Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమ్ములపొదిలోకి అవుట్ స్వింగర్
- కరీబియన్ గడ్డపై భీకర ఆవిష్కరణ
నవతెలంగాణ క్రీడా విభాగం
ప్రపంచ క్రికెట్ పేస్ బౌలింగ్‌లో జశ్‌ప్రీత్ బుమ్రా ఓ సంచలనం. పేస్ బౌలర్లు అనగానే రన్అప్ ఎంత ఉండాలి, బౌలింగ్ యాక్షన్ ఈ తరహాలో ఉండకూడదు, డెలివరీ ఏ విధంగా చేయాలనే అంశంపై సవివరణ నమ్మకాలు ఉండేవి. జశ్‌ప్రీత్ బుమ్రా వీటిని అన్నింటిని పటాపంచలు చేశాడు. అత్యున్నత స్థాయిలో నిలకడగా వికెట్లు కూల్చిన బుమ్రా పేస్ బౌలింగ్ నిపుణులకు సైతం అంతుపట్టిన పేస్ అస్త్రంగా తయారయ్యాడు. ఇతడేం కొనసాగుతాడు అనుకున్న వారే, ఇప్పుడు ఇతడో సంచలనం అని పొగడ్తలకు పరిమితమయ్యారు. అనతికాలంలోనే అత్యుత్తమ పేసర్‌గా ఎదిగిన బుమ్రా, అందుకోసం ఎప్పటికప్పుడు తనకు తాను కొత్తగా ఆవిష్కరించుకున్నాడు. బుమ్రా అనగానే యార్కర్ల కింగ్ అనే అందరికీ గుర్తొచే మాట. తూటాలా పేలే యార్కర్లతో వికెట్లను గిరాటేసే బుమ్రా.. కరీబియన్ గడ్డపై కొత్త అస్త్రాన్ని ఆవిష్కరించాడు. అదే అవుట్ స్వింగర్.
అక్కడ తొలి ప్రయోగం : 2018 ఇంగ్లాండ్‌తో సౌతాంప్టన్ టెస్టులో జశ్‌ప్రీత్ బుమ్రా తొలిసారి అవుట్ స్వింగర్‌తో ఆశ్చర్యపరిచాడు. అప్పటివరకూ లెగ్ కట్టర్, సీమ్‌తో లేదా లైన్‌కు కట్టుబడిన బంతితో బుమ్రా వికెట్లు పడగొట్టేవాడు. సౌతాంప్టన్‌లో కీటన్ జెన్నింగ్స్‌కు సంధించిన ఆ బంతి బుమ్రా కెరీర్లో మైలురాయి. కుడి చేతి వాటం బ్యాట్స్‌మెన్‌పైనే బుమ్రా ఆ తరహా బంతులు వేసేవాడు. కానీ తొలిసారి ఎడం చేతి వాటం బ్యాట్స్‌మన్‌పైకి అవుట్ స్వింగర్ సంధించాడు. కండ్లుచెదిరే ఆ బంతికి జెన్నింగ్స్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగ తప్పలేదు. ఇంగ్లాండ్ పర్యటనలో నెట్స్‌లో డ్యూక్ బంతితో అవుట్ స్వింగర్ సాధన చేశాడు. అమ్ముల పొదిలోని కొత్త అస్త్రాన్ని బుమ్రా అంతు సులువుగా ప్రయోగించలేదు. ఆ బంతిని వంద శాతం కచ్చితత్వంతో ప్రయోగిస్తాననే నమ్మకం కుదిరిన తర్వాతే బుమ్రా అవుట్ స్వింగర్‌ను జెన్నింగ్స్పైకి విసిరాడు. ప్రపంచకప్ తర్వాత లభించిన విరామం సమయం బుమ్రాకు కలిసొచ్చింది. ఈ సమయంలో బుమ్రా అవుట్ స్వింగర్పై మరింత పట్టు సాధించాడు.
