది. గత రికార్డు దృష్ట్యా కొంత మంది భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌ను ప్రపంచకప్ నిర్ణయాత్మక పోరు అని అభివర్ణిస్తున్నారు.
సమవుజ్జీల సమరం. కాగితంపై కోహ్లిసేన ఫేవరెట్‌గా కనిపిస్తున్నా, వెస్టిండీస్‌పై గొప్పగా పుంజుకున్న ఆస్ట్రేలియా పోరాట పటిమ కోల్పోలేదని నిరూపించుకుంది. ఇరు వైపులా బ్యాట్స్‌మెన్ భీకర ఫామ్‌లో ఉన్నారు. పరుగుల వరద పారే పోరులో మెరుగైన బౌలింగ్ ప్రదర్శన విజయాన్ని కట్టబెడుతుంది. భారత్, ఆస్ట్రేలియా కీలక సమరం నేడు.
లండన్ (ఓవల్)
మూడు నెలల క్రితం, రాంచీ వన్డేకు ముందు ఆస్ట్రేలియా 33 వన్డేల్లో 8 మాత్రమే గెలిచింది. టీ20 సిరీస్ 2-1తో నెగ్గిన కోహ్లిసేన.. వన్డే సిరీస్‌లో 2-0తో గెలుపు లాంఛనం చేసుకుంది. రాంచీ వన్డే ఆస్ట్రేలియా గమనాన్ని మార్చివేసింది. మానసికంగా కుంగిన కంగారూకు నూతన జవసత్వాలు అందించింది. కెప్టెన్ అరోన్ ఫించ్ మెరుపులతో.. మాక్స్వెల్, టర్నర్ విధ్వంసంతో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది. అదే ఊపులో పాకిస్థాన్‌పై క్లీన్‌స్వీప్ చేసింది. వార్నర్, స్మిత్ రాకతో మరింత బలం పుంజుకుని ఇంగ్లాండ్‌లో టైటిల్ పోటీదారుగా నిలిచింది. భారత్‌పై విజయంతోనే ఆత్మవిశ్వాసం సంపాందించిన ఆస్ట్రేలియా.. వరల్డ్‌కప్‌లో అదే భారత్‌ను ఎదుర్కొనుంది. ఆసీస్‌కు వరుసగా మూడు వన్డేలు కోల్పోయిన కోహ్లిసేన ఏకంగా ప్రపంచకప్‌లో ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైంది. 2015 ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్‌ను ఆతిథ్య ఆసీస్ ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న టీమ్ ఇండియా.. ఆసీస్ వరుస విజయాలకు బ్రేక్ వేస్తుందేమో చూద్దాం.
మనకు కీలకం : గత నాలుగేండ్లలో భారత జట్టు నిలకడగా విజయాలు సాధించడానికి ప్రధాన కారణం టాప్-3 బ్యాట్స్‌మెన్. 2015 ప్రపంచకప్ తర్వాత ఓపెనర్ రోహిత్ శర్మ బ్యాటింగ్ సగటు 67. మరే ఓపెనర్‌కు ఈ స్థాయి సగటు లేదు. శిఖర్ ధావన్, విరాట్ కోహ్లిలతో అతడు నిర్మించే భాగస్వామ్యాలు భారత్‌ను అగ్రపథాన నిలిపాయి. సఫారీ మ్యాచ్‌లో ధావన్, కోహ్లి ఇద్దరూ విఫలమయ్యారు. ఆస్ట్రేలియాపై మంచి రికార్డున్న కోహ్లి, ప్రపంచకప్‌లో చెలరేగే శిఖర్ నేడు భారీ స్కోర్లపై కన్నేశారు. నాణ్యమైన జట్టుపై విరుచుకుపడే అలవాటు కోహ్లిలో కనిపిస్తుంది. ఆసీస్‌పై విరాట్ అద్భుత ఇన్నింగ్స్ ఆశించవచ్చు. నం.4లో కెఎల్ రాహుల్ పరుగుల పరంగా తక్కువే చేసినా.. అతడు ఇన్నింగ్స్ అసమానం. వికెట్లు పడిన ఒత్తిడిలో క్రీజులో నిలిచి కీలక భాగస్వామ్యంలో పాలు పంచుకున్నాడు. మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడేందుకు ఇష్టపడే రాహుల్ నేడు ఆసీస్‌పై బ్యాట్ పదును తేల్చుకుంటాడేమో చూడాలి. ఐపీఎల్ సహా అంతర్జాతీయ మ్యాచుల్లో ఎం.ఎస్ ధోని ఇటీవల ఆఖర్లో వికెట్ కోల్పోతున్నాడు. ప్రపంచకప్‌లో ధోని ఈ బలహీనత అధిగమించాలి. చివరి వరకూ క్రీజులో నిలిచి, బాధ్యత తీసుకోవాలి.
