Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన
2018, జూన్ మాసం. బీసీసీఐ వార్షిక కాంట్రాక్టు జాబితా నుంచి మహ్మద్ షమి పేరు తొలగించారు. భార్య హసిన్ జహన్ గృహ హింస వేధింపుల కేసుతో కుటుంబం కష్టాల్లో పడింది. వ్యక్తిగతంగా కోర్టు కేసులతో సతమతం, చీలమండ గాయంతో ఇదే సమయంలో ఏడాది పాటు క్రికెట్ దూరం. ఓ దశలో షమి పని అయిపోయినట్టే అనిపించింది. కానీ పేస్ గుర్రం దూసుకొచ్చింది. 2015 ప్రపంచకప్ సూపర్ ఫామ్‌ను 2019లోనూ పునరావృతం చేస్తున్నాడు షమి. ప్రపంచకప్‌లో ఓ వారం మహ్మద్ షమిని సూపర్ హీరోని చేసింది.
నవతెలంగాణ క్రీడా విభాగం
క్రికెట్లో పేసర్లకు గాయాల బెడద ఎక్కువ. తిరుగులేని ఫిట్నెస్ ప్రమాణాలను అందుకుంటేనే దీర్ఘకాలం క్రికెట్లో కొనసాగగలరు. దిగ్గజ సీమర్లు సైతం ఫిట్నెస్ సమస్యలతో అర్థాంతరంగా కెరీర్‌కు ముగింపు పలకాల్సిన వచ్చిన సందర్భాలు చాలానే చూశాం. భారత సీమర్ మహ్మద్ షమి కెరీర్‌కు అటువంటి ముగింపే ఉంటుందేమో అనిపించింది. కానీ కష్టాలను షమి ఎదురీదాడు. సమస్యలను అధిగమించాడు. కఠోర శ్రమతో ఫిట్‌నెస్‌పై దృష్టి సారించిన షమి.. కెరీర్లో భీకర ఫామ్ అందుకున్నాడు. మైదానంలో మళ్లీ కష్టమేమో అనిపించినా.. అదరగొట్టే ప్రదర్శనతో దూసుకొచ్చాడు. 2019 ప్రపంచకప్ జట్టులో చోటు లభించినా.. స్వింగ్స్టార్ భువనేశ్వర్ కుమార్ గాయపడే వరకూ అతడికి అవకాశం దక్కలేదు. అవకాశం లభించిన వారంలోనే షమి సూపర్ ప్రదర్శన చేశాడు. తుది జట్టులో షమి లేకపోతే ఎలా? అనే స్థితికి జట్టు మేనేజ్మెంట్ను తీసుకొచ్చాడు. ఇదేమీ అతిశయోక్తి కాదు. ప్రపంచకప్‌లో వికెట్ల వేటలో షమి ఉత్సాహం.. రాయిని విగ్రహంగా మార్చే శిల్పి ఉత్సుకతకు ఏమాత్రం తక్కువ కాదు!.
వరల్డ్ కప్ హీరో : ఐసీసీ టోర్నీలు అనగానే ముందుగా శిఖర్ ధావన్ గుర్తొస్తాడు. మెగా ఈవెంట్లలో గబ్బర్ దూకుడు, గణాంకాల్లో వేడి అలాంటిది మరి. బంతితోనూ మనకు ఓ వరల్డ్ కప్ హీరో ఉన్నాడు. అతడే మహ్మద్ షమి. 2015 ప్రపంచకప్‌లో భారత ప్రధాన పేసర్‌గా మహ్మద్ షమి సమర్థ సారథ్యంతో ఔరా అనిపించాడు. పాకిస్థాన్‌పై 4/35, దక్షిణాఫ్రికాపై 2/30, వెస్టిండీస్‌పై 3/35, ఐర్లాండ్‌పై 3/41, జింబాబ్వేపై 3/48, క్వార్టర్స్‌లో బంగ్లాదేశ్‌పై 2/37 ప్రదర్శనతో భారత వికెట్ల వేటను ముందుండి నడిపించాడు. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై షమి పది ఓవర్లలో 68 పరుగులిచ్చాడు. వికెట్లేమీ తీయలేదు. ఆ మ్యాచ్‌లో ధోనీసేన ఓటమిపాలైంది. తాజాగా ఇంగ్లాండ్‌లోనూ షమి గణాంకాలు అద్భుతం. ప్రపంచకప్‌లో 16.2 ఓవర్లలోనే 8 వికెట్టు పడగొట్టాడు. ఎకానమి రేట్ 3.46, ప్రపంచకప్‌లో ఇదే అత్యుత్తమం. సగటున 12.1 బంతులకు షమి ఓ వికెట్ పడగొట్టాడు. ప్రధాన బౌలర్లలో ఇదీ అత్యుత్తమ గణాంకాలే. సౌతాంప్టన్‌లో అఫ్గనిస్థాన్‌పై 4/40తో మెరిసిన షమి.. మాంచెస్టర్‌లో వెస్టిండీస్‌పై 4/16తో కండ్లుచెదిరే ప్రదర్శన చేశాడు.