బ్లాక్‌బస్టర్ ఆవిష్కరణ : వెస్టిండీస్‌తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా ఈ అస్త్రాన్ని అద్భుతంగా ప్రయోగించాడు. అధికారిక ప్రసారదారు సోనీ ప్రకారం కుడి చేతి వాటం బ్యాట్స్‌మెన్‌కు ప్రతి పది బంతులకు ఏడు బంతులను అవుట్ స్వింగర్లను ప్రయోగించాడు. ఫలితాలు అమోఘం. షైరు హౌప్, జేసన్ హౌల్డర్లు తప్పని పరిస్థితుల్లో బంతిని ఆడేందుకు ఉపక్రమించారు. కానీ మధ్య వికెట్‌ను కాపాడుకోవాలని ఆరు భావించగా.. ఆలస్యంగా స్వింగ్ అయిన బంతి ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. ఎడం చేతి వాటం బ్యాట్స్‌మన్ జాన్ కాంప్‌బెల్, డారెన్ బ్రావోలను సైతం అవుట్ స్వింగర్‌తో ఆలస్యంగా స్వింగ్ రాబట్టి క్లీన్ బౌల్డ్ చేశాడు. బ్రావో ఆఫ్ స్టంప్ గాల్లోకి ఎగిరి పల్టీలు కొట్టింది. నిజానికి అవుట్ స్వింగర్లను ఎదుర్కొనేందుకు మెరుగైన నిపుణత విండీస్ బ్యాట్స్‌మెన్ కల్గి ఉన్నారు. కానీ బుమ్రా బంతిని సంధించిన కోణం వారిని పొరపాటు చేసేందుకు ఉసిగొల్పింది. బుమ్రా కూల్చిన ఐదు వికెట్లలో ఓపెనర్ బ్రాత్‌వేట్ మినహా అందరూ క్లీన్ బౌల్డయ్యారు.
ఎప్పుడు పడితే అప్పుడు వేయడు! : బుమ్రా అవుట్ స్వింగర్ సంధించటంలో మాస్టర్ అయిపోయాడు. అంతమాత్రాన, అవుట్ స్వింగర్‌ను చీటికిమాటికి ప్రయోగించడు. తొలి ఇన్నింగ్స్‌లో ఫ్లాట్ పిచ్‌పై తక్కువ పేస్‌తో బంతులేశాడు. గాల్లో స్వింగ్ రాబట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఇషాంత్ శర్మ స్వింగ్ రాబట్టడం చూసిన బుమ్రా.. అవుట్ స్వింగర్ ప్రయోగానికి ఇదే సరైన సమయం అని భావించాడు. అదే యాక్షన్, అదే పేస్, అదే ప్రమాదకర బంతులకు కోణానికి వ్యతిరేక స్వింగ్‌ను జోడించాడు. బుమ్రా బుల్లెట్లకు వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ పిట్టల్లా రాలిపోయారు. బుమ్రా తొలి స్పెల్‌లో 8-4-7-5తో నిప్పులు కక్కాడు. ఏడు పరుగులకే ఐదు వికెట్లు కూల్చి కరీబియన్లను 100 పరుగులకే ఆలౌట్ చేశాడు.
కెరీర్ ఆరంభంలో టెస్టు క్రికెట్‌కు పనికిరాడనే ముద్ర బుమ్రాపై పడింది. కానీ ఐదు రోజుల క్రికెట్లో బుమ్రా సాధించిన ఘనత మరే ఆసియా బౌలర్ దక్కించుకోలేదు. బుమ్రాకు ఇది నాల్గో విదేశీ పర్యటన. అన్ని పర్యటనల్లోనూ ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ గడ్డపై నాలుగు ఐదు వికెట్ల ప్రదర్శనలు చేసిన ఏకైక ఆసియా బౌలర్‌గా బుమ్రా రికార్డు సృష్టించాడు. ఆసియా బౌలింగ్ దిగ్గజాలు ముత్తయ్య మురళీధరన్, కపిల్ దేవ్, రంగన హెరాత్, జహీర్ ఖాన్, అనిల్ కుంబ్లే, ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్, వకార్ యూనిస్ క్రికెట్ కెరీర్లో ఈ ఘనత సాధ్యపడలేదు. నాలుగు దేశాల్లో తొలి పర్యటనలోనే బుమ్రా ఐదేసి వికెట్ల ఘనత సాధించాడు. కొత్త అస్త్రంతో మరింత ప్రమాదకర పేసర్‌గా తయారైన బుమ్రా నుంచి మున్ముందు ఎటువంటి క్షిపణులు రానున్నాయో చూడాలి.