Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధ్యతాయుత ఇన్నింగ్స్‌పై రిషబ్ ఫోకస్
- నేడు సఫారీతో రెండో టీ20 పోరు
2020 టీ20 ప్రపంచకప్ సమర సన్నాహకంలోకి అడుగుపెట్టిన కోహ్లిసేన స్వదేశంలో ఇంకా తొలి మ్యాచ్ ఆడనే లేదు. అయినా, బ్యాటింగ్ లైనప్‌లో ఓ బ్యాట్స్‌మన్‌పై ఒత్తిడి పెరిగిపోతుంది. చీఫ్ కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లి ఇటీవల ఇచ్చిన ఇంటర్య్వూల్లో ఓ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. రిషబ్ పంత్ కుర్రతనంతో తన వికెట్‌ను వదులుకుంటే కుదరదని తెగేసి చెప్పారు. సహజసిద్ధంగా దూకుడుగా ఆడే పంత్.. ఇటీవల చెత్త షాట్లతో వికెట్ కోల్పోయాడు. ప్రపంచకప్ సెమీఫైనల్లో కీవీస్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్న పంత్ నిగ్రహలేమి షాట్‌తో వికెట్ కోల్పోయి, గెలుపు అవకాశాలు సన్నగిల్లేలా చేశాడు. 2020 ప్రపంచకప్ ప్రణాళికలో పడిపోయిన కోహ్లిసేన.. ముందుగా రిషబ్ పంత్ గాడిలో పడాలని భావిస్తోంది. చంఢగీడ్ టీ20లో రిషబ్ పంత్‌పైనే ఒత్తిడి నెలకొంది!.
నవతెలంగాణ-చంఢగీడ్
ధర్మశాల ధనాధన్ వర్షార్పణంతో మూడు మ్యాచుల టీ20 సిరీస్ రెండు మ్యాచుల చావోరేవోగా మారింది. ఒక్క మ్యాచ్‌లో ఓడినా సిరీస్ సొంతం చేసుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో వరుసగా రెండు మ్యాచుల్లోనూ భారీ విజయాలపై కన్నేసింది కోహ్లిసేన. యువ సైన్యంతో దక్షిణాఫ్రికా కొత్త ఆరంభం కోసం ఎదురు చూస్తోంది. క్వింటన్ డికాక్ సారథిగా విజయంతో తొలి అడుగు వేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు. బలమైన కరీబియన్లపై క్లీన్‌స్వీప్ విజయం సాధించిన టీమ్ ఇండియా, సొంతగడ్డపై ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. దక్షిణాఫ్రికా, భారత్ రెండో టీ20 మొహాలీలో నేడు జరుగుతుంది.
బాధ్యతతో ఆడితేనే.. : 2020 టీ20 ప్రపంచకప్‌కు మరో 12 మాసాల గడువే ఉంది. ఈ సమయంలో కోహ్లిసేన మరో 20 టీ20 ఆడాల్సి ఉంది. ఈ 20 మ్యాచుల్లోనే ప్రపంచకప్ జట్టు ఎలా ఉండాలో కెప్టెన్ నిర్ణయించుకోనున్నాడు. దీంతో ప్రతి మ్యాచ్‌లోనూ యువ ఆటగాళ్ల నుంచి జట్టు మేనేజ్మెంట్ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌లను ఆశిస్తోంది. ఈ క్రమంలో తొలుత రిషబ్ పంత్‌పై ఒత్తిడి నెలకొంది. ప్రతిభావంత బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించేందుకు మొగ్గు చూపుతాడు. క్రీజులో మెరుగ్గా కనిపించినా, అనవసర షాట్లతో వికెట్ కోల్పోతున్నాడు. యువ ఆటగాడు పాఠాలు నేర్చుకుంటాడని భావించినా, పంత్‌లో పరిణితి ఆశించిన స్థాయిలో కనిపించటం లేదు. జట్టు భయం లేని క్రికెట్ కోరుకుంటుంది కానీ బాధ్యత లేని బ్యాటింగ్‌ను కాదని స్పష్టమైన సంకేతం అందించింది. ధర్మశాల నుంచి చంఢగీడ్ రాగానే పంత్ నెట్స్‌లోకి వెళ్లి సాధన చేశాడు. నేడు మెరుగైన ఇన్నింగ్స్ ఆడేందుకు పంత్ ఎదురుచూస్తున్నాడు. