Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంగ్లీష్ జట్టుకు ఇది నాల్గో టైటిల్ పోరు
- 1979, 1987,1992 లో విఫలం
నవతెలంగాణ క్రీడా విభాగం
ప్రపంచానికి క్రికెట్ పరిచయం చేసిన దేశం. క్రికెట్ అక్కడే పుట్టింది. జెంటిల్మెన్ గేమ్‌గా అక్కడి నుంచే ప్రాచుర్యం పొందింది. 44 ఏండ్ల ఐసీసీ ప్రపంచకప్ చరిత్రలో విజేత జాబితాలో ఆ జట్టు లేదు. ఆ జట్టు మరేదో కాదు ఇంగ్లాండ్. గత 11 ప్రపంచకప్‌లలో ఇంగ్లాండ్ మూడు సార్లు టైటిల్ పోరుకు చేరుకుంది. కానీ ఎన్నడూ చాంపియన్‌గా నిలువలేదు. 1992లో చివరగా ఫైనల్స్‌కు చేరుకున్న ఇంగ్లాండ్... అప్పట్నుంచి మళ్లీ ప్రపంచకప్‌లో సెమీఫైనల్స్ గడప తొక్కలేదు. గ్రూప్ దశలోనే నిష్క్రమించి, పేలవ ప్రదర్శన కొనసాగించింది. సుదీర్ఘ విరామం తర్వాత సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ టైటిల్ ఫేవరెట్‌గా నిలిచింది. వన్డే క్రికెట్లో పరుగుల వరద పారించి, వరల్డ్ నం.1 ర్యాంక్ అట్టిపెట్టుకుని.. తొలి బంతి నుంచీ చివరి బంతి వరకూ బాదుడుతో ప్రత్యర్థిని భయపెట్టిన జట్టు మోర్గాన్‌సేన. చరిత్రలో మరే ఇంగ్లాండ్ జట్టుకు దక్కని అవకాశం ప్రస్తుతం మోర్గాన్ బృందానికి లభించింది. సొంత అభిమానుల నడుమ అండర్డాగ్ న్యూజిలాండ్‌తో ఇంగ్లాండ్ టైటిల్ వేట కొనసాగించనుంది. భీకర ఫామ్‌లో ఉన్న ఇంగ్లాండ్ ఈసారైనా కప్పు కొడుతుందా? గతంలో మూడు సార్లు వదిలేసినట్టే అవకాశం జారవిడుస్తుందా? ఆసక్తికరం. ఆదివారం ప్రపంచకప్ ఫైనల్స్ నేపథ్యంలో ఇంగ్లాండ్ ఓడిన గత మూడు ప్రపంచకప్ ఫైనల్స్‌ను ఓ సారి చూద్దాం. అన్నట్టు న్యూజిలాండ్ సైతం 2015 ప్రపంచకప్ ఫైనల్లోకి ప్రవేశించినా, ఆసీస్‌కు టైటిల్ కోల్పోయింది. ప్రపంచకప్ 2019లో కొత్త చాంపియన్‌ను చూడబోతుంది.
ఇమ్రాన్ ఖాన్ మేనియా : అనూహ్యంగా ఫైనల్లోకి ప్రవేశించిన పాకిస్థాన్, టైటిల్ పోరులో ఫేవరెట్ ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది. కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ (72), జావెద్ మియాందాద్ (58) అర్థ సెంచరీలతో తొలుత పాకిస్థాన్ 249/6 పరుగులు చేసింది. ఊరించే ఛేదనలో ఇంగ్లాండ్ 227 పరుగులకే కుప్పకూలింది. స్వింగ్ మాస్టర్ వసీం అక్రమ్ వరుస బంతుల్లో రెండు వికెట్లు కూల్చి ఇంగ్లాండ్ ఛేదనను చిధ్రం చేశాడు. అక్రమ్ (3/49), జావెద్ అకిబ్ (2/27), ముస్తాక్ అహ్మద్ (3/41) వికెట్ల వేటలో నిప్పులు చెరిగారు. 22 పరుగుల తేడాతో గెలుపొందిన పాకిస్థాన్ తొలిసారి ప్రపంచకప్ విజేతగా అవతరించింది.
రిచర్డ్స్ చెలరేగాడు : 1979 ప్రపంచకప్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ అంచనాల అందుకుంది. ఫైనల్లో ఇంగ్లాండ్‌ను ఓడించి రెండో సారి ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 286/9 పరుగుల భారీ స్కోరు సాధించింది. విధ్వంసక బ్యాట్స్‌మన్ వీవ్ రిచర్డ్స్ (138) 11 ఫోర్లు, 3 సిక్సర్లతో శివమెత్తాడు. కొలిస్ కింగ్ (86) పది ఫోర్లు, 3 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ప్రమాదకర విండీస్ బౌలింగ్‌పై రికార్డు ఛేదనలో ఇంగ్లాండ్ 194 పరుగులకే చేతులెత్తేసింది. జో గార్నెర్ (5/38), క్రొఫ్ట్ (3/42), హౌల్డింగ్ (2/16) ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ నడ్డి విరిచారు. 92 పరుగుల తేడాతో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ పోటీపడిన తొలి ఫైనల్స్ ఇదే.
కంగారూ కొట్టేసింది : 1987 సెమీఫైనల్లో ఆతిథ్య భారత్‌పై విజయం సాధించి భారతీయుల ఆశలను ఆవిరి చేసిన ఇంగ్లాండ్.. ఈడెన్ గార్డెన్స్‌లో విజయం ఖాయం చేసుకున్నట్టే కనిపించింది. ఛేదనలో గెలుపు తీరాల వరకూ వచ్చేసింది. ఆఖర్లో బోల్తా కొట్టిన ఇంగ్లాండ్.. రెండో ప్రయత్నంలో ప్రపంచకప్ అందుకోలేదు. బూన్ (75) అర్ధ సెంచరీతో తొలుత ఆస్ట్రేలియా 253/5 పరుగులు చేసింది. ఛేదనలో గూచ్ (35), గాటింగ్ (41), బిల్ (58) మెరిశారు. గాటింగ్ ఓ చెత్త షాట్‌తో వికెట్ కోల్పోగా.. ఇంగ్లాండ్ విజయావకాశాలు దెబ్బతిన్నాయి. 246 పరుగుల వద్ద ఆగిపోయిన ఇంగ్లాండ్ 7 పరుగుల తేడాతో వరల్డ్‌కప్‌ను వదులుకుంది.
ఇంగ్లాండ్ ప్రపంచకప్ ఫైనల్స్‌కు చేరిన మూడు సార్లూ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసింది. ఛేదనలో వెస్టిండీస్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌లు ఇంగ్లాండ్‌ను చిత్తు చేశాయి. మోర్గాన్ నాయకత్వంలో ఛేదనలో ఇంగ్లాండ్ భయానకం. ఆదివారం లార్డ్స్‌లో ఛేదించి చరిత్రను తిరగరాస్తారా? లేదా తొలుత బ్యాటింగ్ చేసి కొత్త చరిత్ర సృష్టిస్తారా? ఆసక్తికరం.