Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్ఫరాజ్‌పై అక్తర్‌పై తీవ్ర విమర్శ
కరాచీ : మాంచెస్టర్ ఓటమి మంటలు పాకిస్థాన్‌లో మరింత రేగుతున్నాయి. రావల్పిండి ఎక్స్‌ప్రెస్, మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌కు బుర్ర లేదని, సాధారణ పాక్ ఆటగాళ్ల నుంచి అసాధారణ ప్రదర్శన ఆశించటం మా కర్మ అని సోషల్ మీడియాలో నిప్పులు చెరిగాడు. '2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ చేసిన తప్పులను, మాంచెస్టర్‌లో పాకిస్థాన్ పునరావృతం చేసింది. సర్ఫరాజ్ ఎంత బుర్ర తక్కువ కెప్టెనో అర్ధం చేసుకోలేకపోతున్నా. పాకిస్థాన్ ఛేదనలో మెరవలేదని అతడు మరిచాడా?. పాకిస్థాన్ బలం బౌలింగ్. టాస్ నెగ్గి పాక్ సగం విజయం సాధించింది. కానీ ఓడేందుకు తీవ్రంగా కష్టపడిన సర్ఫరాజ్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత పాకిస్థాన్ 260 పరుగులు చేసినా, నాణ్యమైన బౌలింగ్‌తో నిలుపుకునేవాళ్లం. ఇది కేవలం బుర్ర లేని నాయకుడి ఓటమి. సర్ఫరాజ్‌లో ఇమ్రాన్‌ఖాన్‌ను చూడాలనుకున్నా, అందుకు సమయం మించిపోయింది' అని అక్తర్ విమర్శించాడు. పేసర్ హసన్ అలీ వాఘా సరిహద్దులో విన్యాసాలు చేయటం లేదు. మైదానంలో అవసరం వచ్చినప్పుడు ప్రదర్శన చేయాలి. టీ20, పీఎస్ఎల్ ఆడితే చాలనే భావన హసన్‌లో కనిపిస్తోంది. ఒక్క బంతినీ స్వింగ్ చేయలేదు. సాధారణ పాకిస్థాన్ ఆటగాళ్ల నుంచి అసాధారణ ప్రదర్శన ఎలా ఆశించగలమని అక్తర్ వ్యంగ్యబాణం సంధించాడు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇటువంటి ఆటగాళ్ల కోసం భవిష్యత్‌లో ట్వీట్లు పెట్టవద్దని అక్తర్ కోరాడు.