Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మారథాన్ ఫైనల్లో రఫా అద్భుత విజయం
- కెరీర్ 19వ గ్రాండ్‌స్లామ్ కైవసం
- గొప్పగా పోరాడిన డానిల్ మెద్వదెవ్
- యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ 2019
స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ 33 ఏండ్ల వయసులో యుఎస్ ఓపెన్ ఫైనల్స్ ఫేవరెట్‌గా బరిలోకి దిగాడు. తొలి రెండు సెట్లు ముగియగానే గ్రాండ్‌స్లామ్ తుది పోరు ఏకపక్షమే అనిపించింది. కొద్దిసేపట్లోనే స్పెయిన్ బుల్ ముద్దు యుఎస్ ఓపెన్ ట్రోఫీపై పడనుందని అభిమానులు ఓ అంచనాకు వచ్చారు.
23 ఏండ్ల రష్యా కుర్రాడు డానిల్ మెద్వదెవ్ ఆలోచన భిన్నంగా సాగింది. రెండు సెట్లు కోల్పోయి, మూడో సెట్లో మ్యాచ్ పాయింట్ కాచుకునే ఒత్తిడిలో నిలిచినా, అతడు అద్భుతంపై గురి పెట్టాడు. స్పెయిన్ బుల్ రంకె వేసినా, అనూహ్య ఎదురుదాడితో రేసులోకి వచ్చాడు. తర్వాతి రెండు సెట్లను సొంతం చేసుకుని.. యూఎస్ ఓపెన్ గ్రాండ్ విజయాన్ని లాంఛనం చేసుకునే దిశగా సాగాడు.
నాలుగు గంటల 50 నిమిషాల అంతిమ సమరం విజేతను తేల్చేందుకు ఉత్కంఠను అంత సులువుగా తెరదించలేదు. తొలి రెండు సెట్లు విజయం ముంగిట నిలిచిన నాదల్ వెనుకంజ వేసినట్టే.. మలి రెండు సెట్లు నెగ్గి విజేతగా నిలిచేందుకు రంగం సిద్ధం చేసుకున్న మెద్వదెవ్‌కు షాక్ ఎదురైంది. చావోరేవో సెట్లో స్పెయిన్ బుల్ వేగం పెంచింది. విన్నర్లతో రష్యా కుర్రాడిని బోల్తా కొట్టించి, కెరీర్ 19వ గ్రాండ్‌స్లామ్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు రఫెల్ నాదల్.
న్యూయార్క్ (అమెరికా)
ఫేవరెట్ దూకుడు, ఏకపక్ష పోరు రసవత్తరం, కొత్త కుర్రాడి సంచలన అడుగులు, ముగింపులో ఉత్కంఠ.. ఈ ఏడాది గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో మేటిగా నిలిచింది యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్. సుమారు ఐదు గంటల పాటు అభిమానులను మునివేళ్లపై నిలిపిన తుది సమరంలో అంతిమంగా ఫేవరెట్‌నే టైటిల్ వరించింది. స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ కెరీర్ 19వ గ్రాండ్‌స్లామ్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. యుఎస్ ఓపెన్ ఫైనల్లో తొలి రెండు సెట్లు గెల్చుకుని, మ్యాచ్ పాయింట్ ముంగిట నిలిచినా.. రన్నరప్‌గా నిలిచే ప్రమాదం నుంచి అద్భుత రీతిలో బయటపడ్డాడు. న్యూయార్క్‌లో ఓపెన్ టెన్నిస్ శకంలోనే అద్భుత విజయానికి బాటలు వేసిన రష్యా కుర్రాడు, ఐదో సీడ్ డానిల్ మెద్వదెవ్ టైటిల్ పోరులో గొప్పగా పోరాడాడు. ఆధునిక టెన్నిస్ దిగ్గజాల్లో ఒకరైన నాదల్ చేతిలో ఓటమి పాలయ్యాడు. 7-5, 6-3, 5-7, 4-6, 6-4తో రఫెల్ నాదల్ మారథాన్ ఫైనల్లో కండ్లుచెదిరే విజయం సాధించాడు. యుఎస్ ఓపెన్‌లో నాల్గోసారి చాంపియన్‌గా అవతరించాడు.
