Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అఫ్గాన్‌తో భారత్ మ్యాచ్ నేడు
- మ 3 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
ప్రపంచకప్‌లో అజేయ జట్టు. సెమీఫైనల్లో చోటు దక్కించుకోవటం లాంఛనమే. ప్రపంచకప్ తొలి నాలుగు మ్యాచుల్లో, చివరి నాలుగు మ్యాచుల్లో కఠిన ప్రత్యర్థులను ఎదుర్కొనున్న కోహ్లిసేన.. ఈ మధ్యలో పసికూనతో పోరాడనుంది. బోణీ విజయం కోసం నిరీక్షిస్తున్న అఫ్గనిస్థాన్ నేడు అగ్ర జట్టు భారత్‌ను ముందు నిలువగలదా? తేలికైన ప్రత్యర్థిపై ప్రయోగాలకు భారత్ సిద్ధమవుతుందా? యువ ఆటగాడు రిషబ్ పంత్ ప్రపంచకప్ అరంగ్రేటం చేయనున్నాడా? ఆసక్తికరం.
సౌతాంప్టన్: ప్రపంచకప్‌లో భారత్ మైలురాయి విజయంపై కన్నేసింది. ప్రపంచకప్‌లో ఇప్పటివరకూ 49 విజయాలు సాధించిన టీమ్ ఇండియా.. సౌతాంప్టన్‌లో 50వ విజయంపై గురి పెట్టింది. రెండోసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న అఫ్గనిస్థాన్ నేడు కఠిన సవాల్ ఎదుర్కొనుంది. వరుస ఓటములతో ఇబ్బంది పడుతున్న అఫ్గాన్‌కు కోహ్లిసేన మరో ఓటమి మిగిల్చేందుకు రంగం సిద్ధం చేసుకుంది. మూడు విజయాలతో ఊపుమీదున్న టీమ్ ఇండియా నేడు భారీ విజయంతో నెట్ రన్‌రేట్ పెంచుకోవాలని చూస్తుంది.
రిషబ్ పంత్ వస్తాడా? : శిఖర్ ధావన్ స్థానంలో ప్రపంచకప్ జట్టుకు ఎంపికైన రిషబ్ పంత్ అఫ్గాన్‌పై అరంగ్రేట మ్యాచ్ ఆడే అవకాశం కనిపిస్తోంది. ధావన్ స్థానంలో ఓపెనర్‌గా కెఎల్ రాహుల్, నం.4లో విజరు శంకర్ ఆడుతున్నారు. సీనియర్ ఆటగాడు ధోని జట్టులో ఉండగా రిషబ్ పంత్ తుది జట్టులోకి వచ్చే అవకాశం లేదు. కానీ అఫ్గనిస్థాన్‌తో మ్యాచ్ కావటం, ముందు ఇంగ్లాండ్, వెస్టిండీస్‌లతో ఆడాల్సి ఉండటంతో ధోనికి విశ్రాంతి ఇచ్చేందుకు ఆస్కారం ఉంది. అదే జరిగితే రిషబ్ పంత్ ప్రపంచకప్ అరంగ్రేట మ్యాచ్ ఆడటం ఖాయం. గాయపడిన సీమర్ భువనేశ్వర్ కుమార్ స్థానంలో మహ్మద్ షమి తుది జట్టులోకి రానున్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ భీకర ఫామ్‌లో ఉన్నారు. విజరు శంకర్ ఆల్‌రౌండర్‌గా మెప్పించాడు. హార్దిక్ పాండ్య విధ్వంసక మూడ్ నుంచి బయటకు రావటం లేదు. స్పిన్ ద్వయం చాహల్, కుల్దీప్ గొప్పగా రాణిస్తోంది. ఫీల్డింగ్‌లోనూ కోహ్లిసేన నూతన ప్రమాణాలతో ముందుకు సాగుతోంది. అన్ని విభాగాల్లోనూ బలంగా ఉన్న భారత్ నేడు భారీ విజయం అందుకోవటం లాంఛనమే.
అఫ్గాన్ ఏం చేసేనో : వరుస ఓటములతో అఫ్గనిస్థాన్ క్రికెట్లో లుకలుకలు మొదలయ్యాయి. కెప్టెన్ గులాబ్దిన్ నయిబ్, కోచ్ మధ్య సఖ్యత కనిపించటం లేదు. తుది జట్టు ఎంపికలోనూ మేనేజ్మెంట్ ఏకాభిప్రాయంతో లేదని సమాచారం. ఆల్‌రౌండర్ మహ్మద్ నబి, రషీద్ ఖాన్ సహా స్పిన్నర్ ముజీబ్ రెహమాన్ భారత బ్యాటింగ్ లైనప్‌కు పరీక్ష పెట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రపంచకప్‌లో పేలవంగా రాణిస్తున్న రషీద్ ఖాన్ పుంజుకోవాలని ఉబలాటపడుతున్నాడు. భారత బ్యాట్స్‌మెన్‌పై స్పిన్ మ్యాజిక్ చేసేందుకు అఫ్గాన్ వ్యూహం. నూర్ అలీ, గులాబ్దిన్, రెహమత్ షా, హస్మతుల్లా, అస్గర్‌లు బ్యాట్‌తో మెరిస్తే అఫ్గాన్ పోరాడగలిగే స్కోరు చేసే వీలుంది.
పిచ్ రిపోర్టు : సౌతాంప్టన్‌లో సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 286. దక్షిణాఫ్రికాపై కోహ్లిసేన ఇక్కడ గెలిచింది. సౌతాంప్టన్ పరుగుల పిచ్. వాతావరణం ఆహ్లాదకరంగా ఉండనుంది. స్పిన్ ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉన్నా, నేడు పరుగుల వరద పారనుంది. టాస్ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకునేందుకు మొగ్గు చూపవచ్చు.
తుది జట్లు (అంచనా) :
భారత్ : కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, విజరు శంకర్, ఎం.ఎస్ ధోని, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, యుజ్వెంద్ర చాహల్, మహ్మద్ షమి, జశ్‌ప్రీత్ బుమ్రా.
అఫ్గనిస్థాన్ : నూర్ అలీ జద్రాన్, గులాబ్దిన్ నయిబ్, రెహమత్ షా, హస్మతుల్లా షాహిది, అస్గర్ అఫ్గాన్, మహ్మద్ నబి, రషీద్ ఖాన్, ఇక్రమ్ అలీ ఖాన్, అఫ్తాబ్ ఆలమ్, దావ్లాత్ జద్రాన్, ముజీబ్ రెహమాన్.