Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాల్గో రౌండ్లో రిస్కెపై గెలుపు
- నడాల్, ఫెడరర్, జకోవిచ్ ముందంజ
- వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్
లండన్ (ఇంగ్లాండ్)
వింబుల్డన్ ఏడు సార్లు విజేత, మహిళల టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ (అమెరికా) రికార్డు గ్రాండ్‌స్లామ్ దిశగా మరో అడుగు ముందుకు వేసింది. అమెరికాకే చెందిన అలిసన్ రిస్కెపై ప్రీ క్వార్టర్స్‌లో మూడు సెట్ల పోరులో గెలిచిన సెరెనా విలియమ్స్ వింబుల్డన్‌లో 12వ సారి క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. 6-4, 4-6, 6-3తో మూడు సెట్ల పోరాటంలో పైచేయి సాధించింది. అమెరికా మాజీ గూఢచారి, ఎఫ్‌బీఐ ఇన్వెస్టిగేటర్ కూతురు అలిసన్ రిస్కె అన్‌సీడెడ్‌గా నాల్గో రౌండ్ వరకూ చేరుకుంది. ప్రీ క్వార్టర్స్‌లో దిగ్గజ ప్లేయర్‌పై ఓ సెట్లో గెలుపొందింది. కానీ నిర్ణయాత్మక మూడో సెట్లో సెరెనా ముందు తలొంచింది. 121 నిమిషాల ఉత్కంఠ మ్యాచ్‌లో సెరెనా విలియమ్స్ పైచేయి సాధించింది. 27 అనవసర తప్పిదాలు చేసినా, సెరెనా దూకుడు ఆమెను విజేతగా నిలబెట్టింది. 49 విన్నర్లు, 19 ఏస్‌లతో సెరెనా సత్తా చాటింది. 96-89 పాయింట్లతో అలిసన్పై సెరెనా గెలుపొందింది. వింబుల్డన్‌లో సెరెనాకు ఇది 97వ విజయం కావటం విశేషం. వింబుల్డన్ విజేతగా సెరెనా నిలిస్తే, అది ఆమెకు ఇక్కడ 100వ మ్యాచ్ విజయం అవుతుంది. మరో మ్యాచ్‌లో సిమోన హెలెప్ (రోమానియా) 7-6(7-4), 6-1తో జాంగ్ (చైనా)పై గెలుపొందింది. తొలి సెట్లో పోటీనిచ్చిన జాంగ్ టైబ్రేకర్‌లో తలోంచింది. రెండో సెట్లో చెలరేగిన హెలెప్ ఏకపక్ష విజయం సాధించింది. క్వార్టర్ఫైనల్లో ఉక్రెయిన్ భామ స్విట్లోనాతో హలెప్ తలపడనుంది. ప్రీ క్వార్టర్స్‌లో 7-5, 6-4తో చెక్ రిపబ్లిక్ ప్లేయర్ ముచోవపై స్విట్లోనా గెలుపొందింది.
క్వార్టర్స్‌లో స్టార్ ప్లేయర్స్ : పురుషుల సింగిల్స్‌లో స్టార్ ఆటగాళ్లు క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు. రెండో సీడ్, 20 గ్రాండ్‌స్లామ్ విజేత రోజర్ ఫెడరర్ 6-1, 6-2, 6-3తో బారెటిని (నార్వే)పై విజయంతో క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. జపాన్ ఆటగాడు కిరు నిషికోరి 6-3, 3-6, 6-3, 6-4తో కుకుస్కిన్పై గెలుపొందాడు. టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) 6-3, 6-2, 6-3తో హంబర్డ్ (ఫ్రాన్స్)పై విజయంతో క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. మూడో సీడ్ రఫెల్ నడాల్ (స్పెయిన్) 6-2, 6-2, 6-2తో అలవోక విజయం నమోదు చేశాడు. డెవిడ్ గొఫిన్ 7-6(11-9), 2-6, 6-3, 6-4తో క్వార్టర్స్‌కు వెళ్లాడు. శామ్ ఖుర్రే 6-4, 6-7(7-9), 7-6(7-3), 7-6(7-5)తో ఉత్కంఠ మ్యాచ్‌లో గెలుపొందాడు. రాబర్ట్ బటిస్టా ఆగట్ 6-3, 7-5, 6-2తో క్వార్టర్స్ సమరానికి అర్హత సాధించాడు. నేడు క్వార్టర్ఫైనల్లో రోజర్ ఫెడరర్‌తో నిషికోరి, రఫెల్ నడాల్‌తో శామ్ ఖుర్రే, జకోవిచ్‌తో గోఫిన్ తలపడనున్నారు.