Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టైటిల్ పోరులో స్కోర్లు సమం
- ఛేదనలో స్టోక్స్ వీరోచిత పోరాటం
- ఇంగ్లాండ్ 240/9, న్యూజిలాండ్ 240/9
లార్డ్స్ (లండన్)
ప్రపంచకప్ ఫైనల్ రసవత్తరంగా సాగుతోంది. న్యూజిలాండ్ నిర్దేశించిన 241 పరుగుల ఛేదనలో ఇంగ్లాండ్ 240 పరుగులు చేసింది. నిర్ణీత ఓవర్లలో ఇరు జట్ల స్కోర్లు సమం అయ్యాయి. సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయించనున్నారు.
ఆరంభం పేలవం : ప్రపంచకప్ అందుకునేందుకు ఇంగ్లాండ్ చేయాల్సిన పరుగులు 241 పరుగులు. సెమీస్‌లో ఆసీస్‌ను ఛేదనలో చిత్తు చేసిన ఇంగ్లాండ్, లార్డ్స్‌లోనూ అదే ప్రదర్శన పునరావృతం చేస్తుందని అనిపించింది. న్యూజిలాండ్ పేసర్లు గొప్పగా రాణించటంతో ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ ఇబ్బంది పడింది. ఇన్నింగ్స్ తొలి బంతికే ఎల్బీ ప్రమాదం నుంచి బయటపడిన జేసన్ రారు (17) మూడు ఫోర్లతో దూకుడుగా ఆడినా.. వికెట్ నిలుపుకోలేదు. మాట్ హెన్రీ ఓవర్లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రారు నిష్క్రమణ తర్వాత ఇంగ్లాండ్ మరింత రక్షణాత్మకంగా ఆడింది. న్యూజిలాండ్‌పై గత మూడు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు సాధించిన జానీ బెయిర్‌స్టో (36, 55 బంతుల్లో 7 ఫోర్లు) క్రీజులో స్వేచ్ఛగా ఆడలేకపోయాడు. 30 బంతుల్లో 7 పరుగులే చేసిన జో రూట్ అసహజ రీతిలో హిట్టింగ్‌కు వెళ్లాడు. గ్రాండ్‌హౌమ్ ఉచ్చులో పడి వికెట్ కోల్పోయాడు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (9) కథా ఇదే!. 22 బంతులాడిన మోర్గాన్ దూకుడుగా ఆడలేదు. ఫెర్గుసన్ కండ్లుచెదిరే క్యాచ్‌తో అతడి కథా ముగిసింది. ఫెర్గుసన్ బంతిని వికెట్ల మీదకు ఆడుకున్న బెయిర్‌స్టో పెవిలియన్‌కు చేరాడు. 86/4తో ఇంగ్లాండ్ కష్టాల్లో కూరుకుపోయింది. రెండు వైపులా పేసర్లను ప్రయోగించిన విలియమ్సన్ ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచాడు. డాట్ బాల్స్ బ్యాట్స్‌మెన్ సహనాన్ని పరీక్షించాయి. 30 ఓవర్ల తర్వాత గానీ కివీస్ స్పిన్నర్‌ను రంగంలోకి దించలేదు. గ్రాండ్‌హౌమ్ సింగిల్ స్పెల్‌లో పది ఓవర్లు పూర్తి చేయటం గమనార్హం.