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కరీబియన్ దీవుల్లో ఆశించిన స్థాయిలో రాణించలేదు. మొహాలీలో భారీ ఇన్నింగ్స్‌లు ఆడిన రికార్డు ధావన్ సొంతం. ఇప్పుడు సఫారీలపైనా మరో మెరుపు ఇన్నింగ్స్‌తో ఫామ్ సాధించాలని గబ్బర్ భావిస్తున్నాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఫామ్‌లో ఉన్న కెఎల్ రాహుల్ అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. మిడిల్ ఆర్డర్లో మనీశ్ పాండేకు తుది జట్టులో అవకాశం కొనసాగనుంది. నాయకులు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ బ్యాటింగ్ లైనప్‌ను ముందుండి నడిపించనున్నారు. టీ20 ప్రపంచకప్‌లో టెయిలెండర్లు సైతం బ్యాట్‌తో మెరవాలనేది కోహ్లిసేన లక్ష్యం. అందుకే వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్‌లను జట్టులోకి తీసుకుంది. మిడిల్ ఓవర్లలో వికెట్ల సాధనపై దీని ప్రభావం ఎలాగున్నా.. ఛేదనలో లోయర్ ఆర్డర్ ప్రభావశీలంగా ఉంటుందని కోహ్లి భావన. నవదీప్ షైని, ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్‌లు పేస్ విభాగంలో వరుసగా రెండో సిరీస్‌కు ఎంపికయ్యారు. ఆల్‌రౌండ్ సోదరులు హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య మరోసారి సంయుక్త విన్యాసాలకు సిద్ధమవుతున్నారు.
యువ నాయకుడు క్వింటన్ డికాక్‌కు భారత్‌పై తిరుగులేని రికార్డుంది. ఓ దశలో భారత్‌పై వరుస శతకాలతోనే సఫారీ జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నాడు. ఇప్పుడు భారత్‌తో సిరీస్‌తోనే నాయకత్వ ఇన్నింగ్స్ మొదలెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. 2020 ప్రపంచకప్ దృష్ట్యా యువ ఆటగాళ్లనే డికాక్‌ను ఇచ్చింది సీఏ. సీనియర్ ఆటగాళ్లు డెవిడ్ మిల్లర్, వాన్‌డర్ డసెన్, ఫెలుక్వయోలు డికాక్‌కు అండగా నిలువనున్నారు. కగిసో రబాడ, జూనియర్ డాల కోహ్లిసేనకు పేస్ సవాల్ విసిరేందుకు సిద్ధంగా ఉన్నారు.
పిచ్, వాతావరణం : ధర్మశాల వాతావరణ స్వభావం తొలి టీ20 జరుగనీయలేదు. కుండపోత వర్షంతో ధనాధన్ సమరం మొదలవ్వలేదు. నేడు మొహాలీ పోరుకు వర్షం ముప్పు లేదనే చెప్పాలి. ఉక్కపోత అధికంగా ఉన్నప్పటికీ, వర్షం ఆటంకం కలిగించేందుకు ఆస్కారం చాలా తక్కువ. మొహాలీ సహజసిద్ధంగా పేస్ బౌలర్ల స్వర్గధామం. ఐపీఎల్ రాకతో మొహాలీలో బ్యాట్స్‌మెన్ రాజ్యమేలుతున్నారు. నేడు అదే పరిస్థితి కొనసాగేందుకు వీలుంది. టాస్ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకునేందుకు మొగ్గు చూపవచ్చు.
తుది జట్లు (అంచనా) :
భారత్ : శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, మనీశ్ పాండే, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, దీపక్ చాహర్, నవదీప్ షైని, వాషింగ్టన్ సుందర్, ఖలీల్ అహ్మద్.
దక్షిణాఫ్రికా : క్వింటన్ డికాక్, వాన్‌డర్ డసెన్, తంబ బవుమా, రీజా హెండ్రిక్స్, డెవిడ్ మిల్లర్, ఫోర్టిన్, ఫెలుక్వయో, ప్రిటోరియస్, కగిసో రబాడ, జూనియర్ డాల, షంషి.