Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగేండ్లలో నం.4 బ్యాట్స్‌మన్‌ను సిద్ధం చేయని భారత్
- 2003లో లక్ష్మణ్, 2019లో రాయుడిపై వేటుతో భారీ మూల్యం
నవతెలంగాణ క్రీడా విభాగం
2019 ప్రపంచకప్‌లో అత్యంత పటిష్టమైన, ప్రమాదకరమైన టాప్ ఆర్డర్‌తో బరిలోకి దిగిన జట్టు భారత్. ఇదే సమయంలో అత్యంత పేలవ, బలహీనమైన మిడిల్ ఆర్డర్ కూడా టీమ్ ఇండియాదే. ప్రత్యేకించి నం.4 గురించి ఎక్కువగా చెప్పుకోవాలి. ప్రపంచకప్ సాధించగల సత్తా, ఫామ్ ఉండి ఇంటి ముఖం పట్టడం భారత్‌కు ఇది రెండోసారి అని చెప్పాలి. 2003 ప్రపంచకప్‌లోనూ భారత్ ఎదురులేని జట్టుగా కనిపించింది. కానీ నం.3లో స్పెషలిస్ట్ సొగసరి హైదరాబాద్ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్‌ను కాదని స్పిన్ బౌలింగ్ వేయగలడనే కారణంతో దినేశ్ మోంగియాను ప్రపంచకప్‌కు ఎంపిక చేశారు. ఈ నిర్ణయం ఎంత చారిత్రక తప్పిదమో 2003 ఫైనల్స్ పరాజయం నిరూపించింది. సెలక్షన్ కమిటీ చేసిన దారుణ తప్పిదంలో అది మొదటగా చెప్పుకోవాలి. ఆ తర్వాత 2019 ప్రపంచకప్ సెలక్షన్ వస్తుంది. స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్, తెలుగు తేజం అంబటి రాయుడిని కాదని బౌలింగ్ చేయగలడనే కారణంతో విజరు శంకర్‌ను ఎంపిక చేశారు. టాప్ ఆర్డర్ విఫలమైన చోట కీలక భాగస్వామ్యాలు నిర్మించాలి. బౌలర్లకు ఎదురొడ్డి వికెట్ల పతనాన్ని అడ్డుకోవాలి. ఇది స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ కళ. ఆల్‌రౌండర్ల నుంచి ఇటువంటి ప్రదర్శన ఆశించటంలో తప్పు లేదు కానీ, వారు అక్కడ మెరవటం అత్యంత అరుదు. భారత్ విషయంలోనూ ఇదే జరిగింది.
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ కుప్పకూలినా.. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ నిలిచి మంచి స్కోర్లు సాధించారు. వెస్టిండీస్‌తో ఆస్ట్రేలియా, విండీస్‌పై న్యూజిలాండ్ మ్యాచులను ఇక్కడ ప్రస్తుతించాలి. ఇక్కడ ఆసీస్, కివీస్ టాప్ ఆర్డర్లు స్వల్ప స్కోర్లకు నిష్క్రమించినా.. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ భారీ స్కోర్లు సాధించారు. జట్లను విజయ పథంలో నడిపించారు. సెమీఫైనల్స్ వరకూ భారత్‌కు ఈ అవసరం రాలేదు. భారత్‌తో మ్యాచ్‌లో అన్ని జట్లూ ఒకే వ్యూహంతో బరిలోకి దిగాయి. బలమైన టాప్ ఆర్డర్‌ను వీలైనంత త్వరగా వెనక్కి పంపించటం, బలహీన మిడిల్ ఆర్డర్‌ను తొక్కిపడేయటం. న్యూజిలాండ్ సెమీఫైనల్లో ఈ వ్యూహం పక్కాగా అమలు చేసింది. ఐదు పరుగులకే భారత టాప్ ఆర్డర్ (రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లి)ను పెవిలియన్‌కు చేర్చి మానసికంగా పైచేయి సాధించింది.
