Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : భారత క్రికెట్ జట్టు సహాయక సిబ్బంది ఎంపిక ఆసక్తికరంగా మారుతోంది. టీమ్ ఇండియా మాజీ కోచ్ లాల్‌చంద్ రాజ్‌పుత్ చీఫ్ కోచ్ పదవికి రేసులో నిలిచినా నిరాశే ఎదురైంది. తాజాగా రాజ్‌పుత్ బ్యాటింగ్ కోచ్‌గా అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఎమ్మెస్కే ప్రసాద్ సారథ్యంలోని సీనియర్ సెలక్షన్ కమిటీ సోమవారం బ్యాటింగ్, బౌలింగ్ కోచ్‌ల అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసింది. బ్యాటింగ్ కోచ్ రేసులో ముందున్న విక్రమ్ రాథోర్‌కు రాజ్‌పుత్ నుంచి గట్టి పోటీ ఎదురువుతోంది. ఒక్కో అభ్యర్థిని కనీసం 30 నిమిషాలు ఇంటర్య్యూ చేసిన కమిటీ, 20 నిమిషాల పాటు వారి ఆలోచనలు, ప్రణాళికలపై వివరణ కోరినట్టు తెలిసింది. విక్రమ్ రాథోర్, లాల్‌చంద్ రాజ్‌పుత్, సిటాన్షు, కనిట్కర్, అమోల్ మజుందార్, ప్రవీణ్ ఆమ్రెలు బ్యాటింగ్ కోచ్ పదవి కోసం ఇంటర్య్యూకు హాజరయ్యారు. వెంకటేశ్ ప్రసాద్, సుబ్రతో బెనర్జీ, పరాస్, అమిత్ భండారిలను బౌలింగ్ కోచ్ కోసం ప్రసాద్ ప్యానెల్ ఇంటర్య్వూ చేసింది. నేడు ఫీల్డింగ్ కోచ్ రేసులో ఉన్న జాంటీ రోడ్స్ ప్యానల్ ముందుకు రానున్నాడు. టీమ్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ పదవి కోసం బుధవారం ఇంటర్య్యూ నిర్వహించనున్నారు. సహాయక సిబ్బంది ఇంటర్య్వూలు పూర్తి అయిన తర్వాత ప్రసాద్ కమిటీ ప్రాధాన్య క్రమంలో జాబితాను పాలకుల కమిటీకి అందజేయనుంది.
రవిశాస్త్రి మాట వింటారా? : సహాయక సిబ్బంది ఎంపికలోనూ క్రికెట్ సలహా సంఘం (సీఏసీ) పాత్ర ఉండాలని కపిల్ దేవ్ వ్యాఖ్యానించాడు. పాలకుల కమిటీ కపిల్ అభ్యర్థనను తోసిపుచ్చింది. బోర్డు నిబంధనల ప్రకారం ఎంపిక ప్రక్రియను పూర్తిగా సెలక్షన్ కమిటీకి అప్పగించింది. ప్రసాద్ ప్యానల్ సైతం ఈ అంశంలో కపిల్ కమిటీతో సంప్రదింపులు చేయలేదు. ఇదిలా ఉండగా, ప్రస్తుత సహాయక సిబ్బందినే కొనసాగించాలని చీఫ్ కోచ్‌గా తిరిగి ఎంపికైన రవిశాస్త్రి కోరినట్టు సమాచారం. సహాయక సిబ్బంది ఎంపిక సమయంలో చీఫ్ కోచ్ అభిప్రాయాన్ని సైతం తీసుకుంటారు. బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్‌లను తిరిగి నియమించటంపై ఎటువంటి అభ్యంతరాలు రావటం లేదు. కానీ బ్యాటింగ్ కోచ్ సంజరు బంగర్‌పై వేటు వేయాలని బోర్డు వర్గాల్లోనూ వినిపిస్తోంది. ప్రపంచకప్‌కు కోరుకున్న జట్టును ఇవ్వలేదని ఇప్పటికే సెలక్షన్ కమిటీపై నింద వేసిన రవిశాస్త్రి.. ఇప్పుడు సహాయక సిబ్బంది విషయంలో తన మాట వినకుంటే ఏం చేస్తాడో చూడాలి. ఫిజియోథెరపిస్ట్, కండిషనింగ్ ట్రైనర్ల కోసం సైతం ప్రసాద్ ప్యానల్ ఇంటర్య్యూలు జరుపనుంది.