Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచకప్ ఫైనల్లో టైటిల్ ఫేవరెట్
- సెమీస్‌లో ఆసీస్‌పై ఘన విజయం
- జేసన్ రాయ్, వోక్స్, ఆర్చర్ మెరుపులు
- తొలిసారి సెమీస్‌లో ఓడిన ఆస్ట్రేలియా
బర్మింగ్‌హామ్: క్రికెట్ ప్రపంచకప్ కొత్త చాంపియన్‌ను చూడబోతుంది. టైటిల్ ఫేవరెట్, ఆతిథ్య ఇంగ్లాండ్ సుదీర్ఘ విరామం (1992) తర్వాత తొలిసారి ప్రపంచకప్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఆదివారం లార్డ్స్‌లో జరిగే ఫైనల్లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ పోటీపడనున్నాయి. ఈ రెండు జట్లలో ఎవరు గెలిచినా, ప్రపంచకప్‌లో చరిత్రే కానుంది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ఇప్పటివరకూ ప్రపంచకప్ విజయం సాధించలేదు. బర్మింగ్‌హామ్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ తిరుగులేని విజయం సాధించింది. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తు చేసి 8 వికెట్ల తేడాతో భారీ విజయం సొంతం చేసుకుంది. ఓపెనర్ జేసన్ రాయ్ (85, 65 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లు), జో రూట్ (49 నాటౌట్, 46 బంతుల్లో 8 ఫోర్లు), ఇయాన్ మోర్గాన్ (45 నాటౌట్, 39 బంతుల్లో 8 ఫోర్లు) ధనాధన్‌తో 224 పరుగుల ఛేదనను మరో 107 బంతులు ఉండగానే ఇంగ్లాండ్ ఊదేసింది. పేసర్లు క్రిస్ వోక్స్ (3/20), జోఫ్రా ఆర్చర్ (2/32), స్పిన్నర్ ఆదిల్ రషీద్ (3/54) విజృంభణతో తొలుత ఆస్ట్రేలియా 223 పరుగులకే కుప్పకూలింది. స్టీవ్ స్మిత్ (85, 119 బంతుల్లో 6 ఫోర్లు), అలెక్స్ కేరీ (46, 70 బంతుల్లో 4 ఫోర్లు) రాణించారు. ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్‌ను కకావికలం చేసిన క్రిస్ వోక్స్ ' మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' గా నిలిచాడు. ప్రపంచకప్‌లో ఎనిమిది సెమీఫైనల్స్‌లో ఆస్ట్రేలియా ఓటమిపాలవటం ఇదే తొలిసారి కావటం విశేషం. జులై 14న, లార్డ్స్‌లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ప్రపంచకప్ కోసం పోటీపడనున్నాయి.
జేసన్ దంచేశాడు : లక్ష్యం 224 పరుగులే. బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లాండ్ భీకర రికార్డు. అయినా, తొలి సెమీస్ అనుభవం నేపథ్యంలో ఇంగ్లాండ్ విజయం అంత సులువు కాదనిపించింది. స్టార్క్, కమిన్స్‌లు ఇబ్బంది పెట్టగలరనే అంచనా నెలకొంది. ఇంగ్లాండ్ ఓపెనర్లు జేసన్ రాయ్ (85), జానీ బెయిర్‌స్టో (34) అంచనాలను తలకిందులు చేశారు. ధనాధన్ ఆటతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. బెయిర్‌స్టో నెమ్మదిగా ఆడినా, రారు చెలరేగాడు. ఏడు ఫోర్లు, 2 సిక్సర్లతో 50 బంతుల్లో అర్ధ సెంచరీ బాదాడు రారు. స్టీవ్ స్మిత్ వేసిన ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లతో విశ్వరూపం చూపించాడు. మూడో సిక్సర్‌ను ఏకంగా మైదానం ఆవలకు పంపించాడు. సెంచరీ దిశగా దూసుకెళ్తోన్న రారు వివాదాస్పద నిర్ణయానికి బలయ్యాడు. అంతకముందే బెయిర్‌స్టోను స్టార్క్ అవుట్ చేశాడు. తొలి వికెట్‌కు 124 పరుగులు జోడించిన ఓపెనర్లు ఇంగ్లాండ్ విజయాన్ని ఖాయం చేశారు. జో రూట్ (49 నాటౌట్), ఇయాన్ మోర్గాన్ (45 నాటౌట్) ఎనిమిదేసి ఫోర్లతో కదం తొక్కారు. మూడో వికెట్‌కు అజేయంగా 79 పరుగులు జోడించారు. 32.1 ఓవర్లలోనే ఛేదనను ముగించారు.
