Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆతిథ్య జట్టు సెమీస్ ఆశలు సజీవం
- జానీ బెయిర్‌స్టో శతకం
- బెన్ స్టోక్స్ మెరుపులు
- రోహిత్, విరాట్ శ్రమ వృథా
బర్మింగ్‌హామ్
చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ అదరగొట్టింది. కోహ్లిసేన అజేయ రికార్డును బ్రేక్ చేసింది. బర్మింగ్‌హామ్‌లో భారీ విజయం సాధించిన ఇంగ్లాండ్ సెమీఫైనల్స్ రేసులో ఆశలు సజీవంగా నిలుపుకుంది. చివరి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై విజయం, ఆతిథ్య జట్టుకు నేరుగా సెమీస్ బెర్త్ అందించనుంది. ఓపెనర్ జానీ బెయిర్‌స్టో (111, 109 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లు) శతకంతో చెలరేగగా.. బెన్ స్టోక్స్ (79, 54 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), జేసన్ రారు (66, 57 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ఈ ముగ్గురి మెరుపులతో ఇంగ్లాండ్ తొలుత 337 పరుగుల భారీ స్కోరు చేసింది. రికార్డు ఛేదనలో టీమ్ ఇండియా చతికిల పడింది. ఓపెనర్ రోహిత్ శర్మ (102, 109 బంతుల్లో 15 ఫోర్లు), విరాట్ కోహ్లి (66, 76 బంతుల్లో 7 ఫోర్లు) పోరాటం వృథా అయ్యింది. వరుసగా ఐదో అర్ధ సెంచరీ బాదిన కోహ్లి, ప్రపంచకప్ ఈ ఘనత సాధించిన ఏకైక భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. 50 ఓవర్లలో 306 పరుగులే చేసిన భారత్ 31 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
రోహిత్, కోహ్లి రాణించినా.. : రికార్డు ఛేదనలో భారత్‌కు మెరుగైన ఆరంభం లభించలేదు. క్యాచ్ పడుతూ గాయపడిన కెఎల్ రాహుల్ (0) పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు. పవర్‌ప్లేలో ఇంగ్లాండ్ సీమర్ల లైన్ అండ్ లెంగ్త్ దూకుడుగా ఆడేందుకు సహకరించలేదు. దీంతో తొలి పది ఓవర్లలో భారత్ 28 పరుగులే చేసింది. రోహిత్ శర్మ (102), విరాట్ కోహ్లి (66) రెండో వికెట్‌కు 138 పరుగుల భాగస్వామ్య నిర్మించారు. స్టార్ బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలిచినా, రన్‌రేట్ 6కు చేరువ కాలేదు. కుదురుకున్న తర్వాత ఎదురుదాడి చేసే అవకాశం ఉన్నప్పటికీ కోహ్లి, రోహిత్ ఆ పని చేయకుండానే అవుటయ్యారు. ఇది లోయర్ ఆర్డర్‌పై మరింత ఒత్తిడి పెంచింది. రోహిత్‌పై ఇంగ్లాండ్ సీమర్లు గొప్పగా బంతులేశారు. సహజంగా సిక్సర్లు కొట్టే రోహిత్‌కు ఏమాత్రం షార్ట్ బంతులు వేయలేదు. రోహిత్ శతకం చేసినా ఒక్క సిక్సర్ కొట్టలేదు. 15 ఫోర్లతో 106 బంతుల్లో ప్రపంచకప్‌లో మూడో సెంచరీ అందుకున్నాడు. యాంకర్ పాత్ర పోషించిన కోహ్లి 59 బంతుల్లో వరుసగా ఐదో అర్ధ సెంచరీ కొట్టాడు. ఫ్లంకెట్ బంతిని థర్డ్‌మ్యాన్‌లో ఆడేందుకు ప్రయత్నించి విన్సెకు దొరికిపోయాడు. సెంచరీ తర్వాత రోహిత్ సైతం వికెట్ వదులుకున్నాడు. ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్ ఆడిన రిషబ్ పంత్ (32) రోహిత్‌తో కలిసి 50 ప్లస్ పరుగులు జోడించి నిష్క్రమించాడు.
ఇన్నింగ్స్ 40వ ఓవర్లో క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్య (45, 33 బంతుల్లో 4 ఫోర్లు) ధాటిగా ఆడి భారత్‌ను రేసులోకి తీసుకొచ్చాడు. పాండ్య క్రీజులో ఉండగా సాధించాల్సిన రన్‌రేట్ 10. మరో ఎండ్‌లో ధోని అండతో ఇది సాధ్యమే అనిపించింది. పాండ్య నిష్క్రమణ తర్వాత ఛేదనపై భారత్ ఆశలు వదులుకుంది. ధోని (42 నాటౌట్, 31 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), కేేదార్ జాదవ్ (12 నాటౌట్, 13 బంతుల్లో 1 ఫోర్) పరిస్థితి తగినట్టు ఆడలేదు. బౌండరీలు కొట్టాల్సిన వేళ స్ట్రయిక్ రొటేషన్‌కు పరిమితమయ్యారు. భారత్ 306 పరుగులకే పరిమితమై, ప్రపంచకప్‌లో తొలి ఓటమి చవిచూసింది.
