Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచకప్‌లో పాక్‌పై ఏడో విజయం
- 89 పరుగులతో భారత్ గెలుపు
-రోహిత్ శర్మ భారీ సెంచరీ
- రాణించిన విరాట్, రాహుల్
- భారత్ 336/5, పాకిస్థాన్ 212/6
మాంచెస్టర్
1992, 1996, 1999, 2003, 2011, 2015, 2019.. ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ అజేయ రికార్డు కొనసాగుతోంది. వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో భారత్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో పాకిస్థాన్‌పై 89 పరుగుల తేడాతో ఏకపక్ష విజయం నమోదు చేసింది. ప్రపంచకప్త చరిత్రలో పాకిస్తాన్‌పై భారత్‌కు ఇది వరుసగా ఏడో విజయం. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (140, 113 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లు) భారీ సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి (77, 65 బంతుల్లో 7 ఫోర్లు), ఓపెనర్ లోకేశ్ రాహుల్ (57, 78 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) బాధ్యతాయుత అర్ధ సెంచరీలు నమోదు చేశారు. హార్దిక్ పాండ్య (26, 19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) చివర్లో మెరువగా తొలుత భారత్ 336/5 పరుగులు చేసింది. రికార్డు ఛేదనలో పాకిస్థాన్‌కు బాబర్ ఆజామ్ (48, 57 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), ఫకర్ జమాన్ (62, 75 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) రెండో వికెట్ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసినా, ఫలితం లేకపోయింది. కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్య 12 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు కూల్చి పాకిస్థాన్ ఓటమి ఖరారు చేశారు. వర్షం అంతరాయంతో పాకిస్థాన్ లక్ష్యాన్ని 40 ఓవర్లలో 302 పరుగులకే సవరించారు. ఆ సమయానికి 30 బంతుల్లో 136 పరుగులు చేయాలి. 40 ఓవర్లలో 212/6 పరుగులకే పాక్ పరిమితమైంది. శతక హీరో 'రోహిత్ శర్మ' మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
బౌలర్ల మెరుపులు : రికార్డు ఛేదనలో పాకిస్థాన్‌కు ఊహించని రీతిలో ఎదురు దెబ్బ. బుమ్రా, భువి కట్టుదిట్టంగా బంతులేశారు. ఓపెనర్లు ఫకర్ జమాన్ (62, 75 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్), ఇమామ్ ఉల్ హాక్ (7, 18 బంతుల్లో 1 ఫోర్) ఆచితూచి ఆడారు. భువనేశ్వర్ ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో తొడ కండరం పట్టేయగా ఓవర్ మధ్యలోనే మైదానం వీడాడు. ప్రపంచకప్ అరంగ్రేట ఆటగాడు విజయ్ శంకర్ ఆ ఓవర్ కొనసాగించాడు. వరల్డ్‌కప్‌లో తొలి బంతికే విజరు వికెట్ పడగొట్టాడు. ఇమామ్ ఉల్ హాక్‌ను ఎల్బీ చేసిన విజరు.. భారత్‌కు బ్రేక్ ఇచ్చాడు. స్టార్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజామ్ (48, 57 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి ఫకర్ జమాన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఈ జోడీ రెండో వికెట్‌కు 104 పరుగులు జోడించి ప్రమాదకరంగా మారింది. స్పిన్నర్లపై దూకుడుగా ఆడిన ఫకర్ బౌండరీలతో కదంతొక్కాడు. బాబర్ మూడు ఫోర్లు, ఓ సిక్స్ బాదగా.. ఫకర్ ఏడు ఫోర్లు, సిక్సర్ కొట్టాడు. చైనామన్ కుల్దీప్ యాదవ్ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. మాగ్నిఫిషియెంట్ బంతితో బాబర్ ఆజామ్‌ను బోల్తా కొట్టించాడు. బాబర్ నిష్క్రమణతో పాక్ మిడిల్ ఆర్డర్ పేకమేడలా కూలింది. కుల్దీప్ తర్వాతి ఓవర్లో ఫకర్ జమాన్‌ను వెనక్కి పంపించాడు. హార్దిక్ పాండ్య వరుస బంతుల్లో మహ్మద్ హఫీజ్ (9), షోయబ్ మాలిక్ (0)లను పెవిలియన్‌కు చేర్చాడు. 12 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్ ఛేదనపై ఆశలు కోల్పోయింది. కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ (30 బంతుల్లో 12) విజరు శంకర్ బంతికి బౌల్డయ్యాడు. వర్షం మరోసారి అంతరాయం కలిగించే సమయానికి పాకిస్థాన్ 35 ఓవర్లలో 166/6తో పతనావస్థలో ఉంది. డక్‌వర్త్ ఛేదనలో పాక్ మరో 46 పరుగులు చేసింది. 89 పరుగులతో భారత్ ఏకపక్ష విజయం సాధించింది.
