Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫైనల్లో సెరెనాకు భంగపాటు
- నేడు జకోవిచ్, ఫెడరర్ టైటిల్ ఫైట్
- వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ 2019
లండన్ (ఇంగ్లాండ్) : 2018 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్స్. జర్మనీ భామ ఎంజెలిక్ కెర్బర్ అడ్డుపడింది. అదే ఏడాది యు.ఎస్ ఓపెన్ ఫైనల్స్ నవొమి ఒసాక నిలువరించింది. 2019 వింబుల్డన్ టైటిల్ ఫోరు. ఈసారి రోమానియా భామ సిమోన హలెప్ చేతిలో భంగపడింది. ఆల్‌టైమ్ రికార్డు 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ వేటలో దిగ్గజ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ (అమెరికా) పరాభవాలు ఇవి. వింబుల్డన్‌లో మరో టైటిల్‌తో మార్గరెట్ కోర్టు (24) రికార్డు సమం చేయాలని ఆశించిన సెరెనా విలియమ్స్‌కు శనివారం నాటి ఫైనల్లో భంగపాటు ఎదురైంది. 59 నిమిషాల్లోనే వరుస సెట్లలో 6-2, 6-2తో సెరెనాపై నెగ్గిన సిమోన హలెప్ తొలిసారి వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచింది. హలెప్ కెరీర్లో ఇది రెండో గ్రాండ్‌స్లామ్ విజయం. వింబుల్డన్ సింగిల్స్ చాంపియన్‌గా నిలిచిన తొలి రోమానియా ప్లేయర్ హలెప్ కావటం విశేషం.
సూపర్ సిమోన : శనివారం నాటి మహిళల సింగిల్స్ ఫైనల్స్ ముందు సెరెనాతో సిమోన హలెప్ ముఖాముఖి రికార్డు 1-9. ఐదేండ్ల క్రితం ఓ టోర్నీ గ్రూప్ (నాకౌట్ కాదు) మ్యాచ్‌లో సెరెనాపై నెగ్గింది. గడ్డి కోర్టుపై తిరుగులేని జోరు చూపించే సెరెనాపై హలెప్ విజయం అసాధ్యమని తేల్చేశారు. కానీ అంతిమ పోరులో సెరెనా ఒత్తిడిని సద్వినియోగం చేసుకున్న హలెప్ అద్భుత విజయం సాధించింది. 6-2, 6-2తో వరుస సెట్లలో సెరెనాకు షాకిచ్చింది. 26 అనవసర తప్పిదాలకు పాల్పడిన సెరెనా భారీ మూల్యం చెల్లించుకుంది. సెరెనా తన సర్వ్‌లో 4 గేములే నెగ్గగా.. హలెప్ 8 గేములు గెల్చుకుంది. పాయింట్ల పరంగానూ 38-5త5తో హలెప్ కంటే వెనుకంజలో నిలిచింది. సెమీఫైనల్స్ వరకూ ఎదురులేని ప్రదర్శన కనబర్చిన సెరెనా విలియమ్స్, ఆఖరి మెట్టుపై మరోసారి బోల్తా పడింది. ఓ బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం, ప్రాణాంతక సమస్యలు ఎదుర్కొన్న సెరెనా తిరిగి టెన్నిస్ రాకెట్ అందుకుంది. ప్రసవానంతరం మూడు గ్రాండ్‌స్లామ్ ఫైనల్లోకి ప్రవేశించినా.. ఒక్క విజయమూ సాధించలేదు. ఆల్‌టైమ్ రికార్డు టైటిల్ కోసం సెరెనా.. యు.ఎస్ ఓపెన్ వరకూ వేచి చూడక తప్పదు.
జకో, రోజర్ : మెన్స్ సింగిల్స్‌లో మెగా ఫైట్ నేడే. గ్రాస్ కోర్టు స్టార్స్ రోజర్ ఫెడరర్, నొవాక్ జకోవిచ్ వింబుల్డన్ టైటిల్ కోసం పోటీపడనున్నారు. వింబుల్డన్‌లో రోజర్ 9వ టైటిల్‌పై, జకోవిచ్ 5వ టైటిల్‌పై కన్నేసి బరిలోకి దిగుతున్నారు. 37 ఏండ్ల ఫెడరర్‌తో గత పది మ్యాచుల్లో 8 నెగ్గిన జకోవిచ్ డిఫెండింగ్ చాంపియన్‌గా ఫేవరెట్‌గా కనిపిస్తున్నాడు. కానీ స్విస్ యోధుడు ఫెడరర్ వింబుల్డన్‌లో ఎవరినైనా ఓడించగలడు. నేడు సాయంత్రం 6.30 గంటలకు ఫైనల్స్ ఆరంభం.