Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
న్యూయార్క్: యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో భాగంగా బుధవారం ఉదయం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సంచలనం నమోదైంది. స్విస్ దిగ్గజ ఆటగాడు, మూడో సీడ్ రోజర్ ఫెదరర్ అన్‌సీడెడ్ గ్రిగోర్ డిమిట్రోవ్(బల్గేరియా) చేతిలో అనూహ్యంగా పరాజయం పాలయ్యాడు. ఐదుసెట్ల హోరాహోరీ పోరులో డిమిట్రోవ్ 3-6, 6-4, 3-6, 6-4, 6-2 తేడాతో ఫెదరర్‌పై విజయం సాధించాడు. 28 ఏళ్ల అనంతరం ఓ బల్గేరియా ఆటగాడు యుఎస్ ఓపెన్ సెమీఫైనల్లో ప్రవేశించడం ఇదే ప్రథమం. ఇక ఫెదరర్‌తో గతంలో జరిగిన ఏడు మ్యాచుల్లో డిమిట్రోవ్ పరాజయం పాలయ్యాడు. 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల విజేత అయిన ఫెదరర్ ఈసారి క్వార్టర్ఫైనల్లో ఇంటిదారి పట్టడం విశేషం. మూడు గంటల 12 నిముషాల పాటు సాగిన క్వార్టర్‌ఫైనల్ పోటీలో ఫెదరర్ 61 అనవసర తప్పిదాలు చేయడం గమనార్హం. 39ఏళ్ల ఫెదరర్ ఆటమధ్యలో వీపు నొప్పికి ట్రీట్మెంట్ కోసం విరామం తీసుకున్నాడు. మరో పోటీలో రష్యాకు చెందిన 5వ సీడ్ మెద్వెదేవ్ 7-6(8-6), 6-3, 3-6, 6-1తో 23వ సీడ్ వావ్రింకా(స్విట్జర్లాండ్)ను చిత్తుచేశాడు. శుక్రవారం జరిగే తొలి సెమీఫైనల్ పోటీలో ఐదోసీడ్ డానియెల్ మెద్వెదేవ్(రష్యా)తో డిమిట్రోవ్ తలపడనున్నాడు.
ఇక మహిళల సింగిల్స్‌లో అమెరికాకు చెందిన 8వ సీడ్ సెరెనా విలియమ్స్ 6-1, 6-0తో 18వ సీడ్ చైనాకు చెందిన వాంగ్‌ను చిత్తుచేసి సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. సెమీస్‌లో 5వ సీడ్ స్విటోలినా(ఉక్రెయిన్)తో పోటీకి సిద్ధమైంది.