Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బంగ్లా, విండీస్ పోరు నేడు
- మ 3 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
టాంటన్ (ఇంగ్లాండ్)
అగ్రజట్లపై అదిరే విజయాలో ప్రపంచకప్ సర్ప్రైజ్ ఫేవరెట్‌గా దూసుకొచ్చింది వెస్టిండీస్. కానీ ప్రపంచకప్‌కు ముందు ఆ జట్టు బంగ్లాదేశ్ చేతిలో పరాజయం పాలైంది. ముక్కోణపు టోర్నీ ఫైనల్లో బంగ్లాకు టైటిల్ కోల్పోయింది. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో తేలిపోయిన విండీస్.. ప్రపంచకప్‌లో మెరుగైన ప్రదర్శనే చేసింది. మరోవైపు దక్షిణాఫ్రికాపై మెగా విజయంతో వరల్డ్‌కప్‌ను ఘనంగా ఆరంభించిన బంగ్లాదేశ్ మరో విజయం దక్కించుకోలేదు. బంగ్లాదేశ్ రెండో విజయం వేటలో ఉండగా.. కరీబియన్లు గెలుపు ట్రాక్‌పైకి రావాలని చూస్తున్నారు. టాంటన్ వేదికగా నేడు బంగ్లాదేశ్, వెస్టిండీస్ పోరు.
హిట్టర్లు మెరుస్తారా? : భారీ లక్ష్యాలు నిర్దేశించటం, భారీ లక్ష్యాలను ఛేదించటంలో విండీస్‌కు తిరుగులేదు. కానీ వరల్డ్‌కప్‌లో కరీబియన్లు పూర్తి స్థాయి బ్యాటింగ్ సత్తా ప్రదర్శించలేదు. నేడు బంగ్లాదేశ్‌పై భారీ స్కోరుపై విండీస్ కన్నేసింది. యూనివర్శల్ బాస్ క్రిస్ గేల్ తనదైన ఇన్నింగ్స్ బాదాలని చూస్తున్నాడు. ఓపెనర్ ఎవిన్ లెవిస్ పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. ఓపెనర్‌గా నిలకడ చూపటం లేదు. మిడిల్ ఆర్డర్లో హౌప్, హెట్మయర్, పూరన్ గొప్పగా కనిపిస్తున్నారు. విధ్వంసక ఆల్‌రౌండర్ అండ్రీ రసెల్ సైతం వరల్డ్‌కప్‌లో అంచనాలను అందుకోలేదు. టాంటన్‌లో రసెల్ తడాఖా చూపిస్తాడేమో చూడాలి. బంతితో విండీస్ మెరుగ్గా కనిపిస్తోంది. జేసన్, థామస్, కాట్రెల్‌లు దుమ్మురేపుతున్నారు. స్పిన్నర్ అష్లె ప్రపంచకప్ స్థాయి అందుకోవాలి.
బంగ్లా ఏం చేస్తుందో? : ఆడిన మూడు మ్యాచుల్లో రెండింట ఓడిన బంగ్లాదేశ్.. దక్షిణాఫ్రికాపై మెగా విజయం సాధించింది. షకిబ్ అల్ హసన్, ముష్ఫీకర్ రహీమ్ నిలకడగా రాణిస్తున్నారు. ఓపెనర్లు సౌమ్య సర్కార్, తమీమ్ ఇక్బాల్ విఫలమవుతున్నా.. మిడిల్ మెరుపులతో బంగ్లాదేశ్ మంచి స్కోర్లు సాధిస్తోంది. మహ్మదుల్లా లోయర్ ఆర్డర్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. భారీ లక్ష్యాలను ఛేదించటంలో బంగ్లాదేశ్ నిరూపించుకోవాల్సి ఉంది. పేసర్లు మొర్తజా, ముస్తాఫిజుర్, రూబెల్ హుస్సేన్‌లకు తోడు స్పిన్నర్ మెహది హసన్ ఫామ్‌లో ఉన్నాడు. షకిబ్ బంతితోనూ కీలక భూమిక వహించే అవకాశం ఉంది.
పిచ్ రిపోర్టు : టాంటన్‌లో ఇది చివరి వరల్డ్‌కప్ మ్యాచ్. ఇక్కడ జరిగిన రెండు మ్యాచుల్లో బ్యాట్స్‌మెన్, బౌలర్లకు పిచ్ నుంచి సరసమైన సహకారం లభించింది. చల్లని వాతావరణంలో ఆరంభంలో సీమర్లు ప్రభావం చూపేందుకు ఆస్కారం ఎక్కువ. 300 ప్లస్ స్కోర్లు నమోదైతే ఆశ్చర్యం లేదు.
తుది జట్లు (అంచనా) :
బంగ్లాదేశ్ : సౌమ్య సర్కార్, తమీమ్ ఇక్బాల్, షకిబ్ అల్ హసన్, ముష్ఫీకర్ రహీమ్, మహ్మదుల్లా, మహ్మద్ మిథున్, షబ్బీర్ రెహమాన్, ముస్తాఫిజుర్ రెహమాన్, మెహది హసన్, మష్రఫె మొర్తజా, రూబెల్ హుస్సేన్.
వెస్టిండీస్ : క్రిస్ గేల్, ఎవిన్ లెవిస్, షారు హౌప్, నికోలస్ పూరన్, షిమ్రోన్ హెట్మయర్, డారెన్ బ్రావో, అండ్రీ రసెల్, ఒసేన్ థామస్, అష్లె నర్సె, షెల్డన్ కాట్రెల్, జేసన్ హౌల్డర్.