Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవిష్క ఫెర్నాండో శతకం
- పూరన్, అలెన్ పోరాటం వృథా
చెస్టర్ లీ స్ట్రీట్ : ప్రపంచకప్‌లో నామమాత్రపు మ్యాచ్‌లో శ్రీలంక చిద్విలాసం. భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో లంకేయులు మెరుపు విజయం సాధించారు. అవిష్క ఫెర్నాండో (104), తిరిమానె (45) రాణించగా తొలుత శ్రీలంక 338/6 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. రికార్డు ఛేదనలో నికోలస్ పూరన్ (118), అలెన్ (51) పోరాడినా ఫలితం దక్కలేదు.
పూరన్, అలెన్ మెరుపులు : భారీ ఛేదనలో విండీస్ టాప్ ఆర్డర్ విఫలమైంది. స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ (35) నెమ్మదిగా ఆడినా, వికెట్ కాపాడుకోలేదు. సునీల్ ఆంబ్రిస్ (5), షారు హౌప్ (5), షిమ్రోన్ హెట్మయర్ (29) వేగంగా వికెట్లు కోల్పోయారు. కెప్టెన్ జేసన్ హౌల్డర్ (26), కార్లోస్ బ్రాత్‌వేట్ (8) సైతం పెవిలియన్ దారి పట్టారు. నికోలస్ పూరన్ (118, 103 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఫెబిన్ అలెన్ (51, 32 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) మెరుపు భాగస్వామ్యంతో విండీస్‌ను రేసులోకి తీసుకొచ్చారు. 30 బంతుల్లో అలెన్ అర్ధ సెంచరీ బాదగా.. నికోలస్ కెరీర్ తొలి సెంచరీ సాధించాడు. అలెన్ రనౌట్‌తో శ్రీలంక మ్యాచ్‌పై పట్టు సాధించింది. ఆఖర్లో పూరన్ సైతం అవుటై విండీస్ ఆశలను ఆవిరి చేశాడు.
ఫెర్నాండో సెంచరీ : తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక భారీ స్కోరు సాధించింది. ఈ ప్రపంచకప్‌లో తొలిసారి 250 ప్లస్ స్కోరు చేసింది. ఓపెనర్లు కరుణరత్నె (32), కుశల్ పెరీరా (64) తొలి వికెట్‌కు 93 పరుగులు జోడించి శుభారంభం అందించారు. మూడో స్థానంలో వచ్చిన అవిష్క ఫెర్నాండో (104, 103 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) ప్రపంచకప్‌లో తొలి సెంచరీతో అదరగొట్టాడు. విండీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఫెర్నాండో శతకం సాధించాడు. కుశల్ మెండిస్ (39), ఎంజెలో మాథ్యూస్ (26) సహా లహిరు తిరిమానె (45, 33 బంతుల్లో 4 ఫోర్లు) ధనాధన్‌తో శ్రీలంక 338/6 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. విండీస్ బౌలర్లలో జేసన్ హౌల్డర్ (2/59), అలెన్ (1/44), కాట్రెల్ (1/69), థామస్ (1/58) పరుగుల నియంత్రణలో విఫలమయ్యారు.