ఊహించని మలుపులు : యుఎస్ మహిళల సింగిల్స్ ఫైనల్లో ఫేవరెట్ సెరెనా విలియమ్స్ మరోసారి భంగపడింది. 19 ఏండ్ల చిన్నది ఆండ్రిస్కూ నూతన చాంపియన్‌గా నిలిచింది. పురుషుల సింగిల్స్‌లోనూ అటువంటి ఫలితమే ఆశించేందుకు రఫెల్ నాదల్ అవకాశం ఇవ్వలేదు. క్వార్టర్‌ఫైనల్స్, సెమీఫైనల్స్‌లో ఎటువంటి విజయాలు సాధించాడో, తుది పోరులోనూ అదే ప్రదర్శన పునరావృతం చేసేలా కనిపించాడు. అందుకు తగినట్టుగానే తొలి రెండు సెట్లను 7-5, 6-3తో గెల్చుకున్నాడు. మూడో సెట్లో 3-2తో నాదల్ మెగా విజయానికి చేరువయ్యాడు. ఇక్కడే మ్యాచ్‌ను మలుపు తిప్పాడు రష్యా సంచలనం మెద్వదెవ్. మూడో సెట్లో తర్వాతి ఏడు గేముల్లో ఏకంగా ఐదు నెగ్గాడు. 7-5తో మూడో సెట్‌ను సొంతం చేసుకుని, స్పెయిన్ బుల్‌కు సవాల్ విసిరాడు. సుదీర్ఘ ర్యాలీలు, పదునైన సర్వీస్‌లతో నాదల్‌ను ఇబ్బంది పెట్టాడు. వరుస పెట్టి విన్నర్లతో సెట్‌ను సొంతం చేసుకున్నాడు.
నాల్గో సెట్లోనూ మెద్వదెవ్ జోరు కొనసాగింది. 6-4తో మెద్వదెవ్ సులువుగా సెట్‌ను గెల్చుకున్నాడు. 18 గ్రాండ్‌స్లామ్స్ విజేత డీలా పడిపోగా, తొలి గ్రాండ్‌స్లామ్ వేటలో మెద్వదెవ్ గొప్ప పోరాట యోధుడిగా కనిపించాడు. మెద్వదెవ్ నుంచి ఊహించని రీతిలో ఎదురైన ప్రతిఘటన, ఎదురుదాడికి నాదల్ బహుశా ఇంకా షాక్‌లోనే కొనసాగుతున్నట్టు అనిపించింది. మెద్వదెవ్ విలక్షణ షాట్లతో కోర్టు మొత్తం కలియతిరిగాడు. నాదల్కు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. మెద్వదెవ్ ప్రభంజనలో నాదల్ తన సహజ ఆధిపత్యాన్ని మరిచేపోయాడు. తన ఎత్తును అవకాశంగా మలుచుకున్న మెద్వదెవ్ మరింత ప్రమాదకరంగా పరిణమించాడు.
