Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సూపర్ టైతో బౌండరీల తేడాతో కివీస్ ఓటమి
- ఛేదనలో బెన్ స్టోక్స్ వీరోచిత పోరాటం
- జోశ్ బట్లర్ అద్భుత ఇన్నింగ్స్
- న్యూజిలాండ్‌కు అనూహ్య భంగపాటు
లార్డ్స్ (లండన్)
- 1979 ప్రపంచకప్ ఫైనల్. ఇంగ్లాండ్ లక్ష్యం 289.ఛేదనలో ఇంగ్లీష్ జట్టు 194 పరుగులకే కుప్పకూలింది.
- 1987 వరల్డ్‌కప్ ఫైనల్. ఇంగ్లాండ్ లక్ష్యం 254. ఛేదనలో ఇంగ్లాండ్ 246 పరుగులకే కుప్పకూలింది.
- 1992 ప్రపంచకప్ ఫైనల్. ఇంగ్లాండ్ లక్ష్యం 250. ఛేదనలో ఇంగ్లాండ్ 227 పరుగులకే పరిమితమైంది.
- 2019 ప్రపంచకప్ విజయానికి ఇంగ్లాండ్ ముందున్న లక్ష్యం 241. లార్డ్స్‌లో ఇంగ్లాండ్ ఈసారి 240 పరుగులు చేసింది. ప్రపంచకప్‌ను నాల్గోసారి జారవిడచలేదు. సూపర్ ఓవర్ అద్భుతంతో సొంతం చేసుకుంది.
44 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఐసీసీ ప్రపంచకప్ తొలిసారి క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్ గూటికి చేరింది. 27 ఏండ్ల తర్వాత ప్రపంచకప్‌లో తొలి నాకౌట్ విజయం సాధించిన ఇంగ్లాండ్.. అదే ఊపులో వరల్డ్‌కప్‌నూ ముద్దాడింది. 50 ఓవర్ల ఆట ముగిసిన తర్వాత న్యూజిలాండ్, ఇంగ్లాండ్ 240 పరుగులతో సమవుజ్జీలుగా నిలిచాయి. సూపర్ ఓవర్లోనూ 15 పరుగులతో సమానంగా నిలిచాయి. కానీ బౌండరీల కొలమానంలో న్యూజిలాండ్ వెనుకబడింది. బౌండరీల తేడాతో ఇంగ్లాండ్ ప్రపంచకప్ విజేతగా అవతరించింది. వరుసగా రెండోసారి న్యూజిలాండ్‌కు టైటిల్ పోరులో భంగపాటు తప్పలేదు.
ఐసీసీ ప్రపంచకప్‌లో ఆతిథ్య హ్యాట్రిక్!. 2011లో భారత్, 2015లో ఆస్ట్రేలియా, 2019లో ఇంగ్లాండ్. గత మూడు ప్రపంచకప్‌లను ఆతిథ్య జట్లే సొంతం చేసుకున్నాయి. 2023 ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యమివ్వబోతుంది.
