Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్చర్ బౌన్సర్ ప్రభావ ఫలితం
లండన్ : ఏడాది నిషేధం తర్వాత జాతీయ జట్టులోకి వచ్చీ రాగానే రెండు సెంచరీలతో యాషెస్‌లో ఆస్ట్రేలియాకు 1-0 ఆధిక్యం అందించిన కంగారూ స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ మూడో టెస్టుకు దూరమయ్యాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ అరంగ్రేట సీమర్ జోఫ్రా ఆర్చర్ సంధించిన పదునైన బౌన్సర్ స్మిత్ తలకు బలమైన గాయం చేసింది. బౌన్సర్ ధాటికి స్మిత్ తల తిరిగింది!. ఆస్ట్రేలియా జట్టు వైద్యుడు స్మిత్‌ను కంకషన్ సబ్‌స్టిట్యూట్ (తలకు బలమైన గాయం తగిలినప్పుడు ఆడలేని పరిస్థితి)గా ప్రకటించాడు. రెండో ఇన్నింగ్స్‌లో స్మిత్ బ్యాటింగ్‌కు రాలేదు. ' హెడింగ్లేలో యాషెస్ మూడో టెస్టుకు స్టీవ్ స్మిత్ దూరమయ్యాడు' అని ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ తెలిపాడు. హెడింగ్లే టెస్టు ప్రాక్టీస్ సెషన్లో స్మిత్ పాల్గొనలేదు. ఐసీసీ 2019 ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లో ఆర్చర్ బౌన్సర్‌కు దక్షిణాఫ్రికా ఓపెనర్ హషీమ్ ఆమ్లా బాధితుడ య్యాడు. బౌన్సర్ ధాటికి ఆమ్లాకు తల పగిలినట్టైందని, తర్వాతి రెండు మ్యాచులకూ దూరమయ్యాడు. ప్రపంచకప్‌లో పేలవ ఫామ్‌లో రిటైర్మెంట్ సైతం ప్రకటించిన సంగతి తెలిసిందే. నిప్పులు కక్కే బంతులు సంధించే ఆర్చర్ మరో ఆసీస్ బ్యాట్స్‌మన్‌కూ ప్రాణ సంకటంగా తయారయ్యాడు. స్మిత్ కంకషన్ సబ్‌స్టిట్యూట్ ఆటగాడు మార్నస్ లబ్చేంజ్ సైతం ఆర్చర్ బౌన్సర్‌కు బాధితుడయ్యాడు. గురువారం నుంచి ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మూడో టెస్టు ఆరంభం కానుంది. ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంతో సిరీస్ రేసులో ముందుంది.