Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాణించిన ఖవాజ, ఫించ్
- కంగారూలకు మరో విజయం
నాటింగ్‌హామ్: ప్రపంచకప్‌లో ఆసీస్ విధ్వంసకారుడు డెవిడ్ వార్నర్ (166, 139 బంతుల్లో 14 ఫోర్లు, 5 సిక్స్‌లు) సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. అఫ్గాన్‌పై 89, భారత్‌పై 56, పాకిస్థాన్‌పై 107 బాదిన వార్నర్.. బంగ్లాదేశ్‌పై విశ్వరూపం చూపించాడు. 139 బంతుల్లో 166 పరుగులు కొట్టి ప్రపంచకప్‌లో రెండో సెంచరీ సాధించాడు. వార్నర్ విధ్వంసానికి బౌలర్ల మెరుపులు తోడవగా బంగ్లాదేశ్‌పై 48 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. వార్నర్ శతకానికి తోడు ఉస్మాన్ ఖవాజ (89), అరోన్ ఫించ్ (53) అర్ధ సెంచరీలతో మెరిశారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 381/5 భారీ స్కోరు చేసింది. ఛేదనలో బంగ్లాదేశ్ లక్ష్యం లేని పోరాటం చేసింది!. ముష్ఫీకర్ రహీమ్ (102 నాటౌట్, 97 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్), షకిబ్ అల్ హసన్ (41), తమీమ్ ఇక్బాల్ (62), మహ్మదుల్లా (69) రాణించినా.. రికార్డు ఛేదనలో బంగ్లాదేశ్ గెలుపు దిశగా సాగలేదు. పరుగుల నియంత్రణ, కీలక వికెట్లతో ఆసీస్ బౌలర్లు ముందుగానే విజయాన్ని ఖాయం చేశారు. 333/8 పరుగులకే పరిమితమైన బంగ్లాదేశ్ పోరాడి ఓడింది. ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్‌కిదే అత్యధిక వన్డే స్కోరు. ఛేదనలో ముష్ఫీకర్ అజేయ సెంచరీ వృథా అయ్యింది.
వార్నర్ వీర విహారం :
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ అరోన్ ఫించ్ (53, 51 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించాడు. డెవిడ్ వార్నర్ (166) మరోసారి నెమ్మదిగా ఆడాడు. ఓపెనర్లు ఇద్దరూ బౌలర్లను మెరుగ్గా ఎదుర్కొన్నారు. తొలి వికెట్‌కు ఆసీస్ 121 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేసింది. సౌమ్య సర్కార్ బౌలింగ్‌లో ఫించ్ క్యాచౌట్ అయ్యాడు. ఉస్మాన్ ఖవాజ (89, 72 బంతుల్లో 10 ఫోర్లు) రాకతో ఇన్నింగ్స్ ఊపందుకుంది. వార్నర్ అండతో చెలరేగిన ఖవాజా వేగంగా పరుగులు చేశాడు. 55 బంతుల్లో అర్ద సెంచరీ సాధించిన వార్నర్.. మరో 55 బంతుల్లో సెంచరీ అందుకున్నాడు. శతకం తర్వాత చెలరేగిన వార్నర్ జూలు విదిల్చాడు. తర్వాతి 28 బంతుల్లో 66 పరుగులు పిండుకున్నాడు. 14 ఫోర్లు బాదిన వార్నర్, ఐదు సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. ఖవాజ అర్ద సెంచరీతో ధనాధన్ అనిపించాడు. వార్నర్, ఖవాజ జోడీ రెండో వికెట్‌కు 192 పరుగుల భారీ భాగస్వామ్యం నిర్మించింది. చివర్లో వార్నర్ అవుటైనా.. ఆసీస్ వేగం తగ్గలేదు. గ్లెన్ మాక్స్వెల్ (32, 10 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), అలెక్స్ క్యారె (11 నాటౌట్, 8 బంతుల్లో 1 ఫోర్), మార్కస్ స్టోయినిస్ (17 నాటౌట్, 11 బంతుల్లో 2 ఫోర్లు) రాణించారు. దీంతో ఆస్ట్రేలియా ఐదు వికెట్లకు 381 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో సౌమ్య సర్కార్ (3/58) మూడు వికెట్లు పడగొట్టాడు. ముస్తాఫిజుర్ రెహమాన్ (1/69) విఫలమయ్యాడు.
సంక్షిప్త స్కోర్లు :
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ : 381/5 (డెవిడ్ వార్నర్ 166, ఉస్మాన్ ఖవాజ 89, అరోన్ ఫించ్ 53, సౌమ్య సర్కార్ 3/58)
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ :333/8 (ముష్ఫీకర్ రహీమ్ 102, మహ్మదుల్లా 69, తమీమ్ ఇక్బాల్ 62, మిచెల్ స్టార్క్ 2/55)