ఇంగ్లాండ్ సాధించింది. 44 ఏండ్ల నిరీక్షణకు తెరదించింది. క్రికెట్ పుట్టినింటికి ప్రపంచకప్‌ను తీసుకొచ్చింది. ఐసీసీ వరల్డ్‌కప్‌పై తొలి ఇంగ్లీష్ ముద్దు పెట్టింది. రసవత్తరంగా సాగిన ప్రపంచకప్ ఫైనల్లో ఆతిథ్య ఇంగ్లాండ్ చాంపియన్‌గా నిలిచింది. 50 ఓవర్ల ఆట, సూపర్ ఓవర్లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ సమవుజ్జీలుగా నిలువగా.. బౌండరీల తేడాతో ఇంగ్లాండ్ విజేతగా అవతరించింది. ఛేదనలో ఇంగ్లాండ్ 86/4 పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిది. జేసన్ రారు (17), జో రూట్ (7), ఇయాన్ మోర్గాన్ (9) నిరాశపరిచారు. బెన్ స్టోక్స్ (84 నాటౌట్, 98 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్ధ సెంచరీతో చెలరేగగా.. జోశ్ బట్లర్ (59, 60 బంతుల్లో 6 ఫోర్లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో రాణించాడు. ఈ జోడీ ఐదో వికెట్‌కు 110 పరుగులు జోడించి ఇంగ్లాండ్‌ను రేసులో నిలిపింది. ఆఖరి ఓవర్లో 14 పరుగులు చేసిన బెన్ స్టోక్స్ మ్యాచ్‌ను సూపర్ ఓవర్ వరకూ తీసుకెళ్లాడు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 240 పరుగులు చేసింది. ఓపెనర్ హెన్రీ నికోల్స్ (55, 77 బంతుల్లో 4 ఫోర్లు), టామ్ లేథమ్ (47, 56 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. కేన్ విలియమ్సన్ (30), రాస్ టేలర్ (15) అంచనాలు అందుకోలేదు. ఛేదనలో వీరోచిత ఇన్నింగ్స్ ఇంగ్లాండ్‌ను విజేతగా నిలిపిన బెన్ స్టోక్స్ 'మ్యాన్ ఆఫ్ ది ఫైనల్స్' గా నిలిచాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు దక్కించుకున్నాడు.
ఆరంభం పేలవం : ప్రపంచకప్ అందుకునేందుకు ఇంగ్లాండ్ చేయాల్సిన పరుగులు 241 పరుగులు. సెమీస్‌లో ఆసీస్‌ను ఛేదనలో చిత్తు చేసిన ఇంగ్లాండ్, లార్డ్స్‌లోనూ అదే ప్రదర్శన పునరావృతం చేస్తుందని అనిపించింది. న్యూజిలాండ్ పేసర్లు గొప్పగా రాణించటంతో ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ ఇబ్బంది పడింది. ఇన్నింగ్స్ తొలి బంతికే ఎల్బీ ప్రమాదం నుంచి బయటపడిన జేసన్ రారు (17) మూడు ఫోర్లతో దూకుడుగా ఆడినా.. వికెట్ నిలుపుకోలేదు. మాట్ హెన్రీ ఓవర్లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రారు నిష్క్రమణ తర్వాత ఇంగ్లాండ్ మరింత రక్షణాత్మకంగా ఆడింది. న్యూజిలాండ్‌పై గత మూడు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు సాధించిన జానీ బెయిర్‌స్టో (36, 55 బంతుల్లో 7 ఫోర్లు) క్రీజులో స్వేచ్ఛగా ఆడలేకపోయాడు. 30 బంతుల్లో 7 పరుగులే చేసిన జో రూట్ అసహజ రీతిలో హిట్టింగ్‌కు వెళ్లాడు. గ్రాండ్‌హౌమ్ ఉచ్చులో పడి వికెట్ కోల్పోయాడు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (9) కథా ఇదే!. 22 బంతులాడిన మోర్గాన్ దూకుడుగా ఆడలేదు. ఫెర్గుసన్ కండ్లుచెదిరే క్యాచ్‌తో అతడి కథా ముగిసింది. ఫెర్గుసన్ బంతిని వికెట్ల మీదకు ఆడుకున్న బెయిర్‌స్టో పెవిలియన్‌కు చేరాడు. 86/4తో ఇంగ్లాండ్ కష్టాల్లో కూరుకుపోయింది. రెండు వైపులా పేసర్లను ప్రయోగించిన విలియమ్సన్ ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచాడు. డాట్ బాల్స్ బ్యాట్స్‌మెన్ సహనాన్ని పరీక్షించాయి. 30 ఓవర్ల తర్వాత గానీ కివీస్ స్పిన్నర్‌ను రంగంలోకి దించలేదు. గ్రాండ్‌హౌమ్ సింగిల్ స్పెల్‌లో పది ఓవర్లు పూర్తి చేయటం గమనార్హం.
