Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బజరంగ్, వినేశ్‌లపై పసిడి ఆశలు
-నేటి నుంచి ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్
ఒలింపిక్స్‌లో భారత్ పతకాలు ఆశించే క్రీడాంశాల జాబితాలో రెజ్లింగ్ ముందు వరుసలో ఉంటుంది. 2008, 2012, 2016లలో ఇలా వరుసగా రెజ్లింగ్‌లో ఒలింపిక్ పతకాలు అందుకుంది భారత్. సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్ పతక ఆశలను నిలబెట్టారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లోనూ భారత్ రెజ్లింగ్‌లో పతక ఆశలు పెంచుకుంది. వరల్డ్ నం.1 బజరంగ్ పూనియా, మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్‌లు పతకంపై ఆశలు రేకెత్తిస్తున్నారు. ఒలింపిక్స్ మెగా ఈవెంట్‌కు ముందు వాస్తవిక పరీక్ష ఎదురుచూస్తోంది. ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్‌లో బజరంగ్ పూనియా, వినేశ్ ఫోగట్ సత్తా తేల్చుకోనున్నారు.
నూర్ సుల్తాన్ (కజకిస్థాన్)
2020 టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు ఆశిస్తోన్న భారత స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, వినేశ్ ఫోగట్‌లు నేటి నుంచి ఆరంభం కానున్న ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్‌లో వాస్తవిక పోటీని పరీక్షించుకోనున్నారు. ప్రతిష్టాత్మక వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో పసడి పతకాలపై కన్నేసిన బజరంగ్, వినేశ్ ఇక్కడే ఒలింపిక్ బెర్త్లనూ దక్కించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల వరుస విజయాలతో పతకంపై ఆశలు భారీగా పెంచిన బజరంగ్ పూనియా, వినేశ్ ఫోగట్‌లు వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో పసిడి పట్టు పట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మూడు భిన్న శైలిలో ఆరు విభాగాల్లో ఆరు ఒలింపిక్ బెర్తుల కోసం రెజ్లర్లు పోటీపడనున్నారు.
పూనియా పసిడి పడతాడా? : ఈ ఏడాది బజరంగ్ పూనియా ప్రదర్శన అసమానం. గురువు యోగేశ్వర్ దత్ ప్రత్యేక శిక్షణలో రాటుదేలిన బజరంగ్.. ఈ సీజన్లో తలపడిన నాలుగు టోర్నీల్లోనూ పసిడి పతకాలు అందుకున్నాడు. డాన్ కొలొవ్, ఆసియా చాంపియన్‌షిప్స్, అలి అలీవ్, యాసర్ డొగుల్లో బజరంగ్ బంగారు ప్రదర్శన చేశాడు. పురుషుల 65 కేజీల ఫ్రీ స్టయిల్ విభాగంలో ప్రపంచ నం.1గా నిలిచాడు. బజరంగ్ పూనియా ప్రస్తుతం కెరీర్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. అతడిని ఓడించటం ప్రత్యర్థులకు అంత సులువు కాదు. కానీ బలహీన కాళ్ల బలం బజరంగ్ ప్రధాన బలహీనత. రష్యా స్టార్ రెజ్లర్ రషిదోవ్, బహ్రెయిన్ రెజ్లర్ హజి మొహమ్మద్ అలీలతో తలపడినప్పుడు కచ్చితంగా వారు బజరంగ్ కాళ్లపైనే ఫోకస్ చేస్తారు. రెండు నెలలుగా జార్జియాలో కఠోర శిక్షణ పొందుతున్న బజరంగ్ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణంపై కసిగా సిద్ధమవుతున్నాడు. సుశీల్ కుమార్ ఒక్కడే ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం సాధించిన భారత రెజ్లర్. బజరంగ్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో రెండు పతకాలు సాధించినా, స్వర్ణం ఇంకా అందలేదు. ఈసారి ఎలాగైనా పసిడి పట్టు పట్టాలనే దృడ సంకల్పంతో బజరంగ్ కనిపిస్తున్నాడు. రెండు ఒలింపిక్ పతకాల వీరుడు సుశీల్ కుమార్ మరోసారి అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఆసియా క్రీడల్లో సుశీల్ కుమార్ తేలిపోయినా, అతడు పట్టు విడువటం లేదు. 74 కేజీల విభాగంలో సుశీల్ కుమార్ పోటీపడుతున్నాడు. దీపక్ పూనియా, గుర్ప్రీత్ సింగ్‌లు జాతీయ స్థాయిలో సత్తా చాటినా, వరల్డ్ వేదికపై నిరూపించుకోవాల్సి ఉంది. 18 ఏండ్ల ప్రాయంలోనే జూనియర్ వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన దీపక్ పూనియా.. సీనియర్ విభాగంలో తన ఎంట్రీ గ్రాండ్‌గా ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకు కండ్లుచెదిరే ప్రదర్శన చేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు.
