Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవ ఇంగ్లాండ్‌ను నిర్మించిన మోర్గాన్
క్రికెట్ చరిత్రలో 4045 వన్డేల్లో ఇప్పటివరకు కేవలం 35 మ్యాచులే టైగా ముగిశాయి. 445 ప్రపంచకప్ మ్యాచుల్లో టైగా ముగిసిన మ్యాచులు 4. లార్డ్స్ ఫైనల్స్‌కు ముందు ఇంగ్లాండ్ 8 మ్యాచులను టై చేసుకోగా, న్యూజిలాండ్ 7 మ్యాచుల్లో టైగా నిలిచింది. ఈ రెండు జట్ల నడుమ ఇది మూడో టై పోరు. ప్రపంచకప్ విజేతను బౌండరీల తేడాతో నిర్ణయించటం చరిత్రలో ఇదే ప్రథమం.
నవతెలంగాణ క్రీడా విభాగం
నాలుగేండ్ల కఠోర శ్రమ. రెండు మాసాల అవిరామ పోరాటం. 44 ఏండ్ల ప్రపంచకప్ చరిత్రలో ట్రోఫీని అందుకునేందుకు ఇంగ్లాండ్, న్యూజిలాండ్ అంతిమ క్షణం వరకూ పోటాపోటీగా పోరాడాయి. ఆధునిక క్రికెట్లోనే కాదు ప్రపంచకప్ చరిత్రలోనే ఇంతటి ఉత్కంఠ భరిత టైటిల్ పోరును చూడలేదు అనటం అతిశయోక్తి కాదేమో. న్యూజిలాండ్‌లో జన్మించిన బెన్ స్టోక్స్ టైటిల్ ఆశలు నిలిపాడు, కరీబియన్ దీవుల్లోని బార్బడోస్ కుర్రాడు జోఫ్రా ఆర్చర్ సూపర్ ఓవర్‌తో గెలిపించాడు, దక్షిణాఫ్రికా జాతీయుడు జేసన్ రారు ప్రపంచకప్ గెలుపు త్రో విసిరాడు. ఐర్లాండ్ (మాజీ) ఆటగాడు ఇయాన్ మోర్గాన్ ప్రపంచకప్ అందుకున్నాడు. అంతిమంగా ఇంగ్లాండ్ వరల్డ్‌కప్ విజయాన్ని రుచి చూసింది. క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్ ప్రపంచకప్‌ను చేరుకున్న క్రమం ఆసక్తికరం.
క్రికెట్‌ను ఆస్వాదించటంలో, ఆడటంలో ఒక్కో జట్టుది ఒక్కో శైలి. పసికూన అఫ్గనిస్థాన్ 2016 టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌పై గెలిచింది. అఫ్గాన్‌లో చాలా మందికి క్రిస్ గేల్ అభిమాన క్రికెటర్. విజయానందంలో అఫ్గాన్ బృందంతో కలిసి క్రిస్ గేల్ సంతోషాన్ని పంచుకున్నాడు. విండీస్ క్రికెటర్లు వారితో కలిసి చిందేశారు. ప్రత్యర్థి విజయాన్ని గౌరవించటంలో విండీస్ పెద్ద మనసు ఆ సన్నివేశం చాటిచెప్పింది. అన్నట్టు, 2016 టీ20 వరల్డ్‌కప్‌ను వెస్టిండీస్ సొంతం చేసుకుంది. పరాజయానికి ప్రతీకారం, కసితో పోరాటం అనే మాటలు క్రికెట్లో తరచుగా చూస్తుంటాం. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ కివీలను కొత్త పంథాలో నడిపించాడు. జెంటిల్మెన్ గేమ్‌లో మర్యాదస్తులు న్యూజిలాండ్ క్రికెటర్లు. ఆ మార్పు ఘనత మెక్‌కలమ్‌కు దక్కుతుంది. ఈ తరహా క్రికెట్‌ను చూసి ఇయాన్ మోర్గాన్ ప్రేరణ పొందాడు. 