బట్లర్, బెన్ నిలబెట్టారు : కఠిన పరిస్థితుల్లో జట్టుకట్టిన జోశ్ బట్లర్, బెన్ స్టోక్స్ ఇంగ్లాండ్ ఛేదనను, ప్రపంచకప్ ఆశలను నిలబెట్టారు!. నిప్పులు చెరుగుతున్న న్యూజిలాండ్ సీమర్ల మంచి బంతులను గౌరవించిన బట్లర్, స్టోక్స్.. భారీ షాట్లకు వెళ్లలేదు. ఎక్కువగా వికెట్ల మధ్య పరుగుకే మొగ్గు చూపారు. దీంతో సాధించాల్సిన రన్‌రేట్ సైతం అందుబాటులోనే నిలిచింది. ఐదో వికెట్‌కు 100 ప్లస్ భాగస్వామ్యం నమోదు చేసిన జోడీ.. 20 ఓవర్లకు పైగా వికెట్ల పతనాన్ని అడ్డుకుంది. బౌల్ట్పై బౌండరీతో 53 బంతుల్లో బట్లర్ అర్ధ సెంచరీ సాధించగా, అదే ఓవర్లో సింగిల్‌తో స్టోక్స్ 80 బంతుల్లో ఫిఫ్టీ అందుకున్నాడు. ఆరు ఫోర్లతో మెరిసిన బట్లర్, భారీ షాట్‌కు ప్రయత్నించి 45వ ఓవర్లో పెవిలియన్‌కు చేరుకున్నాడు. సబ్‌స్టిట్యూట్ ఆటగాడు టిమ్ సౌథి మెరుపు క్యాచ్‌తో బట్లర్‌ను వెనక్కి పంపించాడు. క్రిస్ వోక్స్ (2) సైతం ఫెర్గుసన్ ఓవర్లోనే వికెట్ కోల్పోయాడు. వరుస వికెట్లతో ఫెర్గుసన్ న్యూజిలాండ్‌ను తిరిగి రేసులోకి తీసుకొచ్చాడు. ఆఖరి ఓవర్లో 15 పరుగులు చేయాల్సి ఉండగా.. బౌల్ట్ తొలి రెండు బంతులకు పరుగులేమి ఇవ్వలేదు. మూడో బంతిని స్టోక్స్ సిక్సర్ బాదగా.. నాల్గో బంతికి రెండు పరుగులు సహా అదనంగా నాలుగు పరుగులు లభించాయి (త్రో స్టోక్స్‌కు తగిలి బౌండరీకి వెళ్లింది). చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన స్థితిలో స్టోక్స్ సింగిల్ తీశాడు. రెండో పరుగు ప్రయత్నంలో మార్క్‌వుడ్ (0) రనౌట్ అయ్యాడు. నిర్ణీత ఓవర్లలో ఇంగ్లాండ్ కూడా 240 పరుగులే చేసింది. కివీస్‌తో సమవుజ్జీగా నిలిచింది.