నిప్పులు చెరిగిన వోక్స్,ఆర్చర్ : టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు ఇంగ్లాండ్ పేసర్లు చుక్కలు చూపించారు. ఇన్నింగ్స్ ఏడో బంతికే కెప్టెన్ అరోన్ ఫించ్ (0) ఆర్చర్ బంతికి ఎల్బీగా అవుటవగా.. ప్రమాదకర ఓపెనర్ డెవిడ్ వార్నర్ (9) క్రిస్ వోక్స్ బంతికి స్లిప్స్‌లో దొరికిపోయాడు. ప్రపంచకప్ అరంగేట్ర ఆటగాడు హ్యాండ్స్కాంబ్ (4)ను వోక్స్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 14/3తో కంగారూ కష్టాల్లో కూరుకుంది. ఈ దశలో స్టీవ్ స్మిత్ (85), అలెక్స్ కేరీ (46) 103 పరుగుల భాగస్వామ్యంతో ఆసీస్‌ను నిలబెట్టారు. స్టోయినిస్ (0), మాక్స్వెల్ (22) విఫలమయ్యారు. ఆఖర్లో మిచెల్ స్టార్క్ (29) రాణించటంతో ఆస్ట్రేలియా 223 పరుగులు చేయగల్గింది. మెరుపు డైరెక్ట్ త్రో తో స్మిత్‌ను రనౌట్ చేసిన బట్లర్.. డెత్ ఓవర్లలో ఆసీస్ వేగానికి అడ్డుకట్ట వేశాడు. 49 ఓవర్లలో ఆసీస్ 223 పరుగులకు కుప్పకూలింది.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ : డెవిడ్ వార్నర్ (సి) బెయిర్‌స్టో (బి) క్రిస్ వోక్స్ 9, అరోన్ ఫించ్ (ఎల్బీ) ఆర్చర్ 0, స్టీవ్ స్మిత్ (రనౌట్) జోశ్ బట్లర్ 85, పీటర్ హ్యాండ్స్కాంబ్ (బి) క్రిస్ వోక్స్ 4, అలెక్స్ కేరీ (సి) విన్సె (బి) రషీద్ 46, మార్కస్ స్టోయినిస్ (ఎల్బీ) రషీద్ 0, మాక్స్వెల్ (సి) మోర్గాన్ (బి) ఆర్చర్ 22, పాట్ కమిన్స్ (సి) రూట్ (బి) రషీద్ 6, మిచెల్ స్టార్క్ (సి) బట్లర్ (బి) క్రిస్ వోక్స్ 29, జేసన్ బెహ్రాన్‌డార్ఫ్ (బి) మార్క్‌వుడ్ 1, నాథన్ లైయాన్ నాటౌట్ 5, ఎక్స్‌ట్రాలు : 16, మొత్తం : (49 ఓవర్లలో ఆలౌట్) 223.
వికెట్ల పతనం : 1-4, 2-10, 3-14, 4-117, 5-118, 6-157, 7-166, 8-217, 9-217, 10-223.
బౌలింగ్ : క్రిస్ వోక్స్ 8-0-20-3, జోఫ్రా ఆర్చర్ 10-0-32-2, బెన్ స్టోక్స్ 4-0-22-0, మార్క్‌వుడ్ 9-0-45-1, లియాం ఫ్లంకెట్ 8-0-44-0, ఆదిల్ రషీద్ 10-0-54-3.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ : జేసన్ రాయ్ (సి) అలెక్స్ కేరీ (బి) పాట్ కమిన్స్ 85, జానీ బెయిర్‌స్టో (ఎల్బీ) స్టార్క్ 34, జో రూట్ నాటౌట్ 49, ఇయాన్ మోర్గాన్ నాటౌట్ 45, ఎక్స్‌ట్రాలు : 13, మొత్తం : (32.1 ఓవర్లలో 2 వికెట్లకు) 226.
వికెట్ల పతనం : 1-124, 2-147.
బౌలింగ్ : జేసన్ బెహ్రాన్‌డార్ఫ్ 8.1-2-38-0, మిచెల్ స్టార్క్ 9-0-70-1, పాట్ కమిన్స్ 7-0-34-1, నాథన్ లైయాన్ 5-0-49-0, స్టీవ్ స్మిత్ 1-0-21-0, మార్కస్ స్టోయినిస్ 2-0-13-0.