రఫెల్ నాదల్ 18 గ్రాండ్‌స్లామ్ గెలిచినా, టెన్నిస్ కోర్టులో స్పెయిన్ బుల్‌ను తెలివైన ఆటగాడిగా అంగీకరించేందుకు విముఖత చేసేవారు ఎక్కువున్నారు. అటువంటి విమర్శకులకు సమాధానం 2019 యుఎస్ ఓపెన్ టైటిల్ అని చెప్పవచ్చు. ప్రత్యర్థికి అంతు చిక్కని వ్యూహం, కొలమానం లేని షాట్లు, సంప్రదాయ విరుద్ధ రిటర్న్‌లతో మెద్వదెవ్ టెన్నిస్ ప్రియులను ఆశ్చర్యానికి గురి చేశాడు. ఆలస్యమైనా, మెద్వదెవ్ అద్భుతానికి స్పెయిన్ బుల్ చెక్ పెట్టాడు. నిర్ణయాత్మక ఐదో సెట్లో మెద్వదెవ్ 40- లవ్‌తో గేమ్ గెల్చుకునేందుకు సన్నద్ధం అవుతుండగా నాదల్ జోరందుకున్నాడు. టైటిల్ అందుకునే ప్రయత్నంలో రెండో ప్రయత్నంలో చేసిన సర్వ్‌లో సైతం నాదల్ 15-30, 30-40తో వెనుకంజలోనే నిలిచాడు. 6-4తో ఐదో సెట్‌ను సొంతం చేసుకున్న రఫెల్ నాదల్ కోర్టులోనే పడిపోయి విజయ సంబురాలు చేసుకున్నాడు. మెద్వదెవ్ 25 గేమ్‌లు నెగ్గగా, నాదల్ 28తో ఆధిక్యం సాధించాడు. మెద్వదెవ్ 111 సర్వీస్ పాయింట్లతో మెరువగా, నాదల్ 106 పాయింట్లు సాధించాడు. మెద్వదెవ్ 57 అనవసర తప్పిదాలకు చోటివ్వగా, నాదల్ 46 అనవసర తప్పిదాలు చేశాడు. మెద్వదెవ్ 14 ఏస్‌లు సంధించగా, నాదల్ 5 ఏస్‌లే కొట్టాడు. మెద్వదెవ్ 75 విన్నర్లు కొట్టగా, నాదల్ 62 విన్నర్లు సాధించాడు. నాదల్ ఐదు డబుల్ ఫాల్ట్స్‌కు పాల్పడగా, మెద్వదెవ్ నాలుగు డబుల్ ఫాల్ట్స్ చేశాడు. యుఎస్ ఓపెన్ ప్రస్థానాన్ని విలన్‌గా మొదలెట్టిన మెద్వదెవ్, అంతిమ పోరులో అద్భుత ప్రదర్శనతో హీరోగా ముగించాడు. లేటు వయసులో ఘాటు ప్రదర్శన చేసిన రఫెల్ నాదల్ 2017, 2019లలో వరుసగా ఫ్రెంచ్ ఓపెన్, యు.ఎస్ ఓపెన్ విజేతగా నిలిచాడు. గాయాలతో ఓ దశలో నాదల్ పనైపోయిందనే వ్యాఖ్యలు వినిపించినా, స్పెయిన్ బుల్ వెనక్కి తగ్గలేదు. కెరీర్ 19వ గ్రాండ్‌స్లామ్ విజయంతో దిగ్గజం రోజర్ ఫెడరర్ 20 గ్రాండ్‌స్లామ్స్ రికార్డుకు చేరువయ్యాడు.
ఎంతో రుచి..రా..! : యుఎస్ ఓపెన్ టైటిల్‌కు రఫెల్ నాదల్ శైలి ముద్దు
భావోద్వేగ బుల్ : విజయానంతరం తెరపై తన గ్రాండ్‌స్లామ్ విజయాలు చూపిస్తున్న వేళ భావోద్వేగానికి లోనైన నాదల్.
20పై ఆలోచన లేదు
ఫెడరర్ రికార్డు 20 గ్రాండ్‌స్లామ్‌పై ఆలోచన లేదు. ఎప్పుడూ చెప్పినదే ఇప్పుడూ చెబుతున్నా. అత్యధిక గ్రాండ్‌స్లామ్ నెగ్గిన జాబితాలో నేను ఉండటాన్ని ఇష్టపడతాను. కానీ నేను దాని గురించి ఆలోచించను. ఫెడరర్, జకోవిచ్‌తో ఈ పోరును గౌరవంగా భావిస్తున్నా. అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ సాధిస్తే ఎక్కువ సంతోషం, లేదంటే అసంతృప్తి అనేది నాలో ఉండదు. గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల కోసం ప్రతి రోజూ టెన్నిస్ సాధన చేయను. నేను టెన్నిస్ ఆడటాన్ని ప్రేమిస్తాను కాబట్టి ఆడతాను. టెన్నిస్ అనగానే గ్రాండ్‌స్లామ్ విజయమే కాదు, ఇంకెంతో ఉంది. ఆడినందుకే సంతోషిస్తా, విజయం నన్ను మరింత సంతోషపెడుతుంది. రాకెట్ పట్టినవేళ నేను కలలు కన్న దాని కంటే ఎంతో ఎక్కువే సాధించాను'
- రఫెల్ నాదల్