Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లకు చెరో పాయింట్
ప్రపంచకప్ టోర్నీని వర్షం వెంటాడుతోంది. ఇప్పటికే పాకిస్తాన్-శ్రీలంక జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ పూర్తిగా రద్దుకాగా... నేడు దక్షిణాఫ్రికా-వెస్టిండీస్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా 7.3 ఓవర్ల అనంతరం తుడిచిపెట్టుకుపోయింది. దీంతో ఇరుజట్లకు చెరోపాయింట్ లభించాయి.
సౌతాంప్టన్: వర్షం కారణంగా మరో మ్యాచ్ తుడిచిపెట్టుకు పోయింది. జూన్ 7న పాకిస్తాన్-శ్రీలంక జట్ల మధ్య ఓవల్ జరగాల్సిన మ్యాచ్ కనీసం టాస్ కూడా పడకుండానే రద్దు అయిన విషయం తెలిసిందే. అలాగే సోమవారం దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్ల మధ్య సౌతాంప్టన్‌లోని రౌజ్బాల్ మైదానంలో జరగాల్సిన మ్యాచ్ 7.3 ఓవర్ల అనంతరం వర్షం కారణంగా రద్దైంది. దీంతో ఇరుజట్లకు చెరో పాయింట్ లభించింది. అంతేగాక జూన్ 4న శ్రీలంక-ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య కర్డిఫ్లోని సోఫియా గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్ కూడా 3 గంటలకు పైగా నిలిచిపోయింది. దీంతో ప్రపంచకప్ టోర్నీని వర్షం వెంటాడుతోంది. టోర్నీ ప్రారంభమై రెండు వారాలు కూడా పూర్తి కాకముందే మూడు మ్యాచ్‌లపై వర్షం తన ప్రతాపాన్ని చూపింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోతే మరుసటిరోజు ఆడే అవకాశం లేకపోవడంతో రద్దు అయిన మ్యాచ్‌ల ఇరుజట్లకు చెరోపాయింట్ కేటాయిస్తున్నారు. ఈ నిబంధనల కారణంగా పూర్వపు టోర్నీల్లో దక్షిణాఫ్రికాతో సహా కొన్ని అగ్రజట్లు నాకౌట్‌కు చేరకుండానే లీగ్ దశలోనే వెనుదిరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇంకా నెలరోజులపాటు సాగే ఈ టోర్నీలో ఇంకా ఎన్ని మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దవుతాయోనని సగటు క్రికెట్ అభిమానులు నిరుత్సాహానికి గురవుతున్నారు.
సోమవారం టాస్ గెలిచిన వెస్టిండీస్ దక్షిణాఫ్రికాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ హషీమ్ ఆమ్లా(6), వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ మర్కరమ్(5) వికెట్లను త్వరగానే చేజార్చుకుని కష్టాల్లో పడింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను ఆమ్లా, డీకాక్‌లు ఆరంభించారు. కాగా, కాట్రెల్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్ ఐదో బంతికి ఆమ్లా స్లిప్‌లో గేల్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆపై క్రీజ్‌లోకి వచ్చిన మర్కరమ్ కీపర్ షారు హోప్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కాట్రెల్ వేసిన ఏడో ఓవర్ తొలి బంతికి మర్కరమ్ బంతిని లెగ్ సైడ్‌కు ఆడబోయాడు. అది కాస్తా ఎడ్జ్ తీసుకుని కీపర్ చేతుల్లోకి వెళ్లడంతో మర్కరమ్ నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 7.3 ఓవర్లలో 28 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయానికి క్రీజ్‌లో డికాక్(17), డుప్లెసిస్(0) ఉన్నారు. ఆ తర్వాత మ్యాచ్ జరపడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఓ దశలో వర్షం వెలిసి కవర్లు తొలిగించే క్రమంలో మరొకసారి వరుణుడు అంతరాయం కల్గించాడు. కనీసం 20 ఓవర్ల మ్యాచ్ జరపాలకున్నప్పటికీ అది సాధ్యం కాలేదు. చివరకు భారత కాలమానప్రకారం రాత్రి గం.8.50 ని.లకు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఇప్పటికే వరుస మూడు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన దక్షిణాఫ్రికాకు విండీస్ మ్యాచ్ కీలకమైనప్పటికీ వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోవడంతో ఆజట్టుకు ఒక పాయింట్ దక్కింది. మరొకవైపు ఒక మ్యాచ్‌లో గెలిచి, మరొక మ్యాచ్‌లో ఓడిన విండీస్‌కు ఇది మూడో లీగ్ మ్యాచ్. ఆస్ట్రేలియాతో జరిగిన గత మ్యాచ్‌లో వెస్టిండీస్ ఓటమి పాలైంది. దాంతో తాజా మ్యాచ్ ద్వారా విజయాల బాట పట్టాలని భావించిన కరీబియన్లు ఒక పాయింట్ దక్కడంతో నిరుత్సాహానికి గురయ్యారు.
ఆండ్రీ రసెల్ దూరం
ఈ మ్యాచ్‌కు విండీస్ స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ దూరమయ్యాడు. గాయం కారణంగా రసెల్ మ్యాచ్ నుంచి వైదొలిగాడు. ఇక ముఖాముఖి పోరులో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌లు 61 వన్డేలు ఆడగా, ఇందులో సఫారీ జట్టు 44 గెలిచి, విండీస్ 15 మాత్రమే నెగ్గింది. ఒక మ్యాచ్ టై అయ్యింది. మరో మ్యాచ్ రద్దయ్యింది. గత మూడు కప్‌లలోనూ వారిపై విజయం సాధించింది.