Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ క్రీడా విభాగం :
ఆరు ప్రపంచకప్‌లు, 44 ఇన్నింగ్స్‌లు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రపంచకప్‌లో ఆరు సెంచరీలు శతకాలు సాధించేందుకు 44 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. వరుసగా రెండో వరల్డ్‌కప్, 16వ ఇన్నింగ్స్. ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. ఆరు సెంచరీలతో రికార్డుతో పాటు వరల్డ్‌కప్‌లో హ్యాట్రిక్ శతకాలు బాదిన భారత క్రికెటర్‌గా నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌ల్లో పరుగుల వరద పారించిన క్రిస్ గేల్, తనకు తాను 'గ్లోబల్ బాస్'గా ముద్ర వేసుకున్నాడు. కానీ ప్రపంచకప్‌లో అగ్ర జట్లను ఉతికారేసిన రోహిత్ శర్మ నిజమైన గ్లోబల్ బాస్!
శ్రీలంకతో చివరి గ్రూప్ మ్యాచ్. లీడ్స్‌లో భారత్ తొలి ప్రపంచకప్ మ్యాచ్. రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ నెమ్మదిస్తుందని శ్రీలంక కెప్టెన్ కరుణరత్నె అంచనా. అందుకే స్పిన్నర్ ధనంజయ డిసిల్వను రంగంలోకి దింపాడు. రోహిత్ శర్మ నాల్గో స్టంప్‌కు (ఆఫ్ స్టంప్‌కు కాస్త ఎడంగా) ఆఫ్ బ్రేకర్ విసిరాడు. రోహిత్ శర్మ ఆ బంతిని ఎక్స్ట్రా కవర్స్ దిశగా బాదాడు. ప్రకటన బోర్డుకు తగిలి బంతి తిరిగి మైదానంలో పడింది. రెండు బంతుల తర్వాత, డిసిల్వ లైన్ ఆఫ్ ఎటాక్‌ను సైతం రోహిత్ లెక్క చేయలేదు. నేరుగా బంతిని గాల్లోకి లేపాడు. ఎదురుగా ఉన్న సైట్స్కీన్పై పడిన బంతి, తిరిగి గ్రౌండ్లోకి వచ్చింది. ఈ రెండు భారీ సిక్సర్లతో శ్రీలంక, డిసిల్వ స్పిన్ ప్రణాళికలను రోహిత్ చిత్తు చేశాడు. నిమిషాల వ్యవధిలోనే శ్రీలంక ఏం చేయాలో పాలుపోని స్థితికి చేరుకుంది!. అదే దూకుడు కొనసాగించిన రోహిత్ శర్మత 92 బంతుల్లో మరో సెంచరీ సాధించి, హ్యాట్రిక్ శతకం అందుకున్నాడు. ప్రపంచకప్‌లో ఆరో సెంచరీ కొట్టి, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సరసన నిలబడ్డాడు.
2011 ప్రపంచకప్ చారిత్రక విజయం సాధించిన జట్టులో చోటు దక్కించుకోలేని రోహిత్ శర్మ.. 2015లో ప్రపంచకప్ అరంగేట్రం చేశాడు. క్వార్టర్ఫైనల్లో బంగ్లాదేశ్‌పై తొలి సెంచరీ సాధించాడు. ఆడుతున్న రెండో ప్రపంచకప్‌లోనే ఐదు సెంచరీలతో అదరగొట్టాడు. వరుసగా మరో సెంచరీ సాధిస్తే, కుమార సంగక్కర (2015) వరుస సెంచరీల రికార్డునూ సమం చేయనున్నాడు. 2011 ప్రపంచకప్ హీరో యువరాజ్ సింగ్ సైతం వరల్డ్‌కప్‌కు ముందు గొప్పగా రాణించలేదు. యువరాజ్ సింగ్ ఆల్‌రౌండర్‌గా, జట్టు విజయాల్లో ఎప్పుడూ తన బాధ్యత పోషిస్తాడు. కానీ ప్రపంచకప్‌లోనే యువీ శిఖర ప్రదర్శనను చూశాం. 