Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరుసగా రెండో విజయం నమోదు
- నిషికోరి, గౌఫ్ ముందంజ
- మెరిసిన పెట్రా క్విటోవా
- వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్
లండన్: ఫ్రెంచ్ ఓపెన్ యువరాణి ఆష్లె బార్టీ (ఆస్ట్రేలియా) జోరుమీదుంది. వరుసగా 14వ విజయం సాధించిన బార్టీ వింబుల్డన్ మూడో రౌండ్లోకి ప్రవేశించింది. గురువారం రెండో కోర్టులో జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో బార్టీ 6-1, 6-3తో అలవోక విజయం నమోదు చేసింది. బెల్జియం క్రీడాకారిణి అలిసన్ వాన్‌ను చిత్తు చేసిన బార్టీ మరో గ్రాండ్‌స్లామ్ విజయం దిశగా ఓ అడుగు ముందుకు వేసింది. రెండు ఏస్‌లు సంధించిన బార్టీ, 5 బ్రేక్ పాయింట్లు సాధించింది. 16 గేముల్లో ఏకంగా 12 గేములు సొంతం చేసుకున్న బార్టీ ఏకపక్ష విజయంతో మూడో రౌండ్లోకి ప్రవేశించింది. అమెరికా యువ సంచలనం, 15 ఏండ్ల అమ్మాయి కొరి గౌఫ్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. తొలి రౌండ్లోనే వెటరన్ ప్లేయర్ వీనస్ విలియమ్స్‌పై కండ్లుచెదిరే విజయం సాధించిన గౌఫ్.. రెండో రౌండ్లోనూ అదే జోరు చూపించింది. స్లోవేకియా ప్లేయర్ మగ్దలెనా రిబరికోవాపై గౌఫ్ 6-3, 6-3తో వరుస సెట్లలో విజయం సాధించింది. పాయింట్ల పరంగా 62-42తో తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది. 38 సర్వీస్ పాయింట్లు సాధించిన గౌఫ్.. 12 గేములు గెల్చుకుంది. ప్రత్యర్థి కేవలం ఆరు గేములతో సరిపెట్టుకుంది. యు.ఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ స్లోనె స్టీఫెన్స్ మూడో రౌండ్‌కు చేరుకుంది. 6-0, 6-2తో వాంగ్ యఫన్ (చైనా)పై వరుస సెట్లలో గెలుపొందింది. ఆరో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) 7-5, 6-2తో క్రిస్టినా మ్లడనోవిచ్ (ఫ్రాన్స్)పై గెలుపొందింది. టైబ్రేకర్‌లో తొలి సెట్ సాధించిన క్విటోవా.. రెండో సెట్లో సాధికారిక విజయం సాధించింది. బార్బరా స్రైకోవా 6-3, 7-5తో లారా సీగ్మండ్పై విజయం సాధించింది.
పురుషుల సింగిల్స్‌లో జాన్ మిల్‌మ్యాన్ 6-3, 6-2, 6-1తో క్రోయేషియా ఆటగాడు డెరెపై గెలుపొందాడు. అమెరికా ఆటగాడు శామ్ ఖురేషి 6-3, 6-2, 6-3తో రష్యా ఆటగాడు ఆండ్రీ రుబ్లెవ్‌పై వరుస సెట్లలో విజయం సాధించాడు. జాన్ లెనార్డ్ స్ట్రఫ్ 6-4, 6-3, 5-7, 7-6(7-2)తో టేలర్ (అమెరికా)పై పైచేయి సాధించాడు. స్టీవ్ జాన్సన్ (అమెరికా) 3-6, 7-6(7-4), 6-3, 3-6, 6-3తో అలెక్స్ డీ మినార్ (ఆస్ట్రేలియా)తో ఐదు సెట్ల పోరులో పైచేయి సాధించాడు. జపాన్ స్టార్, ఎనిమిదో సీడ్ కిరు నిషికోరి 6-4, 6-4, 6-0తో కామెరూన్ నోరీ (బ్రిటన్)పై సులువుగా విజయం సాధించాడు. డాన్ ఎవాన్స్ (బ్రిటన్) 6-3, 6-2, 7-6(7-2)తో నికోలోజ్ (జార్జియా)పై విజయంతో మూడో రౌండ్లోకి ప్రవేశించాడు.