Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీలంకపై సఫారీ విజయం
- లంకేయుల సెమీస్ ఆశలు ఆవిరి
చెస్టర్ లీ స్ట్రీట్ (డర్హమ్) : ప్రపంచకప్ సెమీస్ రేసు నుంచి ఎప్పుడో నిష్క్రమించిన దక్షిణాఫ్రికా.. వెళ్తూ వెళ్తూ శ్రీలంకనూ వెంట తీసుకెళ్లింది!. వరుస విజయాలు సాధిస్తే సెమీస్ చేరుకోగల శ్రీలంకను ఓడించిన సఫారీ లంకేయులను ముంచేసింది. ఏడు మ్యాచుల్లో మూడో ఓటమితో శ్రీలంక సెమీఫైనల్స్ రేసు నుంచి నిష్క్రమించింది. చివరి రెండు మ్యాచుల్లో నెగ్గినా శ్రీలంక పది పాయింట్లే సాధించగల్గుతుంది. సెమీఫైనల్స్ చేరుకునేందుకు పది పాయింట్లు సరిపోవు. 204 పరుగుల ఛేదనలో డుప్లెసిస్ (96 నాటౌట్, 103 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్), హషీమ్ ఆమ్లా (80 నాటౌట్, 105 బంతుల్లో 5 ఫోర్లు) అజేయ అర్ధ సెంచరీలతో చెలరేగగా దక్షిణాఫ్రికా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రిటోరిస్ (3/25), మోరీస్ (3/46) చెలరేగటంతో తొలుత శ్రీలంక 203 పరుగులకే కుప్పకూలింది.
ఆమ్లా, డుప్లెసిస్ కొట్టేశారు : స్వల్ప ఛేదనలో సఫారీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ డికాక్ (15) మలింగ బంతికి వికెట్ కోల్పోయాడు. ప్రపంచకప్‌లో పేలవంగా ఆడుతున్న హషీమ్ ఆమ్లా లంకపై చెలరేగాడు. కెప్టెన్ డుప్లెసిస్‌తో కలిసి రెండో వికెట్‌కు అజేయ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆడుతూ పాడుతూ పరుగులు చేసిన ఆమ్లా, డుప్లెసిస్ జోడీ సఫారీకి అలవోక విజయాన్ని అందించింది. 4 ఫోర్లతో 56 బంతుల్లో ఆమ్లా ఆర్ధ సెంచరీ సాధించగా, ఐదు ఫోర్ల సాయంతో 70 బంతుల్లో డుప్లెసిస్ ఫిఫ్టీ సాధించాడు. సఫారీ ఛేదనను 37.2 ఓవర్లలోనే ముగించింది.
ప్రిటోరిస్, మోరీస్ విజృంభణ : తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఓపెనర్ కరుణరత్నె (0) ఇన్నింగ్స్ తొలి బంతికే కోల్పోయింది. కుశల్ పెరీరా (30), ఫెర్నాండో (30) రెండో వికెట్‌కు 67 పరుగులు జోడించి ఆదుకున్నారు. ప్రిటోరిస్ ఈ ఇద్దరినీ వెనక్కి పంపటంతో లంక పతనం మొదలైంది. ప్రిటోరిస్కు మోరీస్ తోడవగా లంక వేగంగా వికెట్లు కోల్పోయింది. మాథ్యూస్ (11) విఫలమయ్యాడు. 111/5తో ఉన్న శ్రీలంక.. లోయర్ ఆర్డర్లో ధనంజయ డిసిల్వ (24), జీవన్ మెండిస్ (18), తిశార పెరీరా (21), ఇసురు ఉదాన (17) పరుగులతో 203 పరుగులు చేయగల్గింది. ప్రిటోరిస్ (3/25), మోరీస్ (3/46), రబాడ (2/36) రాణించారు.