Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 20 గ్రాండ్‌స్లామ్‌పై ఫెడరర్ గురి
- జకోవిచ్, నడాల్ నుంచి గట్టి పోటీ
- నేటి నుంచి వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్
' గ్రాస్ కోర్టులో నేను కోరుకున్నట్టు ఆడగలను. బహుశా ఇది నడాల్ మట్టి కోర్టుపై ఎలా ఫీల్ అవుతాడో అటువంటిదే. మట్టిలో అతడు వెనక నుంచి ముందుకు, ముందు నుంచి వెనక్కి వెళ్లగలడు. గడ్డి కోర్టులో నేనూ అదే ఇష్టపడతాను. అనుకున్న సర్వ్ చేయగలను, అనుకున్న వ్యాలీ ఆడగలను. వెనుక నిలబడగలను. గెలిచేందుకు ఇక్కడ నాకు విస్తృత అవకాశాలు. ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఇది కీలకం అవుతుంది.
నడాల్‌కు ఫ్రెంచ్ ఓపెన్ ఎలాగో, నాకు వింబుల్డన్ అటువంటిదే'
- రోజర్ ఫెడరర్
లండన్
టెన్నిస్ కోర్టులో తేలిగ్గా తీసుకోవటం, తక్కువగా అంచనా వేయటం ఎంత తప్పో స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ గత రెండేండ్లలో నిరూపించాడు. గాయాలు, గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల కరవుతో ఫెడరర్ పనైపోయిందని విమర్శలు వినిపించినా.. స్విస్ యోధుడు గొప్పగా పుంజుకున్నాడు. వింబుల్డన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ విజయాలతో దూసుకొచ్చాడు. ఇప్పుడు ఫెడరర్ వయసు 38. ఈ వయసులో వింబుల్డన్ నెగ్గిన ఏకైక వీరుడిగా ఫెడరర్‌కు ఇది అద్భుత అవకాశం. ఇదే సమయంలో గడ్డి కోర్టులో తనకు గట్టి పోటీనిచ్చే నొవాక్ జకోవిచ్ ఇప్పుడు సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. వింబుల్డన్‌లో ఫెడరర్‌కు బహుశా ఇదే ఆఖరు అవకాశం కాబోలు!. అందుకే 2019 సెంటర్ కోర్టులో అందరి దృష్టి స్విస్ యోధుడిపైనే నెలకొని ఉంటున్నాయి. లేటు వయసులో ఘాటు ఆటతో ఫెడరర్ కెరీర్ 20వ గ్రాండ్‌స్లామ్ సొంతం చేసుకుంటాడా? చూడాలి. అర్హత మ్యాచులతో మొదలైన వింబుల్డన్ హంగామా.. జులై 1 నుంచి ప్రధాన పోటీలను జరుపుకోనుంది. పురుషుల, మహిళల సింగిల్స్ మ్యాచులు నేటి నుంచి ఆరంభం కానున్నాయి.
ఫెడరర్ వర్సెస్ నడాల్! : ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నం.2 అయినా, వింబుల్డన్ రఫెల్ నడాల్‌కు మూడో సీడ్ ఇచ్చింది. సీడింగ్‌పై నడాల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. వరల్డ్ నం.3 ఫెడరర్.. ఇక్కడ రెండో సీడ్‌గా ఆడుతున్నాడు. పురుషుల సింగిల్స్ డ్రాలో ప్రియ ప్రత్యర్థులు ఫెడరర్, నడాల్‌లు ఒకే పార్శ్యంలో చోటుచేసుకున్నారు. ఈ ఇద్దరూ సెమీఫైనల్లోనే ముఖాముఖికి సిద్ధపడనున్నారు. 8 సార్లు చాంపియన్ రోజర్ ఫెడరర్ 2019లో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు. వరల్డ్ నం.1, సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ మరో పార్శ్యంలో ఉన్నాడు. అంచనాల ప్రకారం ఫలితాలు వెలువడితే, టైటిల్ పోరులో జకోవిచ్, ఫెడరర్ తలపడనున్నారు!. తొలి రౌండ్లో ఫెడరర్‌తో హరీశ్ (దక్షిణాఫ్రికా) ఆడనుండగా.. జపాన్ ఆటగాడు సుగిటాతో రఫెల్ నడాల్ టైటిల్ వేట మొదలెట్టనున్నాడు. టాప్ సీడ్ జకోవిచ్‌తో జర్మనీ ఆటగాడు ఫిలిఫ్ తలపడతాడు. కెవిన్ అండర్సన్, అలెగ్జాండర్ జ్వెరెవ్, స్టెఫానిస్ సిట్సిపస్, కిరు నిషికోరి, స్టాన్ వావ్రింకా, జాన్ ఇస్నర్లు సైతం వింబుల్డన్ టైటిల్‌పై కన్నేశారు. కానీ ఫెడరర్, జకోవిచ్‌ను దాటి వింబుల్డన్ ఇతరుల చేతుల్లోకి వెళ్లటం కష్టమే.
మహిళల చాంపియన్ ఎవరో? : గ్రాండ్‌స్లామ్ విజత విషయంలో మహిళల సింగిల్స్ ఒక ప్రమాణాన్ని పాటిస్తోంది!. వరుసగా ఒక్కో గ్రాండ్‌స్లామ్‌లో ఒక్కో విజేత పుట్టుకొస్తున్నారు. సెరెనా విలియమ్స్ ఆధిపత్య శకానికి తెరపడిన తర్వాత.. మహిళల సింగిల్స్ టైటిల్ పోటీలో అందరూ నిలబడుతున్నారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌తో సంబంధం లేకుండా వింబుల్డన్‌లో ఈసారీ అదే జరగనుందని అంచనా. ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్, వరల్డ్ నం. బార్టీ (ఆస్ట్రేలియా), డిఫెండింగ్ చాంపియన్ ఎంజెలికా కెర్బర్ (జర్మనీ), దిగ్గజ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ (అమెరికా)లు డ్రాలో ఒకే పార్శ్యంలో ఉన్నారు. క్వార్టర్స్, సెమీస్‌లోపే ఈ ముగ్గురు ముఖాముఖికి రెఢ కానున్నారు. ప్రసవానంతరం తొలి గ్రాండ్‌స్లామ్ విజయంపై కన్నేసిన సెరెనా విలియమ్స్ వింబుల్డన్‌లో మరోసారి ఫేవరెట్‌గా కనిపిస్తోంది. సెరెనా తర్వాత వరుసగా ఫ్రెంచ్, వింబుల్డన్ నెగ్గిన క్రీడాకారిణిగా నిలిచేందుకు బార్టీ సిద్ధమవుతోంది. కరొలినా ఫ్లిస్కోవా, బార్టెన్స్, నవొమి ఒసాక, పెట్రా క్విటోవా, స్టిఫెన్స్, స్విట్లోనా, హలెప్‌లు సైతం టైటిల్ రేసులో ముందున్నారు