Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-అరోన్ ఫించ్ కెప్టెన్సీ ఇన్నింగ్స్
-మహ్మద్ ఆమీర్ ఐదు వికెట్లు వృథా
-పాకిస్థాన్‌పై ఆసీస్ ఘన విజయం
టాంటన్ (ఇంగ్లాండ్) : డిఫెండింగ్ ఆస్ట్రేలియా గెలుపు బాట పట్టింది. రెండు వరుస విజయాల తర్వాత టీమ్ ఇండియా చేతిలో దారుణ ఓటమి చవిచూసిన ఆస్ట్రేలియా వెంటనే పుంజుకుంది. మాజీ చాంపియన్ పాకిస్థాన్‌పై 41 పరుగుల తేడాతో తిరుగులేని విజయం సాధించింది. డ్యాషింగ్ ఓపెనర్ డెవిడ్ వార్నర్ (107, 111 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్) మెరుపు సెంచరీతో చెలరేగాడు. అరోన్ ఫించ్ (82, 84 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో మెప్పించాడు. ఓపెనర్ల మెరుపులతో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా సాగింది. మహ్మద్ ఆమీర్ (5/30) అద్భుత ప్రదర్శనతో 307 పరుగులతో సరిపెట్టుకుంది. ఛేదనలో పాకిస్థాన్ 266 పరుగులకే కుప్పకూలింది. ఇమామ్ ఉల్ హాక్ (53), మహ్మద్ హఫీజ్ (46), వహబ్ రియాజ్ (45) పోరాటం సరిపోలేదు. పాకిస్థాన్‌కు ఇది రెండో ఓటమి.
వార్నర్, ఫించ్ జోరు : టాస్ నెగ్గిన పాకిస్థాన్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆరంభ ఓవర్లలో పాక్ సీమర్లు మెరుగ్గా బంతులేశారు. కానీ చెత్త ఫీల్డింగ్ ఆసీస్ ఓపెనర్లను జీవదానాలు అందించింది. అరోన్ ఫించ్, డెవిడ్ వార్నర్‌లు ఇచ్చిన క్యాచులను పాక్ ఫీల్డర్లు అందుకోలేదు. అవకాశాలను సద్వినియోగం చేసుకున్న వార్నర్, ఫించ్ భారీ స్కోర్లు బాదారు. తొలి వికెట్‌కు 146 పరుగులు జోడించారు. భారత్‌పై పరుగులు చేసేందుకు ఇబ్బంది పడిన వార్నర్ పాకిస్థాన్‌పై అర డజను ఫోర్లతో 51 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. మరో ఎండ్‌లో అరోన్ ఫించ్ ఇబ్బంది పడినా.. ఆరు ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 63 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. పాక్ బౌలర్లపై ఎదురుదాడి చేసిన వార్నర్ తాజా వరల్డ్‌కప్‌లో తొలి సెంచరీ నమోదు చేశాడు. ఆమీర్, రియాజ్ బౌన్సర్లను గౌరవించిన వార్నర్.. స్కోరింగ్ బంతులపైనే దాడి చేశాడు. 102 బంతుల్లో శతకబాదిన వార్నర్ తర్వాత వికెట్ నిలుపుకోలేదు. అంతకముందే కెప్టెన్ ఫించ్ (82) ఆమీర్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. భారీ ఆరంభంతో ఆస్ట్రేలియా స్కోరు 350 దాటేలా కనిపించింది. కానీ మహ్మద్ ఆమీర్ విజృంభణతో ఆసీస్ అంచనాలను అందుకోలేదు. స్టీవ్ స్మిత్ (10), మాక్స్వెల్ (20), షాన్ మార్ష్ (23), ఖవాజ (18), అలెక్స్ క్యారె (20)లలో ఎవరూ నిలబడలేదు. మరో ఆరు బంతులు ఉండగానే ఆసీస్‌ను పాక్ ఆలౌట్ చేసింది. షాహిన్ ఆఫ్రిది రెండు వికెట్లు తీసుకోగా.. ఆమీర్ ఐదు వికెట్లతో చెలరేగాడు.
ఛేదనలో చిత్తు : ఊరించే ఛేదనలో పాకిస్థాన్ చిత్తయ్యింది. కంగారూ సీమర్ పాట్ కమిన్స్ పాకిస్థాన్ ఛేదనను దెబ్బకొట్టాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే ప్రమాదకర ఓపెనర్ ఫకర్ జమాన్ (0)ను డకౌట్ చేశాడు. బాబర్ ఆజామ్ (30), ఇమామ్ ఉల్ హాక్ (53) ఛేదనను ట్రాక్‌పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. బాబర్ క్రీజులో ఉన్నంతవరకూ పాక్ ఆశలు నిలిచే ఉన్నాయి. కౌల్టర్ నైల్ బౌలింగ్‌లో బాబర్ ఆజామ్ నిష్క్రమించగా, ఆసీస్ పైచేయి సాధించింది. మహ్మద్ హఫీజ్ (46)తో కలిసి ఇమామ్ మరో భాగస్వామ్యం నెలకొల్పినా ఫలితం లేకపోయింది. వరుస ఓవర్లలో ఇమామ్ ఉల్ హాక్, షోయబ్ మాలిక్ (0)లను అవుట్ చేసిన కమిన్స్ పాక్ ఓటమిని లాంఛనం చేశాడు. చివర్లో హసన్ అలీ (32, 15 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులు ఓటమి అంతరాన్ని తగ్గించగా.. కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ (40, 48 బంతుల్లో 1 ఫోర్) టెయిలెండర్లతో కలిసి ఆసీస్ విజయాన్ని ఆలస్యం చేశాడు. వహబ్ రియాజ్ (45, 39 బంతుల్లో 2 ఫోర్లు 3 సిక్స్‌లు) ధనాధన్‌తో ఆసీస్ శిబిరంలో గుబులు పుట్టించాడు. కానీ మిచెల్ స్టార్క్ ఒకే ఓవర్లో రియాజ్, ఆమీర్ (0)లను అవుట్ చేసి పాక్ ఆశలను ఆవిరి చేశాడు. 45.4 ఓవర్లలో 266 పరుగులకు పాకిస్థాన్ ఆలౌటైంది.
సంక్షిప్త స్కోర్లు : ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ : 307/10 ( డెవిడ్ వార్నర్ 107, అరోన్ ఫించ్ 82, మహ్మద్ ఆమీర్ 5/30, షాహిన్ ఆఫ్రిది 2/70)
పాకిస్థాన్ ఇన్నింగ్స్ : 266/10 : (ఇమామ్ ఉల్ హాక్ 53, మహ్మద్ హఫీజ్ 46, పాట్ కమిన్స్ 3/33, మిచెల్ స్టార్క్ 2/43)