Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాకిస్థాన్‌తో పోరు నేడే
- మ 3 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
టాంటన్ (ఇంగ్లాండ్): డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాకు మరో సవాల్. అనిశ్చితి పాకిస్థాన్‌తో నేడు కంగారూ సమరానికి సిద్ధమైంది. పాకిస్థాన్, ఆస్ట్రేలియా వరల్డ్‌కప్ వార్ సహజంగానే కాస్త ఆసక్తికరం. 2015లో ఈ రెండు జట్ల మధ్య క్వార్టర్‌ఫైనల్స్ పోరు అభిమానులు అంత త్వరగా మరిచిపోరు. పాక్ 213 పరుగులకే కుప్పకూలినా.. సీమర్ వహబ్ రియాజ్ కండ్లుచెదిరే బౌన్సర్లతో ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను కవ్వించాడు. షేన్ వాట్సన్ వర్సెస్ వహబ్ రియాజ్ పోరు మ్యాచ్‌కే హైలైట్. నేటి మ్యాచ్‌లో పాక్ తరఫున వహబ్ రియాజ్ ఆడుతున్నా.. కంగారూ శిబిరంలో వాట్స లేడు. అయినా, నేటి పోరు ఆసక్తికరంగా సాగనుందని చెప్పవచ్చు. చివరి ద్వైపాక్షిక సిరీస్‌లో ఆస్ట్రేలియా 5-0తో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. అయితే, ఇంగ్లాండ్ సైతం తన చివరి సిరీస్‌లో పాక్‌ను 4-0తో ఓడించింది. కానీ ప్రపంచకప్‌లో విజయంతో ఇంగ్లాండ్‌పై పాక్ ప్రతీకారం తీర్చుకుంది. మరి ఆస్ట్రేలియాపైనా అదే ఫలితం పునరావృతం చేస్తుందా? చూడాలి.
వార్నర్ ఏమైంది? : ఏడాది నిషేధం ముగించుకుని నేరుగా ప్రపంచకప్ జట్టులోకి వచ్చేసిన డెవిడ్ వార్నర్, కంగారూకు పెద్ద బలం. కానీ మ్యాచులు సాగేకొద్దీ అతడే బలహీనత అవుతున్నాడని అనిపిస్తోంది. అఫ్గాన్‌పై 76 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన వార్నర్.. భారీ ఛేదనలో భారత్‌పైనా నెమ్మదిగా ఆడాడు. 77 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. వార్నర్‌పై కట్టుదిట్టమైన బంతులు వేస్తున్నారా? లేక వార్నర్ మునుపటి ఎదురుదాడి సత్తా కోల్పోయాడా? అనేది నేటి మ్యాచ్ తేల్చాలి. వార్నర్ ప్రదర్శన ఇలాగే కొనసాగితే ఓపెనర్ స్థానాన్ని ఖవాజకు కోల్పోవాల్సి ఉంటుంది. బ్యాటింగ్ లైనప్‌లో అరోన్ ఫించ్, మాక్స్వెల్, స్టీవ్ స్మిత్ ఫామ్‌లో ఉన్నారు. వికెట్ కీపర్ అలెక్స్ క్యారె ఫామ్‌లోకి రావటం శుభ పరిణామం. మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, నాథన్ కౌల్టర్నైల్తో కూడిన పేస్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. స్పిన్నర్ ఆడమ్ జంపా స్థానంలో నాథన్ లైయాన్ తుది జట్టులోకి వచ్చే అవకాశం కొట్టిపారేయలేం.
పాక్ ఏం చేస్తుందో? : గతాన్ని చూసి వర్తమానం, వర్తమానం చూసి భవిష్యత్‌ను అంచనా వేయకూడదనే సామెత పాకిస్థాన్‌కు అతికినట్టు సరిపోతుంది. వరుసగా 11 మ్యాచుల్లో పరాజయాల తర్వాత టైటిల్ ఫేవరెట్ ఇంగ్లాండ్‌ను ఓడించిన పాకిస్థాన్.. అంతకముందు వెస్టిండీస్ ముందు చేతులెత్తేసింది. శ్రీలంకతో మ్యాచ్ వర్షార్పణం కాగా.. ఇంగ్లాండ్ మ్యాచ్ తర్వాత ఇదే పాక్‌కు తొలి పోరు!. ఫకర్ జమాన్, ఇమామ్ ఉల్లు శుభారంభాల్ని అందిస్తున్నారు. బాబర్ ఆజామ్ నిలకడ పాక్‌కు అత్యంత కీలకం. సర్ఫరాజ్ అహ్మద్, మహ్మద్ హఫీజ్‌లు మిడిల్ ఆర్డర్ భారాన్ని మోస్తున్నారు. సీమర్లు మహ్మద్ ఆమీర్, వహబ్ రియాజ్, హసన్ అలీలతో పాటు స్పిన్నర్ షాదాబ్ ఖాన్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఆసీస్‌పై విజయంతో భారత్‌తో మ్యాచ్‌కు మెరుగ్గా సిద్ధమవ్వాలని పాకిస్థాన్ భావిస్తోంది. అందుకు కంగారూ అంగీకరిస్తుందా?.
పిచ్ రిపోర్టు : టాంటన్‌లో ఇది రెండో వరల్డ్‌కప్ మ్యాచ్. అఫ్గాన్, న్యూజిలాండ్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగింది. అప్పుడు స్పిన్నర్లు, సీమర్లకు సహకారం లభించింది. నేడు మ్యాచ్‌లోనూ పిచ్ అదే రీతిలో స్పందించనుంది. ఇరు వైపులా నాణ్యమైన సీమర్లు ఉన్నారు. భారీ స్కోర్లు నమోదైతే స్పిన్ కీలక భూమిక వహించే అవకాశం ఉంది.
తుది జట్లు (అంచనా) : ఆస్ట్రేలియా : అరోన్ ఫించ్, డెవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజ, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, అలెక్స్ క్యారె, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, నాథన్ కౌల్టర్‌నైల్, ఆడమ్ జంపా.
పాకిస్థాన్ : ఫకర్ జమాన్, ఇమామ్ ఉల్ హాక్, బాబర్ ఆజామ్, మహ్మద్ హఫీజ్, సర్ఫరాజ్ అహ్మద్, షోయబ్ మాలిక్, అసిఫ్ అలీ, మహ్మద్ ఆమీర్, వహబ్ రియాజ్, షాదాబ్ ఖాన్, హసన్ అలీ.