రాణించిన నికోల్స్, లేథమ్ : పచ్చికతో కూడిన లార్డ్స్ పిచ్‌పై టాస్ నెగ్గిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పవర్‌ప్లేలో ఇంగ్లీష్ సీమర్లు కట్టుదిట్టంగా బంతులేశారు. ఇన్నింగ్స్ ఐదో బంతికి బౌండరీ బాదిన గప్టిల్ (19) క్రీజులో సౌకర్యవంతంగా కనిపించాడు. జోఫ్రా ఆర్చర్ ఓవర్లో థర్డ్‌మ్యాన్ మీదుగా సిక్సర్ బాదిన గప్టిల్, మరో స్ట్రయిట్ బౌండరీ కొట్టాడు. వోక్స్ ఓవర్లో హెన్రీ నికోల్స్ (55) ఎల్బీ నిర్ణయంపై సమీక్ష కోరిన నికోల్స్ జోరు కొనసాగించాడు. మెరుగ్గా కనిపించిన గప్టిల్.. ఏడో ఓవర్లో వెనుదిరగాడు. వోక్స్ అతడిని ఎల్బీగా అవుట్ చేశాడు. 29 పరుగులకు కివీస్ తొలి వికెట్ కోల్పోయింది. బౌలర్లు మెరుస్తున్న వేళ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (30, 53 బంతుల్లో 2 ఫోర్లు)తో కలిసి నికోల్స్ కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. రెండో వికెట్‌కు ఈ జోడీ 74 పరుగులు జోడించింది. రెండు ఫోర్లతో సహజశైలిలో ఆడుతున్న విలియమ్సన్‌ను ఫ్లంకెట్ సాగనంపాడు. కచ్చితమైన లెంగ్త్‌తో వికెట్ల వెనకాల అవుట్ చేశాడు.నాలుగు ఫోర్లతో అర్ధ సెంచరీ సాధించిన నికోల్స్ ఆకట్టుకున్నాడు. ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ (15)ను మార్క్‌వుడ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకు న్నాడు. టేలర్ సమీక్ష కోరివుంటే, నాటౌట్‌గా నిలిచేవాడు. కానీ గప్టిల్ సమీక్ష వినియోగించుకోగా, న్యూజిలాండ్‌కు మరో సమీక్ష లేకపోయింది. అప్పటికి న్యూజిలాండ్ స్కోరు 141/4.
ఈ దశలో న్యూజిలాండ్ 200 లోపే ఆలౌటయ్యేలా కనిపించింది. వికెట్ కీపర్ టామ్ లేథమ్ (47, 56 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) కఠిన పరిస్థితుల్లో పరుగులు చేశారు. ప్రపంచకప్‌లో నిలకడగా విఫలమైన లేథమ్, కీలక ఫైనల్లో జట్టును ఆదుకున్నాడు. రెండు ఫోర్లు, ఓ సిక్సర్ బాదాడు. లోయర్ ఆర్డర్లో జేమ్స్ నీషమ్ (19), గ్రాండ్‌హౌమ్ (16)తో కలిసి స్కోరును ముందుకు నడిపించాడు. ఆరంభంలో నికోల్స్, చివర్లో లేథమ్ రాణించటంతో న్యూజిలాండ్ 241/8 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ పేసర్లు క్రిస్ వోక్స్ (3/37), లియాం ఫ్లంకెట్ (3/42) మెరిశారు. ఆర్చర్, మార్క్‌వుడ్ చెరో వికెట్ తీశారు. లార్డ్స్‌లో ఇంగ్లీష్ సీమర్లు ఎక్స్ట్రా బౌన్స్ కోసం ప్రయత్నించి నియంత్రణ కోల్పోయారు. 17 వైడ్లు సహా 30 పరుగులను అదనంగా సమర్పించుకున్నారు. పరుగులు చేయటం కష్టసాధ్యమైన పిచ్‌పై 30 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో కోల్పోవటం ఇంగ్లాండ్‌కు ప్రతికూలమైంది.
నిర్ణీత 50 ఓవర్ల ఆటలో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ 240 పరుగులతో సమానంగా నిలిచాయి. సూపర్ ఓవర్లోనూ ఇరు జట్లు 15 పరుగులతో సమవుజ్జీలుగా నిలిచాయి. వరుస టై ఎదురైతే బౌండరీల తేడాతో విజేతను నిర్ణయించాలని ఐసీసీ నిబంధనలు చెబుతున్నాయి. పూర్తి ఇన్నింగ్స్‌లో న్యూజి లాండ్ 14 ఫోర్లు, 2 సిక్స్‌లు బాదగా, ఇంగ్లాండ్ 22 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టింది. సూపర్ ఓవర్లో న్యూజిలాండ్ ఓ సిక్సర్‌కు పరిమితం కాగా ఇంగ్లాండ్ రెండు ఫోర్లు కొట్టింది. బౌండరీలత పరంగా స్పష్టమైన ఆధిక్యం సాధించిన ఇంగ్లాండ్ ప్రపంచకప్ విజేతగా నిలిచింది. లార్డ్స్‌లో ఫైనల్లో న్యూజిలాండ్ ఓటమిపాలైందని చెప్పలేము, కానీ విజేతను నిర్ణయించటం కోసం పాటించిన పద్దతిలో కివీస్ వెనుకంజలో ఉంది.