బట్లర్, బెన్ నిలబెట్టారు : కఠిన పరిస్థితుల్లో జట్టుకట్టిన జోశ్ బట్లర్, బెన్ స్టోక్స్ ఇంగ్లాండ్ ఛేదనను, ప్రపంచకప్ ఆశలను నిలబెట్టారు!. నిప్పులు చెరుగుతున్న న్యూజిలాండ్ సీమర్ల మంచి బంతులను గౌరవించిన బట్లర్, స్టోక్స్.. భారీ షాట్లకు వెళ్లలేదు. ఎక్కువగా వికెట్ల మధ్య పరుగుకే మొగ్గు చూపారు. దీంతో సాధించాల్సిన రన్‌రేట్ సైతం అందుబాటులోనే నిలిచింది. ఐదో వికెట్‌కు 100 ప్లస్ భాగస్వామ్యం నమోదు చేసిన జోడీ.. 20 ఓవర్లకు పైగా వికెట్ల పతనాన్ని అడ్డుకుంది. బౌల్ట్పై బౌండరీతో 53 బంతుల్లో బట్లర్ అర్ధ సెంచరీ సాధించగా, అదే ఓవర్లో సింగిల్‌తో స్టోక్స్ 80 బంతుల్లో ఫిఫ్టీ అందుకున్నాడు. ఆరు ఫోర్లతో మెరిసిన బట్లర్, భారీ షాట్‌కు ప్రయత్నించి 45వ ఓవర్లో పెవిలియన్‌కు చేరుకున్నాడు. సబ్‌స్టిట్యూట్ ఆటగాడు టిమ్ సౌథి మెరుపు క్యాచ్‌తో బట్లర్‌ను వెనక్కి పంపించాడు. క్రిస్ వోక్స్ (2) సైతం ఫెర్గుసన్ ఓవర్లోనే వికెట్ కోల్పోయాడు. వరుస వికెట్లతో ఫెర్గుసన్ న్యూజిలాండ్‌ను తిరిగి రేసులోకి తీసుకొచ్చాడు.
రాణించిన నికోల్స్, లేథమ్ : పచ్చికతో కూడిన లార్డ్స్ పిచ్‌పై టాస్ నెగ్గిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పవర్‌ప్లేలో ఇంగ్లీష్ సీమర్లు కట్టుదిట్టంగా బంతులేశారు. ఇన్నింగ్స్ ఐదో బంతికి బౌండరీ బాదిన గప్టిల్ (19) క్రీజులో సౌకర్యవంతంగా కనిపించాడు. జోఫ్రా ఆర్చర్ ఓవర్లో థర్డ్‌మ్యాన్ మీదుగా సిక్సర్ బాదిన గప్టిల్, మరో స్ట్రయిట్ బౌండరీ కొట్టాడు. వోక్స్ ఓవర్లో హెన్రీ నికోల్స్ (55) ఎల్బీ నిర్ణయంపై సమీక్ష కోరిన నికోల్స్ జోరు కొనసాగించాడు. మెరుగ్గా కనిపించిన గప్టిల్.. ఏడో ఓవర్లో వెనుదిరగాడు. వోక్స్ అతడిని ఎల్బీగా అవుట్ చేశాడు. 29 పరుగులకు కివీస్ తొలి వికెట్ కోల్పోయింది. బౌలర్లు మెరుస్తున్న వేళ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (30, 53 బంతుల్లో 2 ఫోర్లు)తో కలిసి నికోల్స్ కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. రెండో వికెట్‌కు ఈ జోడీ 74 పరుగులు జోడించింది. రెండు ఫోర్లతో సహజశైలిలో ఆడుతున్న విలియమ్సన్‌ను ఫ్లంకెట్ సాగనంపాడు. కచ్చితమైన లెంగ్త్‌తో వికెట్ల వెనకాల అవుట్ చేశాడు.నాలుగు ఫోర్లతో అర్ధ సెంచరీ సాధించిన నికోల్స్ ఆకట్టుకున్నాడు. ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ (15)ను మార్క్‌వుడ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. టేలర్ సమీక్ష కోరివుంటే, నాటౌట్‌గా నిలిచేవాడు. కానీ గప్టిల్ సమీక్ష వినియోగించుకోగా, న్యూజిలాండ్‌కు మరో సమీక్ష లేకపోయింది. అప్పటికి న్యూజిలాండ్ స్కోరు 141/4.