2019 ఐపీఎల్ సీజన్లో రోహిత్ శర్మ రాణించలేదు. కెప్టెన్‌గా ముంబయిని నాల్గోసారి విజేతగా నిలిపినా, బ్యాట్స్‌మన్‌గా విఫలమయ్యాడు. బంతిపై ఆధిపత్యం చూపించటంలో వెనుకడుగు వేశాడు. ముంబయి ఇండియన్స్ సహచరుడిగా యువరాజ్ సింగ్ ఓ మాట చెప్పాడు. ' ప్రపంచకప్‌లో నీ గొప్ప ప్రదర్శన చూపిస్తావు. పరుగుల వరద పారిస్తావని' చెప్పాడు. శ్రీలంకతో మ్యాచ్ అనంతరం రోమిత్ శర్మ ఆ మాటలను గుర్తు చేసుకున్నాడు. వరల్డ్ నం.2 బ్యాట్స్‌మన్‌గా లోపం లేని ప్రదర్శన చేస్తున్న రోహిత్ శర్మ నుంచి అభిమానులకు ఒకటే వెలితి. శిఖర్ ధావన్ తోడుగా రోహిత్ శర్మ నెమ్మదిగా ఆడేవాడు. క్రీజులో కుదురుకున్న తర్వాత విశ్వరూపం చూపించేవాడు. భారీ స్కోర్లు బాదేవాడు. కొత్త సహచరుడు కెఎల్ రాహుల్ జతగా రోహిత్ శర్మ దూకుడుగా ఆడుతున్నాడు. శతకాలు సాధిస్తున్నా, రోహిత్ స్టయిల్ ద్వి శతకాలు లేవని అభిమానులు కాస్త నిరాశ పడుతున్నారు. సెమీస్‌లో లేదా ఫైనల్లో రోహిత్ శర్మ ఆ లోటూ భర్తీ చేస్తే అభిమానులకు అంతకంటే ఏం కావాలి?.
రోహిత్ శర్మ నమ్మశక్యం కాని రికార్డులు సొంతం చేసుకున్నాడు. ఇదే సమయంలో కొత్త సహచరుడు కెఎల్ రాహుల్ కుదురుకునేందుకు సాయపడ్డాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లోనే తొలుత జట్టు కట్టిన రోహిత్, రాహుల్.. వరుసగా సెంచరీ, అర్ధ సెంచరీ సాధించారు. భారత్, పాకిస్థాన్ ప్రపంచకప్ మ్యాచుల్లో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదు చేశారు. అఫ్గనిస్థాన్‌పై మ్యాచ్‌లో పవర్‌ప్లేలో పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డారు. సచిన్ టెండూల్కర్ సైతం దూకుడు దృక్పథం ఏదని ప్రశ్నించాడు. కానీ బంగ్లాదేశ్‌పై పవర్‌ప్లేలో 69 పరుగులు, శ్రీలంకపై తొలి పది ఓవర్లలో 59 పరుగులు చేసి మెప్పించారు. దూకుడుగా ఆడే రాహుల్ కుదురుకునేందుకు సమయం తీసుకుంటున్నాడు. దీంతో రోహిత్ శర్మ రంగంలోకి దిగుతున్నాడు. రాహుల్‌పై ఒత్తిడి తగ్గిస్తున్నాడు. అందుకే, శ్రీలంకపై శతక ప్రదర్శన ఘనతను రోహిత్ శర్మకు కట్టబెట్టాడు రాహుల్. ' రోహిత్ శర్మ గేర్ మార్చగల శైలి, విరుచుకుపడే తత్వం, ఫీల్డర్ల మధ్య పరుగులు సాధించే తీరు అమోఘం. సింపుల్‌గా నాపై ఒత్తిడి తగ్గిస్తాడు' అని రాహుల్ అన్నాడు.
ప్రపంచకప్‌లో బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ విజయంలో సింహభాగం అతడి క్రమశిక్షణ, పరుగుల తపనే కారణం. ' ఇది వరకూ ఒక్క వన్డే కూడా ఆడలేదని అనుకుని, క్రీజులోకి వస్తున్నాను. ప్రపంచకప్‌లో ఒక్క సెంచరీ కూడా కొట్టలేదని అనుకుంటున్నాను. టోర్నీలో ఇదే తొలి మ్యాచ్ అనే భావనతో బ్యాటింగ్ చేస్తున్నాను' అని రోహిత్ శర్మ తెలిపాడు. అందుకే క్రిస్ గేల్ తనకు తానుగా గ్లోబల్ బాస్ ముద్ర వేసుకున్నా.. వన్డే క్రికెట్లో తిరుగులేని ఇన్నింగ్స్‌లతో, డాడీ డబుల్ సెంచరీలతో రికార్డులు సృష్టించిన రోహిత్ శర్మ నిజమైన గ్లోబల్ బాస్. క్రిస్ గేల్ చెలరేగిన వేళ విండీస్ ఓడిందేమో కానీ, రోహిత్ శర్మ విధ్వంసం సృష్టించిన చోట భారత్ ఎన్నడూ వెనుకంజ వేయలేదు.