Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రేయాష్ అయ్యర్‌పైనే ఫోకస్
- క్రిస్ గేల్ 300వ వన్డేకు రంగం సిద్ధం
- భారత్, వెస్టిండీస్ రెండో వన్డే నేడు
- రాత్రి 7 నుంచి సోనీటెన్లో...
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ (ట్రినిడాడ్) : బ్యాటింగ్ ఆర్డర్లో భారత్ నం.4 అన్వేషణ పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌కు చేరుకుంది. భారత్-ఏ, దేశవాళీ సీజన్లో నిలకడగా రాణించిన శ్రేయాష్ అయ్యర్‌ను భారత్ నం.4 స్పెషలిస్ట్‌గా చూస్తోంది. అతడి ప్రదర్శనపైనే నేడు అందరి దృష్టి నెలకొంది. కెరీర్ 300వ వన్డేకు రంగం సిద్ధం చేసుకున్న కరీబియన్ విధ్వంసకారుడు క్రిస్ గేల్ విజయంపై కన్నేశాడు. కాగితంపై జట్టు మెరుగ్గా కనిపిస్తున్నా, విండీస్‌లో ఆత్మవిశ్వాసం లోపించింది. ఓ విజయం విండీస్ శిబిరంలో ఆత్మస్థైర్యం నింపనుంది. సిరీస్ దక్కాలంటే వరుసగా రెండు వన్డేలు నెగ్గాల్సిన స్థితిలో కోహ్లిసేన బ్యాక్ టూ బ్యాక్ విజయాలపై దృష్టి సారించింది. వెస్టిండీస్‌తో భారత్ రెండో వన్డే నేడు.
అయ్యర్ అవుతాడా నం.4? : 2019 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియాను తీవ్రంగా దెబ్బకొట్టిన నం.4 బ్యాట్స్‌మన్ పొజిషన్ కోసం కోహ్లిసేన కొత్తగా అన్వేషణ మొదలుపెట్టింది. గయనాలో శ్రేయాష్ అయ్యర్‌కు నం.4లో అవకాశం ఇచ్చింది. గయాన వన్డే రద్దుతో అయ్యర్ నం.4 రేసు ఆరంభం కాలేదు. నేడు అయ్యర్ నం.4లో అదృష్టం పరీక్షించుకోనున్నాడు. టీ20ల్లో మనీశ్ పాండేకు స్థానం కోల్పోయిన అయ్యర్.. వన్డేల్లో పాండేను వెనక్కి నెట్టి తుది జట్టులో నిలిచాడు. నేటి ప్రదర్శనతో సంబంధం లేకుండా అయ్యర్‌కు మరిన్ని అవకాశాలు లభించనున్నాయి. అయినా, పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో తన స్థానం సుస్థిరం చేసుకునే ఇన్నింగ్స్‌పై అయ్యర్ కన్నేశాడు. బ్యాటింగ్ లైనప్‌లో శిఖర్ ధావన్ ఫామ్ కోసం ఎదురుచూస్తున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి జోరుమీదున్నారు. చివరి టీ20లో అజేయ ఇన్నింగ్స్‌తో రిషబ్ పంత్ ఫామ్ అందుకున్నాడు. లోయర్ ఆర్డర్లో రవీంద్ర జడేజాతో కలిసి పంత్ ప్రతాపం చూపనున్నాడు. కేదార్ జాదవ్ తన స్థానానికి న్యాయం చేయగలిగే ప్రదర్శన చేయాల్సి ఉంది. బంతితో భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమి గయానలో గర్జించారు. ఖలీల్ అహ్మద్‌పై విండీస్ బ్యాట్స్‌మెన్ విరుచుకుపడ్డారు. అతడు నేడూ జట్టులో ఉండే అవకాశం ఉంది. స్పిన్ అనుకూలిత పిచ్‌పై జడేజాతో కలిసి కుల్దీప్ యాదవ్ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నాడు.
గేల్ రికార్డు వన్డే : వెస్టిండీస్ తరఫున అత్యధిక వన్డేలు ఆడిన ఆటగాడిగా క్రిస్ గేల్ నేడు రికార్డు సృష్టించనున్నాడు. భారత్‌తో రెండో వన్డే క్రిస్ గేల్‌కు కెరీర్ 300వ వన్డే. ఈ ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన విండీస్ బ్యాట్స్‌మన్‌గా బ్రియాన్ లారా (10495)ను వెనక్కి నెట్టేందుకు గేల్ (10397) మరో 9 పరుగుల దూరంలోనే ఉన్నాడు. నేడు గేల్ డబుల్ రికార్డులపై కన్నేసి బరిలోకి దిగనున్నాడు. గయానలో 31 బంతుల్లో 4 పరుగులే చేసిన గేల్ క్రీజులో సౌకర్యవంతంగా కనిపించలేదు. నేడు స్పెషల్ వన్డేలో గేల్ సునామీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది విండీస్ శిబిరం. హౌప్, హెట్మయర్, రోస్టన్ ఛేజ్, పూరన్‌లపై విండీస్ బ్యాటింగ్ భారం ఆధారపడి ఉంది. బౌలింగ్ విభాగంలో హౌల్డర్, కాట్రెల్, కీమర్ రోచ్, అలెన్ మెరుగ్గా కనిపిస్తున్నారు.
పిచ్ రిపోర్టు : పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో ఆడిన చివరి మ్యాచ్‌లో విండీస్ అలవోక విజయం సాధించింది. ఇక్కడ జరిగిన చివరి ఐదు మ్యాచుల్లో నాలుగు వర్షం ప్రభావానికి గురయ్యాయి. కానీ నేటి మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించే ప్రమాదం లేదని తెలుస్తోంది. ట్రినిడాడ్‌లో పూర్తి వన్డే జరుగనుంది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ పిచ్ కొంతకాలంగా స్పిన్నర్లకు అనూలిస్తోంది.
తుది జట్లు (అంచనా) :
భారత్ : రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, శ్రేయాష్ అయ్యర్, కేదార్ జాదవ్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమి, ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్.
వెస్టిండీస్ : క్రిస్ గేల్, ఎవిన్ లెవిస్, షైరు హౌప్, షిమ్రోన్ హెట్మయర్, నికోలస్ పూరన్, రోస్టన్ ఛేజ్, జేసన్ హౌల్డర్, ఫబిన్ అలెన్, కార్లోస్ బ్రాత్‌వేట్, కీమర్ రోచ్, షెల్డన్ కాట్రెల్.