Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బంగ్లాపై తిరుగులేని విజయం
- రోహిత్ శర్మ రికార్డు శతకం
- రాణించిన రిషబ్ పంత్
- ఛేదనలో బంగ్లా ఆటకట్టు
వరల్డ్ నం.1 టీమ్ ఇండియా వరల్డ్‌కప్‌కు మరింత చేరువైంది!. ప్రపంచకప్‌లో ఆరో విజయం సాధించిన కోహ్లిసేన సెమీఫైనల్లోకి ప్రవేశించింది. గ్రూప్ దశలో భారత్ తరువాతి లక్ష్యం అగ్రస్థానం కోసం ఆడటమే!.
రోహిత్ శర్మ (104) ప్రపంచకప్ ఫామ్ కొనసాగించాడు. హిట్‌మ్యాన్ నాల్గో సెంచరీతో బంగ్లాదేశ్‌పై - సెమీఫైనల్స్ ఆశలు ఆవిరయ్యాయి.
భారత్ భారీ స్కోరు చేసింది. కెఎల్ రాహుల్ (77), రిషబ్ పంత్ (48) రాణించారు. బర్మింగ్‌హామ్‌లో వరుసగా రెండో మ్యాచ్ ఆడిన కోహ్లిసేన.. పరిస్థితులను చక్కగా వినియోగించుకుంది. 314/9 పరుగులు చేసింది.
ఛేదనలో బంగ్లా స్టార్ షకిబ్ అల్ హసన్ (66) వెంబడించాడు. బంగ్లా బ్యాట్స్‌మెన్ కీలక భాగస్వామ్యాలతో రేసులో ఎప్పటికప్పుడు ఆశలు నిలుపుకున్నారు. నిలకడగా వికెట్లు కూల్చిన భారత బౌలర్లు ఛేదనలో బంగ్లాదేశ్ ఆట కట్టించారు. భారత్ చేతిలో ఓటమితో బంగ్లాదేశ్
బర్మింగ్‌హామ్: టైటిల్ ఫేవరెట్, వరల్డ్ నం.1 టీమ్ ఇండియా ప్రపంచకప్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బంగ్లాదేశ్‌పై 28 పరుగులతో తిరుగులేని విజయం సాధించిన కోహ్లిసేన ఆరో విజయంతో సెమీస్ బెర్త్ సొంతం చేసుకుంది. 315 పరుగుల రికార్డు ఛేదనలో బంగ్లాదేశ్ చతికిల పడింది. షకిబ్ అల్ హసన్ (66, 74 బంతుల్లో 6 ఫోర్లు), మహ్మద్ సైఫుద్దీన్ (51 నాటౌట్, 38 బంతుల్లో 9 ఫోర్లు) అర్ధ సెంచరీల పోరాటం వృథా అయ్యింది. బుమ్రా (4/55), హార్దిక్ పాండ్య (3/60) విజృంభణతో బంగ్లాదేశ్ 286 పరుగులకే కుప్పకూలింది. తొలుత భారత్ 314 పరుగుల భారీ స్కోరు చేసింది. 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' రోహిత్ శర్మ (104, 92 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) ప్రపంచకప్‌లో నాల్గో సెంచరీ బాదగా.. కెఎల్ రాహుల్ (77, 92 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో మెరిశాడు. యువ ఆటగాడు రిషబ్ పంత్ (48) రాణించాడు. ఈ విజయంతో భారత్ సెమీస్‌కు చేరగా.. ఈ ఓటమితో బంగ్లాదేశ్ సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది.
