Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందరూ ఒక్కటే అని తెలుసుకోవాలి
- నిలకడ, సక్సెస్‌తో విసుగొచ్చింది
- భారత కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యాఖ్యలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ
ప్రపంచకప్ టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగి మాంచెస్టర్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమిపాలై, రెండు వారాలు కావొస్తుంది. ఎం.ఎస్ ధోని రిటైర్మెంట్తో పాటు భారత క్రికెట్ భవిష్యత్ రోడ్‌మ్యాప్‌పై విపరీత చర్చ జరుగుతోంది. వరల్డ్‌కప్ ఓటమి నుంచి తేరుకున్న కెప్టెన్ కోహ్లి.. రోజువారి కార్యక్రమాల్లో మునిగిపోయాడు. ఫిట్నెస్ నిలుపుకోవటం, కఠోర జిమ్, తిరిగి ఇంటికొచ్చి విశ్రాంతి తీసుకోవటం.. ఇదే విరాట్ కోహ్లి దినచర్య. దీనికి తోడు విరామం లేని షుటింగ్ కార్యక్రమాలతో కోహ్లి ఇప్పుడు బిజీబిజీగా గడుపుతున్నాడు. భారత క్రికెట్‌ను యువ ఆటగాళ్లతో ముందుకు తీసుకెళ్లటం సహా విజయం, పరాభవం, విశ్వాసం పట్ల కెప్టెన్ కోహ్లి ఓ ఆంగ్ల పత్రికతో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఆ విషయాలు కోహ్లి మాటల్లోనే...
పరాభవం నేర్పిన పాఠాలు : నా జీవితంలో ఎక్కువగా ఓటములు, ఎదురు దెబ్బల నుంచే నేర్చుకున్నాను. దారుణ పరాభవం నాలో స్పూర్తిని రగిలించటంతో పాటు వ్యక్తిగా ఉన్నతంగా తీర్చి దిద్దుతుంది. జీవితంలో విజయాల కంటే ఓటమి ఎక్కువగా ఎందుకు అవసరమే తెలిసేలా చేసింది. ఓటములు రెండు విధాలుగా మేలు చేస్తుంది. ప్రశాంతంగా కూర్చొని, భవిష్యత్ ప్రణాళిక ఏమిటని ఆలోచిస్తాం. రెండోది, కష్ట కాలంలో మనకు మద్దతుగా ఎవరు నిలుస్తున్నారు? వదిలేసి ఎవరు వెళ్లిపోతున్నారు అనేది తెలిసేలా చేస్తుంది. అన్నింటి కంటే ముఖ్యంగా, ఓటములు వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి. ఎందుకంటే, జట్టులో అందరూ మెరుగ్గా ఆడుతున్నారు. అంతా సవ్యంగా సాగుతుందనే సమయంలో పరాజయం పలకరిస్తుంది. ఓటమిని జీర్ణించుకోవటం కష్టం. నిజంగా పేలవంగా రాణిస్తే, తప్పిదాలు చేస్తే అవేమిటో తెలుసుకుని దిద్దుకుంటాం, అంగీకరిస్తాం. కానీ అంతా మెరుగ్గానే సాగుతున్న దశలో ఎదురైన పరాజయానికి బాధ్యత వహించటం అంత సులువు కాదు. ఎక్కువ పొరపాట్లు చేయలేదు, కానీ ప్రపంచకప్ నుంచి వైదొలిగాం.
విజయంతో విసుగొచ్చింది : ప్రయత్నం ఎప్పుడైతే ఆపేస్తామో అప్పుడే మన పనైపోయిందని అనుకోవాలి. పైకి లేవాలి, కష్టపడాలి, పోరాడాలి.. మరో దారి లేదు. ఇదే నిత్యం కొనసాగించాలి. సక్సెస్, నిలకడ అంటే మరేదో కాదు, అదే విషయాన్ని (ఫలితాన్ని) రోజూ పునరావృతం చేయటం. నిజానికి ఇదెంతో విసుగు. నిలకడతో విసుగొచ్చింది. ఒకే జోన్లో ఉండి, ఒకే ఫలితాన్ని పదేపదే సాధించటం. గోల్ఫ్‌లో చూస్తే, ఒకే షాట్‌ను పదేపదే ప్రాక్టీస్ చేస్తుంటారు. ఎందుకంటే, ఒత్తిడి సమయాల్లో వారు చేయగలిగేది అది మాత్రమే. ఆ విషయం క్రీడాకారులకు తెలుసు. లియాండర్ పేస్, మాట్ హెన్రీలు ఇద్దరు భిన్న క్రీడలు ఆడతారు. వారిద్దరితోనూ మాట్లాడాను. ఒత్తిడి సమయాల గురించి వారిని అడిగితే, ఒక స్పష్టతతో చెబుతారు. ప్రతి ఆటలోనూ అత్యున్నత స్థాయి క్రీడాకారుల్లో ఇది కనిపిస్తుంది. స్పోర్ట్స్ గొప్పతనం అదేనేమో!.
