Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాణించిన రాస్ టేలర్
- న్యూజిలాండ్ 291/8
-విండీస్‌తో గ్రూప్ మ్యాచ్
మాంచెస్టర్: ప్రపంచకప్‌లో కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సూపర్ ఫామ్ కొనసాగుతోంది. దక్షిణాఫ్రికాపై మాగ్నిఫియెంట్ సెంచరీతో విలువైన విజయాన్ని అందించిన న్యూజిలాండ్ సారథి.. కరీబియన్లపైనా కదం తొక్కాడు. ఓపెనర్లు ఇద్దరూ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరగా.. రాస్ టేలర్ (69, 95 బంతుల్లో 7 ఫోర్లు)తో కలిసి భారీ భాగస్వామ్యం నమోదు చేశాడు. 148 పరుగుల కండ్లుచెదిరే ఇన్నింగ్స్‌తో విలియమ్సన్ చెలరేగిన వేళ న్యూజిలాండ్ 291/8 పరుగులు చేసింది. వెస్టిండీస్ యువ సీమర్ షెల్డన్ కాట్రెల్ (4/56) నాలుగు వికెట్లతో మెరిశాడు. నాణ్యమైన బౌలింగ్‌తో విండీస్ ఆరంభంలో కివీస్‌పై ఒత్తిడి పెంచినా.. విలియమ్సన్, రాస్ టేలర్ మెరుపులు కివీస్‌ను ముందంజలో నిలిపాయి.
షెల్డన్ సెల్యూట్ : తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌కు తొలి ఆరు బంతుల్లోనే కోలుకోలేని ఎదురు దెబ్బ. ఓపెనర్లు మార్టిన్ గప్టిల్ (0), కొలిన్ మన్రో (0)లను ఎదుర్కొన్న తొలి బంతులకే సెల్యూట్ స్టార్ షెల్డన్ కాట్రెల్ పెవిలియన్‌కు పంపాడు. తొలి ఓవర్లోనే ఓపెనర్లను కోల్పోయిన న్యూజిలాండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది.
రాణించిన విలియమ్సన్, టేలర్ : ఈ దశలో కెప్టెన్ కేన్ విలియమ్సన్ (148, 154 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్), రాస్ టేలర్ (69, 95 బంతుల్లో 7 ఫోర్లు) కీలక భాగస్వామ్యం నమోదు చేశారు. విండీస్ బౌలర్లను ఎదుర్కొని మూడో వికెట్‌కు 160 పరుగులు జోడించారు. నాలుగు ఫోర్లతో విలియమ్సన్ 75 బంతుల్లో అర్ద సెంచరీ సాధించగా.. రాస్ టేలర్ ఏడు ఫోర్లతో 68 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. ప్రమాదకరంగా తయారైన టేలర్‌ను గేల్ వెనక్కి పంపినా.. అప్పటికే న్యూజిలాండ్ ఇన్నింగ్స్ కుదురుకుంది. 124 బంతుల్లో సెంచరీ సాధించిన విలియమ్సన్ తర్వాత రెచ్చిపోయాడు. శతకం తర్వాత ఎదుర్కొన్న 29 బంతుల్లో ఆరు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 48 పరుగులు పిండుకున్నాడు. లోయర్ ఆర్డర్లో జేమ్స్ నీషమ్ (28 23 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్), గ్రాండ్‌హౌమె (16, 6 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. మిచెల్ శాంట్నర్ (10, 5 బంతుల్లో 1 సిక్స్) ఆకట్టుకున్నాడు. టామ్ లాథమ్ (12) నిరాశపరిచాడు. విండీస్ బౌలర్లలో షెల్డన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. కార్లోస్ బ్రాత్‌వేట్ (2/58), క్రిస్ గేల్ (1/8) రాణించారు. ఆడిన ఐదు మ్యాచుల్లో ఒక విజయం సాధించిన వెస్టిండీస్ 292 టార్గెట్‌ను ఛేదిస్తేనే సెమీస్ రేసులో ఆశలు నిలుపుకుంటుంది!.