షకిబ్ మెరిసినా.. : బంగ్లాదేశ్ లక్ష్యం 315. ప్రపంచకప్‌లో 300 ప్లస్ లక్ష్యాన్ని ఛేదించిన ఏకైక జట్టుగా బంగ్లాదేశ్ విజయంపై దీమాగా కనిపించింది. కానీ భారీ భాగస్వామ్యాలు నిర్మించలేక ప్రపంచకప్ సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది. పవర్ ప్లేలో మెరుగ్గానే ఆడిన ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్ (22), సౌమ్య సర్కార్ (33) వికెట్ కాపాడుకోలేదు. షమి సూపర్ బంతికి ఇక్బాల్ క్లీన్‌బౌల్డ్ కాగా.. హార్దిక్ పాండ్య బంతికి సౌమ్య సర్కార్ వెనుదిరిగాడు. కెరీర్ భీకర ఫామ్‌లో ఉన్న షకిబ్ అల్ హసన్ (66), ముష్ఫీకర్ రహీమ్ (24)తో కలిసి ఛేదన దిశగా సాగే ప్రయత్నం చేశాడు. మూడు ఫోర్లతో ధాటిగా ఆడిన ముష్ఫీకర్‌ను చాహల్ సాగనంపాడు. లిటన్ దాస్ (22)తో కలిసి షకిబ్ ఛేదన తిరిగి ప్రారంభించాడు. ఆరు ఫోర్లతో షకిబ్ ప్రమాదకరంగా కనిపించాడు. సూపర్బ్ స్పెల్‌లో హార్దిక్ పాండ్య ఈ ఇద్దరినీ అవుట్ చేసి, బంగ్లాను కోలుకోలేని దెబ్బకొట్టాడు. చివర్లో షబ్బీర్ రెహమాన్ (36), మహ్మద్ సైఫుద్దీన్ 66 పరుగుల భాగస్వామ్యంతో బంగ్లాను రేసులోకి తీసుకొచ్చారు. 37 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించిన సైఫుద్దీన్ పోరాటం వృథా అయ్యింది. వరుస యార్కర్లతో రూబెల్, ముస్తాఫిజుర్ వికెట్లను గిరాటేసిన బుమ్రా.. బంగ్లా ఛేదనకు 286 పరుగుల వద్ద తెరవేశాడు.
రోహిత్, రాహుల్, రిషబ్ అదుర్స్ : బర్మింగ్‌హామ్‌లో భారత్‌కు ఈసారి భారీ ఆరంభం లభించింది. టాస్ నెగ్గిన కోహ్లి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ (104), కెఎల్ రాహుల్ (77) ప్రపంచకప్‌లో రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ నుంచే రోహిత్ శర్మ దూకుడుగా ఆడాడు. మొర్తాజా ఓవర్లో స్క్వేర్ లెగ్ మీదుగా భారీ సిక్సర్‌తో ఎదురుదాడి మొదలెట్టాడు. మరో ఎండ్‌లో కెఎల్ రాహుల్ ఇబ్బంది పడ్డాడు. తొలి ఐదు ఓవర్లలో డాట్స్ ఎక్కువయ్యాయి. ఒత్తిడి తగ్గించేందుకు రోహిత్ ముందుకొచ్చాడు. ఆరో ఓవర్లో సైఫుద్దీన్‌పై మరో భారీ సిక్సర్ కొట్టాడు. రాహుల్ సైతం సైఫుద్దీన్‌పై వరుస ఫోర్లతో జోరందుకున్నాడు. మొర్తజాపై రోహిత్ మరోసారి వరుస ఫోర్లు బాదగా.. పవర్ ప్లేలో భారత్ 69/0 పరుగులు చేసింది. నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 45 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించిన రోహిత్ శర్మ.. మరో 45 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో కెరీర్ 23వ సెంచరీ సాధించాడు. ఐదు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 57 బంతుల్లో రాహుల్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఓపెనర్ల మెరుపులతో భారత్ తొలి వికెట్‌కు 180 పరుగులు జోడించింది. రాహుల్, రోహిత్ జోరుతో భారత్ 350 ప్లస్ స్కోరు సాధించేలా కనిపించింది. కానీ 30 ఓవర్ల తర్వాత పిచ్ నెమ్మదించటం.. రోహిత్, రాహుల్ స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరటంతో స్కోరు వేగం తగ్గింది. రిషబ్ పంత్‌తో కలిసి నిర్మాణాత్మక ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లి (26, 27 బంతుల్లో 3 ఫోర్లు) ఐదు అర్థ సెంచరీల తర్వాత స్వల్ప స్కోరుకు వికెట్ కోల్పోయాడు. ఒకే ఓవర్లో కోహ్లి, హార్దిక్ పాండ్య (0) వికెట్లను కూల్చిన ముస్తాఫిజుర్ భారత్ భారీ స్కోరు అవకాశాలను దెబ్బకొట్టాడు.