జశ్‌ప్రీత్ బుమ్రా భారత్‌కు ప్రధాన ఆయుధం. డెవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మాక్స్‌వెల్‌పై బుమ్రానే బ్రహ్మాస్త్రం. వైవిధ్యతం చూపించే బుమ్రా పవర్ ప్లే, డెత్ ఓవర్లలో రాణించటంపై భారత విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయని చెప్పటం అతిశయోక్తి కాదు. బ్యాటింగ్ చేయగల అదనపు అర్హతతో భువనేశ్వర్ కుమార్ తుది జట్టులో ఉండనున్నాడు. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యుజ్వెంద్ర చాహల్‌లు మిడిల్ ఓవర్లలో తమ బాధ్యత పూర్తి చేస్తే అంతా కోహ్లిసేన ప్లాన్ ప్రకారం సాగుతుంది.
వీళ్లను ఇలా ఆపాలి : ఆస్ట్రేలియా శిబిరంలో కీలక ఆటగాళ్లు డెవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్. ఈ నలుగురిలో ఏ ఇద్దరు మెరిసినా, ఆస్ట్రేలియా రేసులోనే ఉంటుంది. టాప్ ఆర్డర్లో డెవిడ్ వార్నర్ అత్యంత ప్రమాదకారి. పేస్, స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొగలడు. రిస్క్ లేకుండా సులువుగా పరుగులు చేయగలడు. షార్ట్ బంతులు, బౌన్సర్లు సంధిస్తే దండన కఠినంగానే ఉంటుంది. గుడ్ లెంగ్త్ (స్టంప్స్ నుంచి ఆరు నుంచి ఎనిమిది మీటర్లు) బంతులను ఆఫ్ స్టంప్‌కు ఆవలగా సంధిస్తే వార్నర్ దూకుడు అడ్డుకోవచ్చు. సఫారీ బ్యాట్స్‌మన్ క్వింటన్ డికాక్‌కు ఎంచుకున్న లైన్ అండ్ లెంగ్త్‌ను వార్నర్‌పైనా బుమ్రా కొనసాగిస్తే ఆరంభంలోనే పెను ప్రమాదానికి చెక్ పెట్టవచ్చు. ఆరంభ ఓవర్లలో వార్నర్ నిలిస్తే.. మరో ఆలోచన లేకుండా కుల్దీప్ యాదవ్‌ను ప్రయోగించాలి. గాలిలో నెమ్మదిగా బంతిని తిప్పే కుల్దీప్పై స్వీపింగ్, రివర్స్ స్వీపింగ్, స్విచ్ హిట్టింగ్‌కు వార్నర్ పూనుకుంటాడు. అతడి వికెట్ పడగొట్టేందుకు ఇదో మార్గం.
విలక్షణ బ్యాటింగ్ శైలి, సాంకేతికత లేని టెక్నిక్ కలిగిన విలువైన ఆటగాడు స్టీవ్ స్మిత్. ఆ బ్యాటింగ్ శైలిలో ఎల్బీ ప్రమాదం ఎక్కువున్నా, స్మిత్ బంతిని ప్యాడ్లపైకి రానీయడు. స్మిత్‌కు ఫుల్ లెంగ్త్ బంతులను ఏడో స్టంప్ట్ (ఆఫ్ స్టంప్ వైడ్‌కు చేరువగా) లైన్లో వేయాలి. బంతులను డ్రైవ్ చేసేందుకు ఇష్టపడడు. ఇదే సమయంలో గల్లీలో ఫీల్డర్‌ను మొహరించాలి. సర్కిల్లో సింగిల్స్ తీసుకునే స్మిత్‌కు మిడ్ ఆఫ్, మిడాన్ ఫీల్డర్లతో స్పిన్ సంధించాలి. స్ట్రయిక్ రొటేషన్‌కు ఇష్టపడే స్మిత్‌కు కళ్లెం వేయగలిగితే విసుగు చెందుతాడు.
