Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాణించిన హరీశ్ సోహైల్
- సెమీస్ రేసులోనే పాక్
- న్యూజిలాండ్‌కు తొలి ఓటమి
బర్మింగ్‌హామ్ : పాకిస్థాన్ సెమీఫైనల్స్ రేసు కొనసాగుతోంది. కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఆరు వికెట్ల తేడాతో అలవోక విజయం సాధించింది. స్టార్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజామ్ (101 నాటౌట్, 127 బంతుల్లో 11 ఫోర్లు) అజేయ సెంచరీకి తోడు హరీశ్ సోహైల్ (68, 76 బంతుల్లో 5 ఫోర్లు,2 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో చెలరేగాడు. బాబర్, సోహైల్ నాల్గో వికెట్‌కు 126 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ ఇద్డరి జోరుతో పాకిస్థాన్ 238 పరుగుల ఛేదనను 49.1 ఓవర్లలో ఆడుతూ పాడుతూ ఛేదించింది. భలే బాబర్ : ఛేదనలో పాక్ ఓపెనర్లను త్వరగా కోల్పోయింది. ఇమామ్ ఉల్ హాక్ (19), ఫకర్ జమాన్ (9) నిరాశపరిచారు. 44/2తో పాక్ ఒత్తిడిలో పడింది. స్పిన్ అనుకూలిత పిచ్‌పై మిచెల్ శాంట్నర్ ప్రతి బంతికీ ప్రమాదకరంగా కనిపించాడు. బాబర్ (101 ) అజేయ శతక ఇన్నింగ్స్ పాకిస్థాన్‌కు అదిరే విజయాన్ని అందించింది. మహ్మద్ హఫీజ్ (32) అనవసర షాట్‌తో వికెట్ కోల్పోయినా ఫామ్‌లో ఉన్న హరీశ్ సోహైల్ (68) అండతో బాబర్ పని పూర్తి చేశాడు. వరుసగా రెండో అర్ధ సెంచరీ సాధించిన సోహైల్ కివీస్ బౌలర్లపై ఎదురుదాడి చేసి, బాబర్‌పై ఒత్తిడి తగ్గించాడు. బౌలర్లపై పూర్తి నియంత్రణ కనబర్చిన బాబర్ ఆజామ్ 11 ఫోర్లతో 124 బంతుల్లో ప్రపంచకప్‌లో తొలి సెంచరీ సాధించాడు. చివర్లో సోహైల్ రనౌటైనా.. సర్ఫరాజ్ అహ్మద్ (5 నాటౌట్)తో కలిసి బాబర్ లాంఛనం ముగించాడు.
ఆదుకున్న నీషమ్, గ్రాండ్‌హౌమె : వర్షం అంతరాయంతో ఆలస్యంగా ఆరంభమైన మ్యాచ్‌లో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. పాక్ యువ బౌలర్లు షాహిన్ ఆఫ్రిది (3/28), షాదాబ్ ఖాన్ (1/43) విజృంభణతో న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. సీనియర్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ (5)ను క్లీన్ బౌల్డ్ చేసి మహ్మద్ ఆమీర్ కివీస్‌ను దెబ్బకొట్టాడు. కొలిన్ మన్రో (12), రాస్ టేలర్ (3), టామ్ లాథమ్ (1)లను పెవిలియన్‌కు చేర్చిన షాహిన్ ఆఫ్రిది కివీస్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. 46/4తో కష్టాల్లో పడిన కివీస్‌ను కెప్టెన్ కేన్ విలియమ్సన్ (41, 69 బంతుల్లో 4 ఫోర్లు) ఆదుకునే ప్రయత్నం చేశాడు. దీంతో 83/5తో కివీస్ స్వల్ప స్కోరుకే కుప్పకూలే ప్రమాదంలో పడింది. ఈ దశలో జోడీ కట్టిన జిమ్మీ నీషమ్ (97 నాటౌట్, 112 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), కొలిన్ డీ గ్రాండ్‌హౌమె (64, 71 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో మెరిశారు. పాక్ బౌలర్ల దూకుడును అడ్డుకుని ఆరో వికెట్‌కు 154 పరుగులు జోడించారు. తొలి 26 ఓవర్లలో ఐదు వికెట్లు కూల్చిన పాక్.. చివరి 24 ఓవర్లలో ఒక వికెట్‌తోనే సరిపెట్టుకుంది. స్వల్ప స్కోరుకు ఆలౌటయ్యేలా కనిపించిన న్యూజిలాండ్.. నీషమ్, గ్రాండ్‌హౌమె మెరుపులతో 237 పరుగులు చేసింది.