యువ మెరుపు రిషబ్ పంత్ (48, 41 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నాడు. సహజ శైలిలో దూకుడుగా ఆడిన రిషబ్ పంత్ ఆరు ఫోర్లు, ఓ సిక్సర్‌తో చెలరేగాడు. బంగ్లా బౌలర్లపై ఆధిపత్యం చూపేందుకు ఇష్టపడిన పంత్.. అర్ధ సెంచరీకి రెండు పరుగుల దూరంలో వికెట్ కోల్పోయాడు. ఎం.ఎస్ ధోని (35, 33 బంతుల్లో 4 ఫోర్లు) మరోసారి అలరించే ఇన్నింగ్స్‌కు దూరంగా ఆడాడు. దినేశ్ కార్తీక్ (8) స్కోరు వేగం పెంచే క్రమంలో పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఆఖరి రెండు ఓవర్లలో ఆరు పరుగులే ఇచ్చిన ముస్తాఫిజుర్ రెండు వికెట్లు కూల్చాడు. భారత్ 314/9 పరుగులే పరిమితమైంది. బంగ్లా సీమర్ ముస్తాఫిజుర్ ఐదు వికెట్ల ప్రదర్శన చేయగా.. షకిబ్, సర్కార్, రూబెల్ తలో వికెట్ తీసుకున్నారు.
వరల్డ్‌కప్ నయా హీరో
నాలుగు సెంచరీలతో
రోహిత్ శర్మ రికార్డు
నవతెలంగాణ క్రీడా విభాగం
ఐసీసీ టోర్నీలు, ప్రపంచకప్ అనగానే భారత అభిమానులకు ముందుగా గుర్తొచ్చే ఆటగాడు శిఖర్ ధావన్. ఐసీసీ టోర్నీల్లో కండ్లుచెదిరే గణాంకాలు నమోదు చేసిన భారత ఓపెనర్, మెగా ఈవెంట్లలో ఎన్నడూ నిరాశపర్చలేదు. గాయంతో సహచర ఓపెనర్ టోర్నీకి దూరమయ్యాడు. కానీ ధావన్ ఐసీసీ దూకుడు రోహిత్ శర్మ అందుకున్నాడు!. 2019 ప్రపంచకప్‌లో నాలుగు సెంచరీలు సాధించిన రోహిత్ శర్మ ఈ ఘనత సాధించిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. సౌరవ్ గంగూలీ ఒక్కడే ఓ ప్రపంచకప్‌లో మూడు సెంచరీలు సాధించాడు. కానీ రోహిత్ శర్మ ఇంగ్లాండ్‌లో ఆ రికార్డును బద్దలు కొట్టాడు. దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్‌లపై శతకాలతో చెలరేగాడు. ఈ ప్రపంచకప్‌లో ఆడిన ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ శర్మ 544 పరుగులు నమోదు చేశాడు. సచిన్ టెండూల్కర్ తర్వాత, ప్రపంచకప్‌లో 500 ప్లస్ పరుగులు చేసిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. తాజా ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్స్‌కు చేరితే.. సచిన్ టెండూల్కర్ అత్యధిక పరుగులు రికార్డు (673)ను సైతం రోహిత్ బద్దలుకొట్టే అవకాశం ఉంది.
భారీ షాట్లతో విరుచుకుపడే హిట్‌మ్యాన్‌కు ఈ శతకాలు ప్రత్యేకం. రోహిత్ శర్మ కోసం ప్రత్యర్థి జట్ల బౌలర్లు మెరుగైన బౌలింగ్ ప్రణాళికలతో వచ్చారు. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లోనే తీసుకుంటే, రోహిత్‌కు షార్ట్ బంతులు వేయకుండా క్రమశిక్షణ పాటించారు. సెంచరీ సాధించినా సిక్సర్ కొట్టకపోవటం బహుశా రోహిత్‌కు ఇదే తొలిసారి!. మరోవైపు ఆరంభంలో నెమ్మదిగా ఆడటం రోహిత్‌కు అలవాటు. శిఖర్ ధావన్ లేకపోవటంతో రోహిత్ శర్మనే ముందుగా రిస్క్ తీసుకుంటున్నాడు. ఎదురుదాడి చేస్తున్నాడు. బంగ్లాదేశ్‌పై రోహిత్ శర్మకు 9 పరుగుల వద్ద జీవనదానం లభించినా.. ఆ తర్వాత హిట్‌మ్యాన్ తిరుగులేని ఇన్నింగ్స్ ఆడాడు. ఐదు సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. బలమైన బౌలింగ్ లైనప్ కలిగిన దక్షిణాఫ్రికా, పాకిస్థాన్లపైనా రోహిత్ శర్మ గుర్తుండిపోయే సెంచరీలు సాధించాడు. పవర్ ప్లేలో యాంకర్ పాత్ర కాకుండా, మెరుపు షాట్లతో విరుచుకుపడుతున్నాడు. ఓ మెగా టోర్నీలో రోహిత్ శర్మ ఈ స్థాయిలో రాణించటం ఇదే తొలిసారి. నెమ్మదిగా సెంచరీ సాధించి.. వేగంగా ద్వి శతకం బాదే అభిమానులకు రోహిత్ శర్మ నుంచి ఒకే ఒక్క వెలితి. 2019 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ బాదే ఐదో శతకాన్ని డబుల్ సెంచరీగా మలచాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరో సెంచరీ బాదితే ప్రపంచకప్ సెంచరీల్లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (6) సరసన రోహిత్ శర్మ నిలువనున్నాడు.