2015 ప్రపంచకప్‌కు రెండు నెలల ముందు ఇంగ్లాండ్ వన్డే కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న మోర్గాన్.. కంగారూ గడ్డపై నాకౌట్‌కు చేరకుండానే స్వదేశం చేరుకోవాల్సి వచ్చింది. 2019 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇస్తున్న దేశంగా ఇంగ్లాండ్ జట్టును మోర్గాన్ పూర్తిగా ప్రక్షాళన చేశాడు. నవ ఇంగ్లాండ్‌కు మోర్గాన్ తారకమంత్రం ' భయం లేని క్రికెట్ ఆడటం, ప్రతీకార భావన లేకుండా స్వేచ్ఛగా ఆడటం'. ఈ రెండింటిని బ్రెండన్ మెక్‌కలమ్ నాయకత్వం నుంచి మోర్గాన్ స్వీకరించాడు. క్రికెట్ మైదానంలో ఒత్తిడికి లోనవ్వని క్రికెటర్‌గా ఎం.ఎస్ ధోనిని చూపిస్తే... అసలు భావోద్వేగాలో లేని నాయకుడిగా ఇయాన్ మోర్గాన్ మిగిలిపోతాడు. ఆఖరు ఓవర్ హైడ్రామా, సూపర్ ఓవర్ ఉత్కంఠ సహా మ్యాచ్‌ను మలుపు తిప్పిన ఇతర సన్నివేశాల్లోనూ డ్రెస్సింగ్‌రూమ్ బాల్కనీలో కూర్చున్న మోర్గాన్‌ను టెలివిజిన్లో పదే పదే చూపించారు. ఎటువంటి భావోద్వేగాలు లేకుండా మోర్గాన్ మ్యాచ్ పరిస్థితులను అర్థం చేసుకునే పనిలో ఉండిపోయాడు. ' ఇయాన్ మోర్గాన్ మానవాతీతుడు' అని కామెంటేరర్ వ్యాఖ్యానించాడు. ఈ మాటలను బట్టి మోర్గాన్ ఎంతగా మెక్‌కలమ్ తరహా క్రికెట్‌ను స్వీకరించాడో తెలుస్తుంది.
2015 ప్రపంచకప్ మాత్రమే కాదు, 1992 నుంచి ఇంగ్లాండ్ ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన చేస్తూ వచ్చింది. ఓ దశలో ఇంగ్లాండ్‌ను నాకౌట్ రేసులో కనీస పరిగణనలోకి తీసుకునే పరిస్థితి కనిపించలేదు. 2009లో ఇంగ్లాండ్ తరఫున తొలి మ్యాచ్ ఆడిన మోర్గాన్ ఆరేండ్లలోనే జట్టుకు నాయకుడయ్యాడు. కెప్టెన్‌గా తన జట్టు ఎలా ఉండాలి, ఎలా ఆడాలి అనేది తనే నిర్దేశించాడు. అందుకే నవ ఇంగ్లాండ్ తొలి బంతి నుంచి చివరి బంతి వరకూ ఎదురుదాడి చేస్తూనే ఉంటుంది. కఠిన పరిస్థితుల్లోనైనా దూకుడుగా బౌండరీలు బాదుతూనే ఉంటుంది. అంతిమంగా, ఇంగ్లాండ్‌ను విజేతగా నిలిపింది బౌండరీ కొట్టడంలో సామర్థ్యమే. న్యూజిలాండ్‌ను 2015లో ఫైనల్స్‌కు చేర్చిన నాయకుడి స్ఫూర్తితో జట్టును నడిపించిన మోర్గాన్, 2019 ఫైనల్లో అదే న్యూజిలాండ్‌ను ఓడించి వరల్డ్‌కప్‌ను అందుకున్నాడు.