చితకబాదిన జానీ, స్టోక్స్: టాస్ నెగ్గిన ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. గాయం నుంచి కోలుకున్న జేసన్ రాయ్ (66), జానీ బెయిర్ స్టో (111) ఇంగ్లాండ్‌కు తిరుగులేని ఆరంభాన్ని అందించారు. పవర్ ప్లేలో బుమ్రా, షమిని ఆచితూచి ఆడి వికెట్లు నిలుపుకున్నారు. బంతి స్పిన్నర్లు అందుకోగానే ఊచకోత మొదలెట్టారు. తొలి పది ఓవర్లలో 47 పరుగులే చేసిన ఓపెనర్లు.. తర్వాతి పది ఓవర్లలో విజృంభించారు. జేసన్ రారు ఏడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 41 బంతుల్లోనే అర్ధ సెంచరీ బాదగా.. బెయిర్‌స్టో కాస్త నెమ్మదిగా 56 బంతుల్లో చేరుకున్నాడు. చాహల్, కుల్దీప్ లక్ష్యంగా ఎదురుదాడి చేసిన ఓపెనర్లు దండిగా పరుగులు పిండుకున్నారు. 22 ఓవర్లలోనే 160/0తో ఇంగ్లాండ్ భారీ స్కోరు దిశగా సాగింది. అద్భుతమైన క్యాచ్‌తో రారుని అవుట్ చేసిన జడేజా.. బౌలర్లకు కాస్త ఉపశమనం కలిగించాడు. అర్ధ సెంచరీ తర్వాత ఊపందుకున్న బెయిర్‌స్టో మరో నాలుగు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.
90 బంతుల్లో ప్రపంచకప్‌లో తొలి సెంచరీ సాధించాడు. జో రూట్ (44, 54 బంతుల్లో 2 ఫోర్లు)ను కట్టడి చేయటంతో ఇంగ్లాండ్ జోరు తగ్గింది. శతకం తర్వాత బెయిర్‌స్టో భారీ షాట్‌కు ప్రయత్నించి వికెట్ కోల్పోయాడు. మోర్గాన్ (1)ను ఇబ్బంది పెట్టిన షమి.. ఉసిగొల్పి క్యాచౌట్ చేశాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన బెన్ స్టోక్స్ (79) స్కోరు బోర్డును మళ్లీ ఉరకలు పెట్టించాడు. మూడు సిక్సర్లు, ఆరు ఫోర్లతో చెలరేగిన స్టోక్స్ వరుసగా మరో అర్ధ సెంచరీ సాధించాడు. 38 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించిన స్టోక్స్ ఇంగ్లాండ్‌ను 350 ప్లస్ దిశగా తీసుకెళ్లాడు. చివర్లో అతడికి జోశ్ బట్లర్ (20) తోడయ్యాడు. రెండు భారీ సిక్సర్లు, ఫోర్‌తో కదంతొక్కిన బట్లర్.. షమి కండ్లుచెదిరే క్యాచ్‌తో నిష్క్రమించాడు. ఆఖరి ఓవర్లో ఇంగ్లాండ్ అద్భుతాలేమీ చేయలేదు. ఎదురులేని ఆరంభం లభించినా ఇంగ్లాండ్ 337 పరుగులకే పరిమితమైంది. చాహల్ పది ఓవర్లలో వికెట్ లేకుండా 88 పరుగులు ఇచ్చుకున్నాడు. మహ్మద్ షమి ఐదు వికెట్ల ప్రదర్శనతో మెరిశాడు.
స్కోరు వివరాలు :
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ : జేసన్ రాయ్ (సి) జడేజా (బి) కుల్దీప్ 66, బెయిర్‌స్టో (సి) పంత్ (బి) షమి 111, జో రూట్ (సి) హార్దిక్ (బి) షమి 44, మోర్గాన్ (సి) జాదవ్ (బి) షమి 1, స్టోక్స్ (సి) జడేజా (బి) బుమ్రా 79, బట్లర్ (సి,బి) షమి 20, వోక్స్ (సి) రోహిత్ (బి) షమి 7, ఫ్లంకెట్ నాటౌట్ 1, ఆర్చర్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 08, మొత్తం : (50 ఓవర్లలో 7 వికెట్లకు) 337.
వికెట్ల పతనం : 1-160, 2-205, 3-207, 4-277, 5-310, 6-319, 7-336.
బౌలింగ్ : మహ్మద్ షమి 10-1-69-5, జశ్‌ప్రీత్ బుమ్రా 10-1-44-1, చాహల్ 10-0-88-0, కుల్దీప్ 10-0-72-1.
భారత్ ఇన్నింగ్స్ : కెఎల్ రాహుల్ (సి,బి) క్రిస్ వోక్స్ 0, రోహిత్ శర్మ (సి) బట్లర్ (బి) వోక్స్ 102, విరాట్ కోహ్లి (సి) విన్సె (బి) ఫ్లంకెట్ 66, రిషబ్ పంత్ (సి) వోక్స్ (బి) ఫ్లంకెట్ 32, హార్దిక్ పాండ్య (సి) విన్సె (బి) ఫ్లంకెట్ 45 , ఎం.ఎస్ ధోని నాటౌట్ 42 , కేదార్ జాదవ్ నాటౌట్ 12, ఎక్స్‌ట్రాలు : 07, మొత్తం : ( 50 ఓవర్లలో 5 వికెట్లకు) 306.
వికెట్ల పతనం : 1-8, 2-146, 3-198, 4-226, 5-267.
బౌలింగ్ : క్రిస్ వోక్స్ 10-3-58-2, ఆర్చర్ 10-0-45-0, ఫ్లంకెట్ 10-0-55-3, మార్క్‌వుడ్ 10-0-73-0, రషీద్ 6-0-40-0, బెన్ స్టోక్స్ 4-0-34-0.