Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 17 సిక్సర్లు బాదిన ఇంగ్లాండ్ కెప్టెన్
- 71 బంతుల్లో 148 పరుగుల ఇన్నింగ్స్
- అఫ్గాన్‌పై ఇంగ్లాండ్ భారీ విజయం
మాంచెస్టర్
ఇయాన్ మోర్గాన్ (148, 71 బంతుల్లో 4 ఫోర్లు, 17 సిక్స్‌లు) మాంచెస్టర్‌లో అఫ్గనిస్థాన్‌ను ముంచెత్తాడు. 17 సిక్సర్లతో ఉప్పెనలా విరుచుకుపడిన మోర్గాన్, కేవలం సిక్సర్ల ద్వారానే 102 పరుగులు కొట్టాడు. 57 బంతుల్లో శతకబాదిన మోర్గాన్ కెప్టెన్సీ మెరుపులతో ఇంగ్లాండ్‌కు భారీ విజయాన్ని అందించాడు. మోర్గాన్‌కు తోడు జానీ బెయిర్‌స్టో (90, 99 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), జో రూట్ (88, 82 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో రాణించారు. ఇంగ్లాండ్ 397/6 పరుగుల రికార్డు స్కోరు నమోదు చేసింది. అఫ్గాన్‌పై 17 సిక్సర్లు బాది క్రిస్ గేల్, రోహిత్ శర్మ, ఏబీ డివిలియర్స్ 16 సిక్సర్ల రికార్డును మోర్గాన్ అధిగమించాడు. ఓవరాల్‌గా ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో 25 సిక్సర్లు నమోదయ్యాయి, ఇంగ్లీష్ జట్టుకు ఇదే అత్యధికం. జోఫ్రా ఆర్చర్ (3/52), ఆదిల్ రషీద్ (3/66), మార్క్‌వుడ్ (2/40) మెరుపులతో రికార్డు ఛేదనలో అఫ్గనిస్థాన్ చిత్తుగా ఓడింది. నిర్ణీత ఓవర్లలో 247/8 పరుగులే చేసింది. ఇంగ్లాండ్ 150 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఇయాన్ మోర్గాన్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' గా నిలిచాడు. అఫ్గనిస్థాన్‌కు ఈ ప్రపంచకప్‌లో వరుసగా ఇది ఐదో ఓటమి. నాల్గో విజయం అందుకున్న ఇంగ్లాండ్ 8 పాయింట్లతో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది.
మోర్గాన్ ఉప్పెన : అఫ్గాన్‌పై తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ సాధారణంగా మొదలైంది. ఓపెనర్లు జేమ్స్ విన్సె (26), జానీ బెయిర్‌స్టో (90) తొలి వికెట్‌కు 44 పరుగులు జోడించారు. విన్సె నిష్క్రమణతో జో రూట్ (88) జతగా బెయిర్‌స్టో సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు. రూట్, జానీ రాణించటంతో ఇంగ్లాండ్ 29.4 ఓవర్లలో 164/1తో పటిష్టంగా కనిపించింది. అప్పటి వరకూ ఇంగ్లాండ్ రన్‌రేట్ 6 దాటలేదు. అఫ్గాన్ బౌలర్లు మెరుగ్గానే బంతులేస్తున్నారు అనుకునే లోపు.. మోర్గాన్ రూపంలో పెను ఉప్పెన అఫ్గాన్‌ను ముంచెత్తింది. మ్యాచ్‌కు ముందు వెన్నునొప్పితో బాధపడిన మోర్గాన్.. మైదానంలో సిక్సర్లతో బౌలర్లను ఊచకోత కోశాడు. చూస్తుండగానే సిక్సర్ల వర్షం కురిపించిన మోర్గాన్ రాకెట్ వేగంతో పరుగులు పిండుకున్నాడు. సీమర్ నయిబ్పై వస్తూనే రెండు సిక్సర్లు బాదిన మోర్గాన్ ధనాధన్ హెచ్చరికలు పంపాడు. వ్యక్తిగత స్కోరు 28 వద్ద మోర్గాన్ క్యాచ్ వదిలేసిన అఫ్గాన్ అందుకు మూల్యం చెల్లించుకుంది. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో బౌండరీ లైన్ వద్ద జాద్రాన్ క్యాచ్ వదిలేశాడు. అక్కడ మొదలైన ఊచకోత నిర్విరామంగా కొనసాగింది. ఆ తర్వాత ఎదుర్కొన్న 45 బంతుల్లో మోర్గాన్ 120 పరుగులు చేశాడు. రషీద్ ఖాన్‌పై 11 సిక్సర్లు బాదిన మోర్గాన్ కెరీర్లో అతడికి పీడకల మిగిల్చాడు. 9 ఓవర్లలో రషీద్ 110 పరుగులు సమర్పించుకుని, చెత్త బౌలింగ్ గణాంకాలు నమోదు చేసుకున్నాడు. మోర్గాన్ నిష్క్రమణ తర్వాత మోయిన్ అలీ (31 నాటౌట్, 9 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లు) మెరిశాడు. నాలుగు సిక్సర్లు కొట్టి ఇంగ్లాండ్‌ను 400కు చేరువ చేశాడు. దావ్లాత్ జాద్రాన్, గులాబ్దిన్ నయిబ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.
అఫ్గాన్ ప్రతిఘటన! : రికార్డు ఛేదనలో అఫ్గనిస్థాన్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. కానీ ఇంగ్లాండ్ సీమర్లను ఎదుర్కొని అఫ్గాన్ 50 ఓవర్లు ఆడుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ అఫ్గాన్ బ్యాట్స్‌మెన్ ఆశల్లేని మ్యాచ్‌లోనూ పోరాట పటిమ చూపారు. 50 ఓవర్లు క్రీజులో నిలిచారు. ఓపెనర్ నూర్ అలీ జాద్రాన్ (0) ఆర్చర్ బంతికి డకౌట్ అయ్యాడు. గులాబ్దిన్ నయిబ్ (37, 28 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), రెహమత్ షా (46, 74 బంతుల్లో 3 ఫోర్లు) వికెట్ పడకుండా చూశారు. నయిబ్ ధాటిగా ఆడగా, రెహమాత్ నెమ్మదిగా పరుగులు చేశాడు. ఆ తర్వాత వచ్చిన హస్మతుల్లా షాహిది (76, 100 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), అస్గర్ అఫ్గాన్ (44, 48 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ప్రతిఘటించారు. భారీ భాగస్వామ్యంతో ఇంగ్లీస్ బౌలర్లను విసిగించారు. జొఫ్రా ఆర్చర్ (3/52), ఆదిల్ రషీద్ (3/66), మార్క్‌వుడ్ (2/40) రాణించారు. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు అఫ్గనిస్థాన్ 247 పరుగులు చేసింది. ప్రపంచకప్‌లో అఫ్గనిస్థాన్‌కు ఇదే అత్యధిక స్కోరు.
సంక్షిప్త స్కోర్లు :
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ : 397/6 (ఇయాన్ మోర్గాన్ 148, జానీ బెయిర్‌స్టో 90, జో రూట్ 88, గులాబ్దిన్ నయిబ్ 3/68, దావ్లాత్ జాద్రాన్ 3/85)
అఫ్గనిస్థాన్ ఇన్నింగ్స్ : 247/8 ( హస్మతుల్లా షాహిది 76, రెహమత్ షా 46, అస్గర్ అఫ్గాన్ 44, జోఫ్రా ఆర్చర్ 3/52, ఆదిల్ రషీద్ 3/66)