పద్దతిగా కొట్టారు : వర్షం ప్రభావిత మ్యాచ్‌లో టాస్ ఓడిన కోహ్లిసేన, తొలుత బ్యాటింగ్‌కు వచ్చింది. శిఖర్ ధావన్ గాయంతో కెఎల్ రాహుల్ ఓపెనర్‌గా వచ్చాడు. ఐపీఎల్ ఫామ్ కొనసాగించిన రాహుల్.. రోహిత్ జతగా తిరుగులేని ఆరంభాన్ని అందించాడు. రాహుల్ స్ట్రయిక్ రొటేట్ చేయగా, రోహిత్ ఎదురుదాడి చేశాడు. ఓపెనర్లు తొలి వికెట్‌కు 136 పరుగులు జోడించి, భారీ స్కోరుకు బాటలు వేశారు. మెరుపు ఆరంభాన్ని మిడిల్ ఆర్డర్ గొప్పగా సద్వినియోగం చేసుకుంది. కెప్టెన్ విరాట్ కోహ్లి (77) మరోసారి దాయాది జట్టుపై సూపర్ ప్రదర్శన చేశాడు. బాధ్యతాయుత అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. లోయర్ ఆర్డర్లో హార్దిక్ పాండ్య (26, 19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ షో అభిమానులను అలరించింది. ఆఖర్లో పాక్ బౌలర్లు పుంజుకున్నారు. విజయ్ శంకర్ (15 నాటౌట్, 15 బంతుల్లో 1 ఫోర్), కేదార్ జాదవ్ (9 నాటౌట్, 8 బంతుల్లో 1 ఫోర్) బౌండరీలు కొట్టలేకపోయారు. టాప్-3 బ్యాట్స్‌మెన్ హీరోయిక్స్‌తో భారత్ 336 పరుగులు చేసింది. భారత్, పాకిస్థాన్ ప్రపంచకప్ మ్యాచ్‌లో ఇదే అత్యధిక స్కోరు. పాకిస్థాన్ బౌలర్లలో మొహమ్మద్ ఆమీర్ (3/47) మూడు వికెట్లతో మెరిశాడు. హసన్ అలీ (1/84), వహబ్ రియాజ్ (1/71) ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు.
రోహిట్ శతకం : శిఖర్ ధావన్ జంటగా, పవర్ ప్లేలో నెమ్మదిగా ఆడే రోహిత్ శర్మ పాకిస్థాన్‌పై కొత్త తరహా శైలిలో కదం తొక్కాడు. ఆమీర్ వేసిన తొలి ఓవర్లో రాహుల్ (57) ఒక్క పరుగూ చేయలేదు. తర్వాతి ఓవర్లో రోహిత్ (140) రంగంలోకి దిగాడు. హసన్ అలీపై బౌండరీతో జట్టు స్కోరు ఖాతా తెరిచాడు. ఆమీర్‌ను వదిలేసి హసన్ అలీని టార్గెట్ చేసిన రోహిత్ అతడి వరుస ఓవర్లలో బౌండరీలు సాధించాడు. ఆరో ఓవర్లో పుల్ షాట్‌తో షార్ట్ బాల్‌ను డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ బాదాడు. అభిమానులు గంతులేసేందుకు ఆ సిక్సర్ సరిపోయింది. వహబ్ రియాజ్పైనా వరుస ఓవర్లలో ఫోర్లు కొట్టాడు. మరో ఎండ్‌లో రాహుల్‌పై ఒత్తిడి తొలగించాడు. వ్యక్తిగత స్కోరు 32 వద్ద పాక్ రోహిత్‌కు లైప్ ఇచ్చింది. రాహుల్, రోహిత్ పిచ్ మధ్యలో ఉండిపోగా.. రాహుల్ వైపు ఫకర్ త్రో విసిరాడు. రోహిత్ వైపు వేసి ఉంటే అతడు నిష్క్రమించేవాడు. అక్కడితో మరింత దూకుడు పెంచిన రోహిత్ 34 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. మరో 50 పరుగుల రేసులో రోహిత్ కాస్త నెమ్మదించాడు. ఈ దశలో మరో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టాడు. 85 బంతుల్లో శతకబాదిన రోహిత్‌కు ఈ ప్రపంచకప్‌లో ఈ సెంచరీ రెండోది. 113 బంతుల్లో 14 ఫోర్లు, మూడు సిక్సర్లతో విరుచుకుపడిన రోహిత్ శర్మ పాకిస్థాన్‌పై ప్రపంచకప్‌లో అత్యధిక స్కోరు సాధించిన భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఆరంభంలో నెమ్మదిగా మొదలై.. చివర్లో విరుచుకుపడే రోహిత్ శర్మ శైలికి ఇది భిన్నం. మాంచెస్టర్‌లో రోహిత్ దూకుడుగా మొదలెట్టి.. మిడిల్లో నెమ్మదించాడు. భారీ శతకంతో సూపర్ ఫామ్ కొనసాగించాడు.