బౌలింగ్ విభాగంలో మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్‌లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కోసం వ్యూహంతో సిద్ధంగా ఉన్నారు. షార్ట్ బంతులను వేగంగా సంధించే స్టార్క్.. వార్మప్ మ్యాచ్‌లో రోహిత్‌కు బౌల్ట్ వేసినట్టు షార్ట్ బంతి వేసే ఆలోచనలో ఉన్నాడు. భారత టాప్ ఆర్డర్ మొత్తానికి గల్లీలో ఫీల్డర్‌ను మొహరించనున్న ఆస్ట్రేలియా.. వేగంగా షార్ట్ పిచ్ బంతులను వేయనుంది. ధావన్‌ను రబాడ ఇబ్బందిపెట్టిన తరహా బంతులను అతడిపై ప్రయోగించనుంది. కోహ్లికి ఆరో స్టంప్ లైన్లో బంతి సంధిస్తూ.. గల్లీ, స్లిప్స్‌లో క్యాచుల కోసం కంగారూ ఎదురు చూడనుంది. పాట్ కమిన్స్ ఈ వ్యూహం పక్కాగా అమలు చేసేందుకు వస్తున్నాడు. షార్ట్ బంతులకు మనోళ్లు ఏ విధంగా సమాధానం ఇస్తారో చూడాలి.
పిచ్ రిపోర్టు : 2015 ప్రపంచకప్ నుంచి ఇంగ్లాండ్‌లో అత్యధిక పరుగులు నమోదవుతున్న మైదానాల్లో ఓవల్ ఒకటి. భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌కు ఫ్లాట్ పిచ్ లభించనుంది. వర్షం ముప్పు లేకపోయినా, బలమైన ఎదురుగాలులు వీచనున్నాయి.
తుది జట్లు (అంచనా) :
భారత్ : రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, కెఎల్ రాహుల్, ఎం.ఎస్ ధోని, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, జశ్‌ప్రీత్ బుమ్రా, యుజ్వెంద్ర చాహల్.
ఆస్ట్రేలియా : డెవిడ్ వార్నర్, అరోన్ ఫించ్, ఉస్మాన్ ఖవాజ, స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, అలెక్స్ క్యారే, నాథన్ కౌల్టర్‌నైల్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.
ఆస్పత్రిలో నెట్ బౌలర్ : ఆస్ట్రేలియా నెట్ బౌలర్ ఆస్పత్రి పాలయ్యాడు. భారత్‌తో మ్యాచ్‌కు ముందు ఆసీస్ నెట్ సెషన్లో సాధన చేస్తుంది. డెవిడ్ వార్నర్‌కు నెట్ బౌలర్ జై కిషన్ బౌలింగ్ చేస్తున్నాడు. వార్నర్ బాదిన స్ట్రయిట్ షాట్ కిషన్ తలకు తగిలింది. కిషన్ తప్పించుకునే లోపే తలకు గాయమైంది. వైద్య సిబ్బంది వెంటనే కిషన్‌కు ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం హాస్పిటల్‌కు తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతానికి కిషన్ ఆరోగ్యంగా ఉన్నాడు. బలమైన గాయం వలన, మతిమరుపు ప్రమాదం ఉందా? అనేది తెలుసుకునేందుకు వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచారు. ఈ ఘటన తర్వాత ఆస్ట్రేలియా నెట్ సెషన్ 20 నిమిషాల పాటు నిలిపి వేశారు. డెవిడ్ వార్నర్ తీవ్రంగా కలత చెందినట్టు తెలుస్తోంది. నెట్ బౌలర్ల గాయాలు ఇది తొలిసారి కాదు. నెట్ బౌలర్లు హెల్మెట్ ధరించాలని గతంలోనే ఇంగ్లాండ్ సీమర్ అండర్సన్ సూచన చేశాడు. తాజా సంఘటనతో ఆసీస్ కెప్టెన్ అరోన్ ఫించ్ సైతం అదే అభిప్రాయం వెలిబుచ్చాడు.