భారత్ ఇన్నింగ్స్ : కెఎల్ రాహుల్ (సి) రాహుల్ (బి) రూబెల్ 77, రోహిత్ శర్మ (సి) లిటన్ దాస్ (బి) సౌమ్య సర్కార్ 104, విరాట్ కోహ్లి (సి) రూబెల్ (బి) ముస్తాఫిజుర్ 26, రిషబ్ పంత్ (సి) సౌమ్య సర్కార్ (బి) షకిబ్ 48, హార్దిక్ పాండ్య (సి) సౌమ్య సర్కార్ (బి) ముస్తాఫిజుర్ 0, ఎం.ఎస్ ధోని (సి) షకిబ్ (బి) ముస్తాఫిజుర్ 35, దినేశ్ కార్తీక్ (సి) మొసద్దెక్ (బి) ముస్తాఫిజుర్ 8, భువనేశ్వర్ కుమార్ రనౌట్ 2, మహ్మద్ షమి (బి) ముస్తాఫిజుర్ 1, జశ్‌ప్రీత్ బుమ్రా నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 13, మొత్తం :(50 ఓవర్లలో 9 వికెట్లకు) 314.
వికెట్ల పతనం : 1-180, 2-195, 3-237, 4-237, 5-277, 6-298, 7-311, 8-314.
బౌలింగ్ : మష్రఫె మొర్తాజా 5-0-36-0, మహ్మద్ సైఫుద్దీన్ 7-0-59-0, ముస్తాఫిజుర్ రెహమాన్ 10-1-59-5, షకిబ్ అల్ హసన్ 10-0-41-1, మొసద్దెక్ హుస్సేన్ 4-0-32-0, రూబెల్ హుస్సేన్ 8-0-48-1, సౌమ్య సర్కార్ 6-0-33-1.
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ : తమీమ్ ఇక్బాల్ (బి) షమి 22, సౌమ్య సర్కార్ (సి) కోహ్లి (బి) హార్దిక్ పాండ్య 33, షకిబ్ అల్ హసన్ (సి) కార్తీక్ (బి) హార్దిక్ పాండ్య 66, ముస్తాఫిజుర్ రెహమాన్ (సి) షమి (బి) చాహల్ 24, మొసద్దెక్ హుస్సేన్ (బి) బుమ్రా 3, షబ్బీర్ రెహమాన్ (బి) భువనేశ్వర్ కుమార్ 36, మహ్మద్ సైఫుద్దీన్ నాటౌట్ 51, మొర్తాజా (సి) ధోని (బి) భువనేశ్వర్ 8, రూబెల్ హుస్సేన్ (బి) బుమ్రా 9, ముస్తాఫిజుర్ (బి) బుమ్రా 0, ఎక్స్‌ట్రాలు : 12, మొత్తం :(48 ఓవర్లలో ఆలౌట్) 286.
వికెట్ల పతనం : 1-39, 2-74, 3-121, 4-162, 5-173, 6-179, 7-245, 8-257, 9-286, 10-286.
బౌలింగ్ : భువనేశ్వర్ కుమార్ 9-0-51-1, జశ్‌ప్రీత్ బుమ్రా 10-1-55-4, మహ్మద్ షమి 9-0-68-1, యుజ్వెంద్ర చాహల్ 10-0-50-1, హార్దిక్ పాండ్య 10-0-60-3.