ఫిట్నెస్ మంత్ర : ' మహ్మద్ షమిని పూర్తి ఫిట్ క్రికెటర్‌గా తయారు చేయటమే నా కెరీర్లో శిఖర స్థాయి సంతృప్తినిచ్చిన విషయం' ఇదీ భారత ఫిట్నెస్ ట్రైనర్, ఫీల్డింగ్ కోచ్ మాట. ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టని షమి చీటికి మాటికి గాయాల పాలైన చరిత్ర ఉంది. 2018లోనూ ఇదే జరిగింది. గాయంతో ఆటకు దూరమయ్యాడు. ఎనిమిది కిలోల బరువు పెరిగాడు. బంతితో బౌలింగ్ లయ కోల్పోయాడు. కీలక యో యో టెస్టులో విఫలమయ్యాడు. సెలక్టర్లు సైతం మహ్మద్ షమిని మరిచిపోవటం మొదలుపెట్టారు. ఈ ఏడాది మార్చిలో ఫిట్నెస్ ప్రాముఖ్యత గుర్తించిన షమి, కఠోరంగా శ్రమించాడు. ' ఫిట్నెస్ ప్రయాణంలో గమ్యం చేరడానికి రెండేండ్లు పట్టింది. లాంగ్ స్పెల్స్ తర్వాత మోకాళ్లలో ఇబ్బంది ఫీలయ్యే వాడిని. క్రికెట్లో ఎక్కువ కాలం ఉండాలంటే, మరేదో చేయాలని అనిపించింది. భోజనంలో మార్పులు చేసుకున్నాను. కచ్చితమైన డైట్ తయారు చేసుకున్నా. డాక్టర్లు సూచించిన జంక్ ఫుడ్‌ను పూర్తిగా దూరం పెట్టా. స్వీట్లు, బ్రెడ్ పూర్తిగా వదిలేశాను. ఇదెంతో గొప్పగా పని చేసింది' అని మహ్మద్ షమి ఫిట్నెస్ ప్రస్థానంపై చెప్పుకున్నాడు. భువనేశ్వర్ కుమార్‌కు గాయంతో తుది జట్టులోకి వచ్చిన మహ్మద్ షమి.. వరుసగా నాలుగు వికెట్ల ప్రదర్శనతో తన విలువ చాటిచెప్పాడు. కెరీర్ సూపర్ ఫామ్‌లో ఉన్న మహ్మద్ షమిని ఇంగ్లాండ్ మ్యాచ్‌కు బెంచ్‌కు పరిమితం చేయడానికి కోహ్లి, శాస్త్రి ద్వయం ఇష్టపడకపోవచ్చు.
కసిగా కదనోత్సాహం : వికెట్ల వేటలో మహ్మద్ షమి కదనోత్సాహం అతడిలో మునుపెన్నడూ చూడనది. ' పరిమిత ఓవర్ల ఫార్మాట్లో షమి పునరాగమన ఉత్సాహం అతడిలో ఎన్నడూ చూడలేదు. 5-6 కేజీల బరువు తగ్గాడు. రన్నింగ్, బౌలింగ్ అద్భుతంగా ఉంది. షమి వికెట్ల దాహంతో కనిపిస్తున్నాడు' అని కెప్టెన్ విరాట్ కోహ్లి అన్నాడు.
అఫ్గనిస్థాన్‌పై ఆఖరి ఓవర్లో హ్యాట్రిక్ వికెట్లతో అందరి దృష్టిని ఆకర్షించిన షమి.. కరీబియన్లపై కండ్లుచెదిరే స్పెల్‌తో సూపర్ హీరో అయిపోయాడు. క్రిస్ గేల్‌తో కలిసి ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ డ్రెస్సింగ్‌రూమ్ పంచుకున్న షమికి అతడిని సాగనంపడమెలాగో తెలుసు. గేల్ స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించడానికి వీల్లేకుండా షమి బంతులు సంధించాడు. పరుగుల నియంత్రణ పాటిస్తే, గేల్ సహనం కోల్పోయి హిట్టింగ్‌కు వెళ్తాడని షమికి తెలుసు. ముందు కట్టడి చేసి తర్వాత షార్ట్ బాల్‌తో ఊరించాడు. అంతే క్రిస్ గేల్ వికెట్లో విండీస్ అత్యంత అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మెన్, ప్రమాదకర వేటగాడి సేవలను కోల్పోయింది. యువ ఆటగాళ్లు హౌప్, హెట్మయర్లనూ షమి తెలివిగా వెనక్కి పంపించాడు. ఫుల్ లెంగ్త్‌తో, స్ట్రయిట్ బంతులేసిన షమి ఈ ఇద్దరు ప్రమాదకారులనూ పెవిలియన్‌కు చేర్చి ఛేదనలో కరీబియన్ల ఆశలను ఆవిరి చేశాడు. మాంచెస్టర్‌లో విరాట్ కోహ్లి బ్యాటింగ్ ప్రదర్శనను ఎంత మంది గుర్తుంచుకుంటారో తెలియదు కానీ, షమి బౌలింగ్ విన్యాసం చూసిన అభిమానులెవరూ అంత త్వరగా షమి హీరోయిక్స్ నుంచి బయటపడలేరు!.