ఈ దశలో న్యూజిలాండ్ 200 లోపే ఆలౌటయ్యేలా కనిపించింది. వికెట్ కీపర్ టామ్ లేథమ్ (47, 56 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) కఠిన పరిస్థితుల్లో పరుగులు చేశారు. ప్రపంచకప్‌లో నిలకడగా విఫలమైన లేథమ్, కీలక ఫైనల్లో జట్టును ఆదుకున్నాడు. రెండు ఫోర్లు, ఓ సిక్సర్ బాదాడు. లోయర్ ఆర్డర్లో జేమ్స్ నీషమ్ (19), గ్రాండ్‌హౌమ్ (16)తో కలిసి స్కోరును ముందుకు నడిపించాడు. ఆరంభంలో నికోల్స్, చివర్లో లేథమ్ రాణించటంతో న్యూజిలాండ్ 241/8 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ పేసర్లు క్రిస్ వోక్స్ (3/37), లియాం ఫ్లంకెట్ (3/42) మెరిశారు. ఆర్చర్, మార్క్‌వుడ్ చెరో వికెట్ తీశారు. లార్డ్స్‌లో ఇంగ్లీష్ సీమర్లు ఎక్స్ట్రా బౌన్స్ కోసం ప్రయత్నించి నియంత్రణ కోల్పోయారు. 17 వైడ్లు సహా 30 పరుగులను అదనంగా సమర్పించుకున్నారు. పరుగులు చేయటం కష్టసాధ్యమైన పిచ్‌పై 30 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో కోల్పోవటం ఇంగ్లాండ్‌కు ప్రతికూలం.
స్కోరు వివరాలు :
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ : మార్టిన్ గప్టిల్ (ఎల్బీ) క్రిస్ వోక్స్ 19, హెన్రీ నికోల్స్ (బి) ఫ్లంకెట్ 55, కేన్ విలియమ్సన్ (సి) జోశ్ బట్లర్ (బి) ఫ్లంకెట్ 30, రాస్ టేలర్ (ఎల్బీ) మార్క్‌వుడ్ 15, టామ్ లేథమ్ (సి) విన్సె (బి) క్రిస్ వోక్స్ 47, జేమ్స్ నీషమ్ (సి) రూట్ (బి) ఫ్లంకెట్ 19, కొలిన్ డీ గ్రాండ్‌హౌమ్ (సి) విన్సె (బి) క్రిస్ వోక్స్ 16, మిచెల్ శాంట్నర్ నాటౌట్ 5, మాట్ హెన్రీ (బి) జోఫ్రా ఆర్చర్ 4, ట్రెంట్ బౌల్ట్ నాటౌట్ 1, ఎక్స్‌ట్రాలు : 30, మొత్తం : (50 ఓవర్లలో 8 వికెట్లకు) 241.
వికెట్ల పతనం : 1-29, 2-103, 3-118, 4-141, 5-173, 6-219, 7-232, 8-240.
బౌలింగ్ : క్రిస్ వోక్స్ 9-0-37-3, జోఫ్రా ఆర్చర్ 10-0-42-1, లియాం ఫ్లంకెట్ 10-0-42-3, మార్క్‌వుడ్ 10-1-49-1, ఆదిల్ రషీద్ 8-0-39-0, బెన్ స్టోక్స్ 3-0-20-0.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ : జేసన్ రారు (సి) లేథమ్ (బి) మాట్ హెన్రీ 17, జానీ బెయిర్‌స్టో (సి) ఫెర్గుసన్, ఇయాన్ మోర్గాన్ (సి) లాథమ్ (బి) గ్రాండ్‌హౌమ్ 7, ఇయాన్ మోర్గాన్ (సి) ఫెర్గుసన్ (బి) నీషమ్ 9, బెన్ స్టోక్స్ నాటౌట్ 84. జోశ్ బట్లర్ (సి) టిమ్ సౌథి (బి) లాకీ ఫెర్గుసన్ 59, క్రిస్ వోక్స్ (సి) లేథమ్ (బి) ఫెర్గుసన్ 2, లియాం ఫ్లంకెట్ (సి) బౌల్ట్ (బి) నీషమ్ 10, ఆర్చర్ (బి) నీషమ్ 0, రషీద్ రనౌట్ 0, మార్క్‌వుడ్ రనౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 17, మొత్తం : (50 ఓవర్లలో ఆలౌట్) 240.
వికెట్ల పతనం : 1-28, 2-59, 3-71, 4-86, 5-196, 6-203, 7-220, 8-227, 9-240, 10-241.
బౌలింగ్ : ట్రెంట్ బౌల్ట్ 10-0-67-0, మాట్ హెన్రీ 10-2-40-1, కొలిన్ డీ గ్రాండ్‌హౌమ్ 10-2-25-1, లాకీ ఫెర్గుసన్ 10-0-50-3, జేమ్స్ నీషమ్ 7-0-43-3, మిచెల్ శాంట్నర్ 3-0-11-0.