రాహుల్, కోహ్లి జోరు : కెఎల్ రాహుల్ ఓపెనర్‌గా హిట్టయ్యాడు. సహజ శైలికి భిన్నంగా ఆడినా.. ఆకట్టుకున్నాడు. ఆరంభ ఓవర్లలో వికెట్ కోల్పోకుండా మిడిల్ ఆర్డర్‌పై ఒత్తిడి తొలగించాడు. మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 69 బంతుల్లో రాహుల్ అర్ధ సెంచరీ చేశాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి దాయాదిపై జోరు కొనసాగించాడు. చివరి మ్యాచ్‌లో ఆడిలైడ్‌లో శతకబాదిన కోహ్లి మాంచెస్టర్‌లో 77 పరుగులతో మెరిశాడు. మూడు ఫోర్లతో 51 బంతుల్లో అర్ద సెంచరీ సాధించిన కోహ్లి.. తర్వాత వేగం పెంచాడు. మరో నాలుగు ఫోర్లు బాది ఊపందుకున్నాడు. చివర్లో ఆమీర్ బౌలింగ్‌లో అవుట్ కాకపోయినా.. కోహ్లి పెవిలియన్ వైపు కదిలాడు. ఆమీర్ బౌన్సర్ కోహ్లి బ్యాట్‌కు తాకలేదని రీప్లేలో తేలింది. అంపైర్ నిర్ణయం కోసం ఎదురుచూడకుండానే విరాట్ వెనక్కి తిరిగాడు. లేదంటే, భారత్ మరింత భారీ స్కోరు సాధించేది.
భారత్ ఇన్నింగ్స్ : కెఎల్ రాహుల్ (సి) బాబర్ ఆజామ్ (బి) రియాజ్ 57, రోహిత్ శర్మ (సి) రియాజ్ (బి) హసన్ అలీ 140, విరాట్ కోహ్లి (సి) సర్ఫరాజ్ (బి) ఆమీర్ 77, హార్దిక్ పాండ్య (సి) బాబర్ ఆజామ్ (బి) ఆమీర్ 26, ఎం.ఎస్ ధోని (సి) సర్ఫరాజ్ (బి) ఆమీర్ 1, విజరు శంకర్ నాటౌట్ 15, కేదార్ జాదవ్ నాటౌట్ 9, ఎక్స్‌ట్రాలు : 11, మొత్తం : (50 ఓవర్లలో 5 వికెట్లకు) 336.
వికెట్ల పతనం : 1-136, 2-234, 3-285, 4-298, 5-314.
బౌలింగ్ : మొహమ్మద్ ఆమీర్ 10-1-47-3, హసన్ అలీ 9-0-84-1, వహబ్ రియాజ్ 10-0-71-1, ఇమద్ వసీం 10-0-49-0, షాదాబ్ ఖాన్ 9-0-61-0, షోయబ్ మాలిక్ 1-0-11-0, మహ్మద్ హఫీజ్ 1-0-11-0.
పాకిస్థాన్ ఇన్నింగ్స్ : ఇమామ్ ఉల్ హాక్ (ఎల్బీ) విజరు శంకర్ 7, ఫకర్ జమాన్ (సి) చాహల్ (బి) కుల్దీప్ యాదవ్ 62, బాబర్ ఆజామ్ (బి) కుల్దీప్ యాదవ్ 48, మహ్మద్ హఫీజ్ (సి) విజయ్ శంకర్ (బి) హార్దిక్ పాండ్య 9, సర్ఫరాజ్ అహ్మద్ (బి) విజరు శంకర్ 12, షోయబ్ మాలిక్ (బి) హార్దిక్ పాండ్య 0, ఇమద్ వసీం నాటౌట్ 46, షాదాబ్ ఖాన్ నాటౌట్ 20, ఎక్స్‌ట్రాలు : 08, మొత్తం : (40 ఓవర్లలో 6 వికెట్లకు) 122.
వికెట్ల పతనం : 1-13, 2-117, 3-126, 4-129, 5-129, 6-165.
బౌలింగ్ : భువనేశ్వర్ 2.4-0-8-0, జశ్‌ప్రీత్ బుమ్రా 8-0-52-0, విజరు శంకర్ 5.2-0-22-2, హార్దిక్ పాండ్య 8-0-44-2, కుల్దీప్ యాదవ్ 9-1-32-2, చాహల్ 7-0-53-0.