Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంగ్లాండ్, అఫ్గాన్ మ్యాచ్ నేడు
- మ. 3 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
మాంచెస్టర్ : టైటిల్ ఫేవరెట్‌గా ఘనంగా బోణీ కొట్టిన ఇంగ్లాండ్, ఆ తర్వాత పాకిస్థాన్ చేతిలో భంగపడింది. మూడు మ్యాచుల్లో విజయాలతో సెమీఫైనల్స్ దిశగా దూసుకెళ్తోన్న ఆతిథ్య జట్టుకు నేడు పసికూన అఫ్గనిస్థాన్ సవాల్ విసరనుంది. ప్రతిభావంతులతో కూడిన జట్టు, నాణ్యమైన స్పిన్,ఆల్‌రౌండర్లతో అగ్రజట్లనూ ఢకొీట్టే సత్తా ఉన్న జట్టు. అఫ్గనిస్థాన్‌పై ప్రపంచకప్ ఆరంభంలో సానుకూల వ్యాఖ్యలు వినిపించాయి. కానీ చివర్లో కెప్టెన్సీ మార్పు, స్టార్ ఓపెనర్ షెహజాద్‌ను తప్పించటం, స్టార్ బ్యాట్స్‌మన్ నజీబుల్లాను దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు దూరం పెట్టడం.. అఫ్గాన్ క్రికెట్‌పై వ్యతిరేక భావం తీసుకొచ్చాయి. క్రికెట్ దేశంగా ఎదుగుతున్న అఫ్గనిస్థాన్‌కు ఈ పరిణామాలు ఎంత మాత్రం మంచి చేయవు. వరుస ఓటములతో ఒత్తిడిలో ఉన్న అఫ్గనిస్థాన్ నేడు ఇంగ్లాండ్‌ను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.
ఎంత కొడతారు? : ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ జానీ బెయిర్‌స్టో, జో రూట్, జోశ్ బట్లర్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. జో రూట్ ప్రపంచకప్‌లో ఇప్పటికే రెండు సెంచరీలు సాధించాడు. బెయిర్‌స్టో ఆరంభంలో విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. జోశ్ బట్లర్ సమయం వచ్చినప్పుడు విరుచుకుపడుతున్నాడు. దీంతో ఇంగ్లాండ్ అజేయంగా కనిపిస్తోంది. ఆల్‌రౌండర్లు క్రిస్ వోక్స్, బెన్ స్టోక్స్, మోయిన్ అలీ బంతితో, బ్యాట్‌తో దూకుడుగా రాణిస్తున్నారు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. అఫ్గాన్‌పై మోర్గాన్ చెలరేగాలని చూస్తున్నాడు. జోఫ్రా ఆర్చర్, మార్క్‌వుడ్, ఫ్లంకెట్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. ఆదిల్ రషీద్‌తో కలిసి అలీ స్పిన్ మ్యాజిక్కు సిద్ధమవుతున్నాడు. నాణ్యమైన స్పిన్నర్లు కలిగిన అఫ్గాన్‌పై మెరిస్తే... భారత్‌తో స్పిన్నర్లపై మెరుగ్గా సన్నద్దం అయినట్టు ఉంటుందని ఇంగ్లాండ్ భావిస్తోంది.
అఫ్గాన్ పోటీనిచ్చేనా? : నాయకత్వ అనుభవ లేమి లోపమా? డ్రెస్సింగ్‌రూమ్ వాతావరణం చెడిండా? తెలియదు. కానీ అఫ్గాన్ తుది జట్టు రూపకల్పన చూస్తుంటే ఎదో జరుగుతుందనే భావన కలుగుతోంది. ఎదురుదాడి చేయగల ఓపెనర్ షెహజాద్‌ను దూరం పెట్టారు. సఫారీపై నజీబుల్లానూ నమ్మలేదు. ఆటగాళ్లపై విశ్వాసం ఉంచకుండా మ్యాచులు కాదు కదా, కనీసం మనసూలు నెగ్గలేం. అఫ్గాన్ కెప్టెన్ గులాబ్దిన్ ఇది తెలుసుకోవాలి. హజ్రతుల్లా జాజారు, రెహమాత్ షా, షాహిది, నూర్ అలీ బ్యాట్‌తో మెరవాలి. ఆల్‌రౌండర్ల నబీ, రషీద్ ఖాన్ ఫామ్‌లో ఉన్నారు. అంచనాల మేర రాణస్తే ఇంగ్లాండ్‌కు అఫ్గాన్ గట్టి పోటీనివ్వగలదు.
ఇంగ్లాండ్‌కు గాయాల బెడద : ఆతిథ్య ఇంగ్లాండ్‌ను గాయాలు వేధిస్తున్నాయి. సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్ జేసన్ రారు విండీస్‌తో మ్యాచ్‌లో గాయపడ్డాడు. తొడ కండరాల నొప్పితో రారు కనీసం రెండు మ్యాచులకు దూరమయ్యాడు. వెన్నునొప్పితో బాధపడుతున్న కెప్టెన్ ఇయాన్ మోర్గాన్.. ప్రస్తుతం ఫిట్నెస్ సాధిస్తున్నట్టు కనిపిస్తోంది. అతడు నేడు బరిలోకి దిగినా.. సమస్య తిరగబెడితే ముందు కీలక మ్యాచులకు దూరమయ్యే ప్రమాదం ఉంది. సీమర్ మార్క్‌వుడ్ గాయం నుంచి కోలుకుని ఆడుతున్న సంగతి తెలిసిందే.
పిచ్ రిపోర్టు : మాంచెస్టర్‌లో ఇది రెండో ప్రపంచ కప్ మ్యాచ్. భారత్, పాకిస్థాన్ మెగా మ్యాచ్ తర్వాత.. అఫ్గాన్, ఇంగ్లాండ్ తలపడుతున్నాయి. నేడూ వర్షం ప్రమాదం పొంచి ఉంది. ఉదయం ఎటువంటి సమస్య లేకపోయినా.. రెండో ఇన్నింగ్స్‌కు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశం కనిపిస్తోంది. డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రభావం చూపే అవకాశం ఉంది. టాస్ నెగ్గిన తొలుత ఫీల్డింగ్ ఎంచుకునేందుకు మొగ్గు చూపొచ్చు. కానీ భారత్, పాక్ మ్యాచ్ అనుభవంతో బౌన్సీ పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు తీసుకునే అవకాశం లేకపోలేదు.
తుది జట్లు (అంచనా) : ఇంగ్లాండ్ : జానీ బెయిర్‌స్టో, జేమ్స్ విన్సె, జో రూట్, ఇయాన్ మోర్గాన్, బెన్ స్టోక్స్, జోశ్ బట్లర్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, లియామ్ ఫ్లంకెట్, జోఫ్రా ఆర్చర్, మార్క్‌వుడ్.
అఫ్గనిస్థాన్ : హజ్రతుల్లా జాజారు, నూర్ అలీ జాద్రాన్, రెహమత్ షా, హస్మతుల్లా షాహిది, గులాబ్దిన్ నయిబ్, నజీబుల్లా జద్రాన్, మొహమ్మద్ నబి, ఇక్రమ్ అలికిలి, రషీద్ ఖాన్, ముజీబ్ రెహమాన్, హమిద్ హసన్.