మత విశ్వాసం లేదు : ఇక్కడ ఒక్క విషయం చెప్పదలచుకున్నాను. పని చేసే దృక్పథం పాజిటివ్‌గా ఉంటే ఆ పనిలో వంద శాతం నిమగమవుతాం. అలా కాకుండా, ఏదో పేరు కోసం, ఇతర ప్రాపకం కోసమైతే అది వెంటనే తెలిసిపోతుంది. సహజసిద్ధమైన పనులు చేసే వారిలో నేను ఒకడిని అని ఎల్లప్పుడూ విశ్వసిస్తాను. ఎవరి మెప్పు కోసం, ఆదరణ కోసం నేను ఏదీ చేయను. ఇక, క్రికెట్ కంటే జీవితం ఎంతో పెద్దది, ముఖ్యమైనది. ప్రొఫెషనల్ క్రికెటర్‌గా క్రికెట్ సర్వస్వం. ఇదే సమయంలో జీవితంలో కుటుంబం, భార్య కోసం చేస్తాను. కుటుంబం, భార్య ప్రాధాన్య అంశాలవుతాయి. క్రికెట్ ఏదో ఒక రోజు నీ జీవితంలో ముగుస్తుందనే విషయం అర్థం చేసుకోవాలి.
ప్రధానంగా నేను మత విశ్వాస పాత్రుడిని కాదు. నా జీవితంలో ఏ సమయంలోనూ ఓ మతం పట్ల విశ్వాసం వ్యక్తం చేయలేదు. బహిరంగంగానే అన్ని మతాలను, మతాల ప్రజలను అంగీకరించాను. ప్రతి ఒక్కరిలోనూ ఆధ్యాత్మికత ఉంటుందని నేను నమ్ముతాను. మనుషులు అందరూ ఒకేటనని కొందరు ఇంకా తెలుసుకోలేకపోతున్నారు.
కుల్దీప్, ధోనితో ఒకేలా ఉంటాను : యువ ఆటగాళ్లను నిందించటం, తిట్టడం డ్రెస్సింగ్‌రూమ్ వాతావరణంలో మాయమైపోయాయి. యువ ఆటగాడు కుల్దీప్ యాదవ్‌తో ఎంత స్నేహంగా ఉంటానో, సీనియర్ ఆటగాడు ఎం.ఎస్ ధోనితోనూ అంతే స్నేహంగా మెలుగుతాను. డ్రెస్సింగ్‌రూమ్‌లో ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు. నేను ఏదైనా చెప్పదలుచుకుంటే, నేనే ఆటగాళ్ల వద్దకు వెళతాను. నేను కెరీర్ ఆరంభంలో చేసిన తప్పిదాలు మీరు చేయవద్దని, వాటిని తెలుసుకునేందుకు మరో మూడేండ్ల కెరీర్ నాశనం చేసుకోవద్దని సూచిస్తాను. నా కెరీర్ ఆరంభంలో నేను తరచుగా పొరపాట్లు చేశాను. నాలా కావొద్దు, మెరుగైన కెరీర్ కోసం పొరపాట్లు పునరావృతం చేయవద్దని చెబుతాను. యువ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, పృథ్వీ షా, రిషబ్ పంత్, శ్రేయాష్ అయ్యర్ ఎంతో ప్రతిభావంతులు. నేను ఎన్నో సార్లు చెప్పాను. 19-20 ఏండ్ల వయసులో నేను ఎప్పుడూ అంత మెరుగైన క్రికెటర్‌గా లేను. ఐపీఎల్ అనుభవంతో యువ ఆటగాళ్లు కెరీర్ ఆరంభంలో గొప్ప విశ్వాసంతో కనిపిస్తున్నారు. నా జట్టులో ఆడాలని అనుకుంటే, కచ్చితంగా ఇది చేయాలని అని ఏ ఆటగాడితోనూ చెప్పలేదు.
కంగారూలను చూసే ఫిట్నెస్ : ప్రపంచ క్రికెట్లో మార్పులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ విషయాన్ని 2012 ఆస్ట్రేలియా పర్యటనలో అర్థం చేసుకున్నాను. ఆసీస్ బ్యాట్స్‌మెన్ సుదీర్ఘ సెషన్ల పాటు బ్యాటింగ్ చేస్తున్నారు. బౌలర్లు టెస్టు సిరీస్ సాంతం.. చెత్త బంతులు వేయలేదు. సులువుగా పరుగులు సాధించగలే బంతులే వేయటం లేదు. నాకు ఆశ్చర్యం వేసింది. నేను రేసులో వెనుకంజ వేయకూడదని అనుకున్నాను. ఆ స్థాయి క్రికెట్లో నిలవాలంటే ఫిట్నెస్ ప్రాధాన్యం గుర్తించాను. ఫిట్నెస్ సాధన మొదలెట్టాను. నెమ్మదిగా ఫలితాలు చవిచూశాను. శంకర్ బసు రాకతో జట్టు ఫిట్నెస్ స్థాయి గణనీయంగా పెరిగింది. ఇప్పుడు టెస్టుల్లో మన బౌలర్లు సైతం చెత్త బంతులు వేయటం లేదు. సుదీర్ఘ సెషన్ల పాటు నిలకడగా రాణిస్తున్నారు. నాకు పెద్దగా నైపుణ్యం లేదనే విషయం తెలుసు. కానీ కష్టపడటంలో నా తర్వాతే ఎవరైనా అని నా నమ్మకం. అందుకే జిమ్‌లో కఠోరంగా చెమటోడ్చుతాను. ప్రాక్టీస్ సెషన్లో 120 శాతం శ్రమిస్తాను. ఇప్పుడు నేనున్న స్థాయి పట్ల ఎంతో గొప్ప అనుభూతి. ఏనాడూ ఈ స్థాయిని ఊహించలేదు. నాకు నైపుణ్యం లేకపోయినా, కష్టపడే తత్వమే ఇంతవాడిని చేసిందని నమ్ముతాను. టెస్టు చాంపియన్‌షిప్ సరైన సమయంలో వస్తోంది. అందుకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.