ప్రపంచకప్ జట్టులో నం.4గా తొలుత విజరు శంకర్ అనుకున్నా.. కెఎల్ రాహుల్ ఆ స్థానంలో ఆడాడు. విజరు, ధావన్ గాయంతో నం.4లో యువ రిషబ్ పంత్ వచ్చాడు. రిషబ్ పంత్ కఠిన సమయంలో అనవసర షాట్ ఆడి వికెట్ కోల్పోయాడు. అప్పటివరకూ పంత్ కివీస్ బౌలర్లపై మెరుగ్గా కనిపించాడు. ఇక్కడ పంత్, కార్తీక్ విఫలయ్యారని సెలక్షన్‌పై విమర్శ చేయటం కాదు. 2015 ప్రపంచకప్ తర్వాత నం.4 స్థానంలో భారత్ 12 మంది ఆటగాళ్లను పరీక్షించింది. యువరాజ్ సింగ్ వదిలేసిన ఆ స్థానంలో మరోసారి అతడిని ప్రయోగించినా, పూర్వ వైభవం చాటలేదు. సురేశ్ రైనా, అజింక్య రహానె, మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్, అంబటి రాయుడు, రిషబ్ పంత్, యువరాజ్ సింగ్, కెఎల్ రాహుల్, విజరు శంకర్లు నం.4 కోసం పోటీపడిన కీలక ఆటగాళ్లు. వీళ్లలో అంబటి రాయుడు 47 సగటుతో పరుగులు చేసి మెప్పిం చాడు. ప్రపంచకప్ ముందు వరకూ ఆ స్థానం అతడిదే అనుకున్నాం. కానీ ఆఖరు నిమిషంలో సెలక్షన్ కమిటీ విజరు శంకర్‌ను ఎంపిక చేసింది. భారత బ్యాటింగ్ లైనప్‌లో కీలక నాల్గో స్థానం భర్తీ చేయాలని దీర్ఘకాలిక ప్రణాళిక ఉన్నప్పటికీ.. సెలక్షన్ కమిటీ ఆ పని చేయలేదు. నం.4 స్థానంలో అతి తక్కువ అవకాశాలు పొందిన విజరు శంకర్, రిషబ్ పంత్‌లను ఎంపిక చేసింది. యువ ఆటగాడిగా రిషబ్ పంత్‌ను ప్రపంచకప్‌లో నం.4గా ఆడించాలనే ఆలోచన ఉంటే, అతడికే ఎక్కువ అవకాశాలు ఇచ్చి ఉండాల్సింది. అను భవంతో కూడిన పంత్, సెమీస్‌లో కచ్చితంగా స్పిన్నర్‌పై ఆ సమయంలో అటువంటి షాట్ కచ్చితంగా ఆడి ఉండేవాడు కాదని చెప్పవచ్చు.
2003 ప్రపంచకప్‌కు ముందు న్యూజిలాం డ్తో సిరీస్‌కు భారత జట్టులో దినేశ్ మోంగియా లేడు. 2019 ప్రపంచకప్‌కు ముందు నం.4 రేసులో రిషబ్ పంత్, విజరు శంకర్ లేరు. పంత్‌కు అవకాశం ఇవ్వకపోయినా, భవిష్యత్ ప్రణాళిక దృష్ట్యా ప్రపంచకప్ తర్వాత ఆ స్థానంలో అతడినే ఆడిస్తారని అనుకున్నాం. కానీ స్పష్టమైన ప్రణాళిక, విజన్ లోపించిన సెలక్షన్ కమిటీ ప్రతిష్టాత్మక ప్రపంచకప్‌లో నం.4పై ప్రయోగాలు చేసింది. ఇతర జట్లలో స్టీవ్ స్మిత్, ఇయాన్ మోర్గాన్, రాస్ టేలర్, హెట్‌మయర్‌లు నం.4లో బహుముఖ పాత్ర పోషించారు. కానీ భారత్ ప్రపంచకప్ వేదికగా నం.4లో కెఎల్ రాహుల్, విజరు శంకర్, రిషబ్ పంత్‌లతో ప్రయోగాలు చేసింది. అంబటి రాయుడు సెమీఫైనల్లో ఆడుంటే, భారత్ గెలుస్తుం దని చెప్పలేం. కానీ అక్కడ అనుభవం ఉన్న ఓ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ ఆడితే గెలుపు అవకాశాలు ఎప్పుడూ మెరుగ్గానే ఉంటాయి. మ్యాచ్ ఫలితాన్ని కచ్చితంగా ప్రభావితం చేయగలడు. అందులో ఒక్క ఇన్నింగ్స్‌లో టాప్ ఆర్డర్ విఫలం కాగానే, అది ప్రపంచకప్ నుంచి భారత్ వైదొలిగేలా చేసింది. 2003, 2019 ఎంపిక అనుభవం నుంచైనా బీసీసీఐ పాఠాలు నేర్చుకోవాలి. పార్ట్‌టైమ్ బౌలింగ్ కారణంతో మరో నాణ్యమైన బ్యాట్స్‌మన్‌ను వదలు కుని, ప్రపంచకప్‌కు దూరం కాకూడదనే ఆశిద్దాం.