Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు పాకిస్థాన్‌తో కివీస్ ఢీ
- ఇరు జట్లకూ విజయం కీలకం
బర్మింగ్‌హామ్:ప్రపంచకప్ సెమీఫైనల్స్ రేసు రసవత్తరంగా సాగుతోంది. న్యూజిలాండ్, పాకిస్థాన్‌లు నేడు గ్రూప్ దశలో వరుసగా ఏడో మ్యాచ్ ఆడేందుకు సిద్దమవుతున్నాయి. ఆరు మ్యాచుల్లో అజేయ రికార్డు కొనసాగుతున్న న్యూజిలాండ్ 11 పాయింట్లతో కొనసాగుతోంది. ఆరు మ్యాచుల్లో ఐదు పాయింట్లతో పాకిస్థాన్ నిలిచింది. అటు టాప్-4లో న్యూజిలాండ్‌త స్థానం ఖాయం కాలేదు. ఇటు టాప్-4 రేసు నుంచి పాకిస్థాన్ ఆశలకు తెరపడలేదు. ఈ దశలో ఈ రెండు జట్ల ముఖాముఖి ఆసక్తి రేపుతోంది. ఈ మ్యాచ్‌లో విజయం న్యూజిలాండ్‌కు సెమీఫైనల్స్ బెర్త్ ఖాయం చేయనుండగా.. ఈ మ్యాచ్‌లో ఓటమి సెమీఫైనల్స్ రేసు నుంచి పాకిస్థాన్ నిష్క్రమణకు మార్గం చూపుతుంది. పాకిస్థాన్‌తో ఆడిన గత 13 వన్డేల్లో న్యూజిలాండ్ 12 సార్లు గెలుపొందింది. బర్మింగ్‌హామ్‌లో ఏం జరుగుతుందో చూడాలి.
గప్టిల్ గర్జన ఎప్పుడు? : 2015 ప్రపంచకప్ అత్యధిక పరుగుల వీరుడు, డబుల్ సెంచరీ హీరో మార్టిన్ గప్టిల్. కానీ ఈసారి గప్టిల్ అంచనాలను అందుకోలేకపోతున్నాడు. వరుసగా విఫలమవుతున్నాడు. తొలి మ్యాచ్‌లో అజేయ 137 పరుగుల భాగస్వామ్యం మినహా గప్టిల్, కొలిన్ మన్రో మెరిసింది లేదు. మిడిల్ ఆర్డర్లో కేన్ విలియమ్సన్, రాస్ టేలర్ 573 పరుగులు చేయగా.. గప్టిల్, మన్రో కేవలం 246 పరుగులు చేశారు. ప్రపంచకప్ చివరి దశకు చేరుకుంటున్న దశలో ఓపెనర్ల ప్రదర్శన న్యూజిలాండ్‌కు అత్యవసరం. వికెట్ కీపర్ టామ్ లాథమ్ సైతం అంచనాలను అందుకోవాల్సి ఉంది. గత ఆరు మ్యాచుల్లో న్యూజిలాంగ్ తుది జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు. పేసర్ మాట్ హెన్రీ కొంత ఇబ్బందితో కనిపిస్తున్నాడు. బహుశా అతడి స్థానంలో టిమ్ సౌథీ జట్టులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
పాక్‌కు చావోరేవో : దక్షిణాఫ్రికాపై కీలక విజయం సాధించిన పాకిస్థాన్, ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. కానీ ప్రపంచకప్‌లో అజేయ జట్టు న్యూజిలాండ్‌ను ఎదుర్కొవటం పాక్‌కు అంత సులువు కాదు. కఠిన పరిస్థితుల్లోనూ కివీస్ గొప్పగా పుంజుకుని విజయాలు సాధించింది. ఈ లక్షణం పాకిస్థాన్ శిబిరంలో అరుదుగానే చూడగలం. బ్యాటింగ్ లైనప్‌లో ఇమామ్ ఉల్ హాక్, ఫకర్ జమాన్, బాబర్ ఆజామ్‌లు ఫామ్‌లో ఉన్నారు. నాల్గో స్థానంలో మహ్మద్ హఫీజ్ ఫామ్‌లోకి రావాల్సి ఉంది. సీనియర్ ఆటగాడు షోయబ్ మాలిక్ స్థానంలో జట్టులోకి వచ్చిన హరీశ్ సోహైల్ హిట్ కొట్టాడు. బంతితో హఫీజ్ అవసరం పాక్‌కు లేదు. బ్యాట్‌తో అతడు రాణించకుంటే, పించ్ హిట్టర్ అసిఫ్ అలీకి తుది జట్టులో చోటు ఖాయం. ఆమీర్, రియాజ్, అఫ్రిదీలతో కూడిన పేస్ విభాగం బాగుంది. స్పిన్నర్ షాదాబ్ ఖాన్ పాకిస్థాన్‌కు కీలకం కానున్నాడు.
పిచ్ రిపోర్టు : మంగళవారం బర్మింగ్‌హామ్‌లో మంచి వర్షం కురిసింది. దీంతో పిచ్‌పై కవర్లను కప్పి ఉంచారు. నేడు వర్ష సూచనలు లేవు. కానీ వాతావరణం మేఘావృతంగా ఉండనుంది. పేసర్లకు అనుకూలమని చెప్పవచ్చు. టాస్ నెగ్గిన జట్టు ఛేదన వైపు మొగ్గు చూపవచ్చు.
తుది జట్లు (అంచనా) :
న్యూజిలాండ్ : కొలిన్ మన్రో, మార్టిన్ గప్టిల్, కేన్ విలియమ్సన్, రాస్ టేలర్, టామ్ లాథమ్, కొలిన్ డీ గ్రాండ్‌హౌమె, జిమ్మీ నీషమ్, మిచెల్ శాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గుసన్, ట్రెంట్ బౌల్ట్.
పాకిస్థాన్ : ఇమామ్ ఉల్ హాక్, ఫకర్ జమాన్, బాబర్ ఆజామ్, మహ్మద్ హఫీజ్, హరీశ్ సోహైల్, సర్ఫరాజ్ అహ్మద్, ఇమద్ వసీం, షాదాబ్ ఖాన్, మహ్మద్ ఆమీర్, వహబ్ రియాజ్, షాహీన్ అఫ్రిది.