వినేశ్‌పైనే ఆశలు : మహిళల విభాగంలో వినేశ్ ఫోగట్‌పై భారత్ పసిడి ఆశలు పెట్టుకుంది. ఈ సీజన్లో వినేశ్ నూతన వెయిట్ విభాగానికి మారింది. మూడు కేజీల బరువు పెరిగి 50 నుంచి 53 కేజీల ఫ్రీ స్టయిల్ విభాగానికి మారింది. ఆరంభంలో హెవీ వెయిట్ విభాగంలో కుదురుకునేందుకు ఇబ్బంది పడినా, ప్రస్తుతం గాడిలో పడింది. ఈ సీజన్లో ఏకంగా ఐదు ఫైనల్స్‌లో తలపడిన వినేశ్.. యాసర్ డోగు, స్పెయిన్ గ్రాండ్ ప్రీ, పొలాండ్ ఓపెన్లలో పసిడి పతకాలు సాధించింది. వినేశ్ విషయంలో నైపుణ్యం సమస్య కాదు. కానీ బలమైన రెజ్లర్లను ఆరు నిమిషాల పాటు నిలువరించగల శారీరక శక్తి ఆమెకు సమస్యగా మారుతోంది. ఇదే విషయాన్ని వినేశ్ సైతం అంగీకరించింది. తెలివిగా ఆడటంలో దిట్ట అయినా పవర్ఫుల్ పట్టుతో వినేశ్ ముందుకు రావాల్సి ఉంది. మోచేతి గాయంతో బుదాపెస్ట్ చాంపియన్‌షిప్స్‌కు దూరమైన వినేశ్, కెరీర్ తొలి వరల్డ్ మెడల్‌పై కన్నేసింది. మహిళల విభాగంలో ఇప్పటివరకూ భారత అథ్లెట్ ప్రపంచ చాంపియన్‌షిప్స్ పతకం సాధించలేదు. ఈ నిరీక్షణకు తెరదించాలని వినేశ్ ఫోగట్ ఎదురుచూస్తుంది. మెన్స్ విభాగంలో సుశీల్ కుమార్ మాదిరిగానే, మహిళల విభాగంలో సాక్షి మాలిక్ ప్రదర్శన తీసికట్టుగా తయారైంది. కామన్వెల్త్ క్రీడల పతకం తర్వాత సాక్షి మాలిక్ మెరుగైన ప్రదర్శన చేయటంలో నిలకడగా విఫలమవుతోంది. సీజన్ ముగింపులో డాన్ కొలొవ్లో రన్నరప్‌గా నిలిచింది. అప్పుడు, సెమీఫైనల్లో డిఫెండింగ్ వరల్డ్ చాంపియన్ పెట్రా ఒలీని మట్టికరిపించిన సాక్షి మాలిక్, అదే స్ఫూర్తితో వరల్డ్ చాంపియన్‌షిప్స్‌కు సిద్ధమవుతోంది. వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో పతకం సాధించిన నాల్గో భారత మహిళా రెజ్లర్‌గా నిలిచిన పూజ దండ ఇప్పుడూ పతకంపై గురి పెట్టింది. నేషనల్ ట్రయల్స్‌లో పూజకు షాకిచ్చిన సరితా మోర్ ప్రదర్శనపై ఆసక్తి నెలకొంది.
ప్రపంచ చాంపియన్‌షిప్స్‌కు భారత బృందం :
మెన్స్ ఫ్రీ స్టయిల్ : రవికుమార్ (57 కేజీలు), రాహుల్ అవారె (61 కేజీలు), బజరంగ్ పూనియా (65 కేజీలు), కరణ్ (70 కేజీలు), సుశీల్ కుమార్ (74 కేజీలు), జితేందర్ (79 కేజీలు), దీపక్ పూనియా (86 కేజీలు), పర్వీన్ (92 కేజీలు), మౌసం కత్రి (97 కేజీలు), సుమిత్ మాలిక్ (125 కేజీలు).
మెన్స్ గ్రీకో-రోమన్ : మంజిత్ (55 కేజీలు), మనీశ్ (60 కేజీలు), సాగర్ (63 కేజీలు), మనీశ్ (67 కేజీలు), యోగేశ్ (72 కేజీలు), గుర్ప్రీత్ సింగ్ (77 కేజీలు), హర్‌ప్రీత్ సింగ్ (82 కేజీలు), సునీల్ కుమార్ (87 కేజీలు), రవి (97 కేజీలు), నవీన్ (130 కేజీలు).
మహిళల ఫ్రీ స్టయిల్ : సీమ (50 కేజీలు), వినేశ్ ఫోగట్ (53 కేజీలు), లలిత (55 కేజీలు), సరిత (57 కేజీలు), పూజ దండ (59 కేజీలు), సాక్షి మాలిక్ (62 కేజీలు), నవ్‌జ్యోత్ కౌర్ (65 కేజీలు), దివ్య కక్రన్ (68 కేజీలు), కోమల్ భగవాన్ (72 కేజీలు), కిరణ్ (76 కేజీలు).