స్కోరు వివరాలు
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ : మార్టిన్ గప్టిల్ (ఎల్బీ) క్రిస్ వోక్స్ 19, హెన్రీ నికోల్స్ (బి) ఫ్లంకెట్ 55, కేన్ విలియమ్సన్ (సి) జోశ్ బట్లర్ (బి) ఫ్లంకెట్ 30, రాస్ టేలర్ (ఎల్బీ) మార్క్‌వుడ్ 15, టామ్ లేథమ్ (సి) విన్సె (బి) క్రిస్ వోక్స్ 47, జేమ్స్ నీషమ్ (సి) రూట్ (బి) ఫ్లంకెట్ 19, కొలిన్ డీ గ్రాండ్‌హౌమ్ (సి) విన్సె (బి) క్రిస్ వోక్స్ 16, మిచెల్ శాంట్నర్ నాటౌట్ 5, మాట్ హెన్రీ (బి) జోఫ్రా ఆర్చర్ 4, ట్రెంట్ బౌల్ట్ నాటౌట్ 1, ఎక్స్‌ట్రాలు : 30, మొత్తం : (50 ఓవర్లలో 8 వికెట్లకు) 241.
వికెట్ల పతనం : 1-29, 2-103, 3-118, 4-141, 5-173, 6-219, 7-232, 8-240.
బౌలింగ్ : క్రిస్ వోక్స్ 9-0-37-3, జోఫ్రా ఆర్చర్ 10-0-42-1, లియాం ఫ్లంకెట్ 10-0-42-3, మార్క్‌వుడ్ 10-1-49-1, ఆదిల్ రషీద్ 8-0-39-0, బెన్ స్టోక్స్ 3-0-20-0.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ : జేసన్ రాయ్ (సి) లేథమ్ (బి) మాట్ హెన్రీ 17, జానీ బెయిర్‌స్టో (సి) ఫెర్గుసన్, జో రూట్ (సి) లేథమ్ (బి) గ్రాండ్‌హౌమ్ 7, ఇయాన్ మోర్గాన్ (సి) ఫెర్గుసన్ (బి) నీషమ్ 9, బెన్ స్టోక్స్ నాటౌట్ 84. జోశ్ బట్లర్ (సి) టిమ్ సౌథి (బి) లాకీ ఫెర్గుసన్ 59, క్రిస్ వోక్స్ (సి) లేథమ్ (బి) ఫెర్గుసన్ 2, లియాం ఫ్లంకెట్ (సి) బౌల్ట్ (బి) నీషమ్ 10, ఆర్చర్ (బి) నీషమ్ 0, రషీద్ రనౌట్ 0, మార్క్‌వుడ్ రనౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 17, మొత్తం : (50 ఓవర్లలో ఆలౌట్) 240.
వికెట్ల పతనం : 1-28, 2-59, 3-71, 4-86, 5-196, 6-203, 7-220, 8-227, 9-240, 10-241.
బౌలింగ్ : ట్రెంట్ బౌల్ట్ 10-0-67-0, మాట్ హెన్రీ 10-2-40-1, కొలిన్ డీ గ్రాండ్‌హౌమ్ 10-2-25-1, లాకీ ఫెర్గుసన్ 10-0-50-3, జేమ్స్ నీషమ్ 7-0-43-3, మిచెల్ శాంట్నర్ 3-0-11-0.